రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడు ఇప్పుడు రీల్ లైఫ్ మామా అల్లుళ్లు కాబోతున్నారు. వారెవరంటారా? వెంకటేష్, నాగచైతన్య. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో చైతూ హీరోగా తెరకెక్కిన 'ప్రేమమ్' చిత్రంలో జస్ట్ కాస్సేపు గెస్ట్ రోల్‌లో కనిపించాడు వెంకటేష్. కాస్సేపే కనిపించినా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది ఆ సీన్. నటించినట్లుగా కాదు, జీవించినట్లుగానే ఉంటుంది. అదింకా జస్ట్ సీన్ అంతే. మరిప్పుడు ఫుల్ లెంగ్త్ మామా అల్లుళ్లలా కనిపించబోతున్నారు.
ఇంకేం సందడే సందడి. రచ్చ రచ్చే. ఇటు వెంకీ అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఫుల్ జోష్‌గా ఉన్నారు ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పట్నుంచీ. అన్నట్లు ఈ సినిమాకి టైటిలేంటో తెలుసా? 'వెంకీ మామ'. ఇది కూడా మోస్ట్ నేచురల్ కదా. అందుకే టైటిల్ దగ్గర నుండే ఈ సినిమాకి పోజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. చైతూ చేతిలోనూ బోలెడన్ని సినిమాలున్నాయి. వాటిలో 'సవ్యసాచి' రిలీజ్‌కి రెడీగా ఉంది. అలాగే చైతూ మరో చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
|