దగ్గుబాటి ఆజానుబాహుడు రానా హీరోగా తెరంగేట్రం చేసిన 'లీడర్' మూవీ మంచి విజయం అందుకుంది. శేఖర్ మ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా నటన చూసి, రానాలో ఏదో విషయం ఉందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆ తర్వాతి నుండీ రానా భిన్న కథలను, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. 'బాహుబలి' రానా స్టార్‌డమ్‌ని పెంచేసింది. ఇకపోతే, తొలి చిత్రం 'లీడర్' టైంలోనే ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు రానా. కానీ కుదరలేదు. ఇన్నాళ్ల తర్వాత రానా కోరిక నెరవేరబోతోంది. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ 'లీడర్' తర్వాత రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చినప్పటికీ, 'లీడర్' కథా, కథనానికి, 'నేనే రాజు నేనే మంత్రి' కథనానికి చాలా తేడా ఉంటుంది. ఇకపోతే, 'లీడర్'కి సీక్వెల్‌గా సాగేలానే త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతోందట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడనీ తెలుస్తోంది. క్రిష్ - రానా కాంబినేషన్‌లో వచ్చిన 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం కూడా రానాకి హీరోగా మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబినేషన్ ఈ రకంగా కుదిరేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో రానా ఉన్నాడట. మరోవైపు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి ఎప్పుడు ఈ తాజా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో చూడాలి మరి.
|