విశ్వనటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విశ్వరూపం' వివాదాల నడుమ విడుదలైనా ఘన విజయం అందుకుంది. దర్శకుడిగా కమల్‌హాసన్ టేకింగ్, ఆయన నటనకు ఎప్పటిలాగే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అదే 'విశ్వరూపం 2'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ సంగీతంతో ముడి పడి ఉంటుందట. జిబ్రాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
అందాల భామలు ఆండ్రియా, పూజా కుమార్ నటన మరో ప్రధాన ఆకర్షణ కానుందట. ముఖ్యంగా డీప్ వాటర్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కొత్త అనుభూతికి గురి చేస్తాయట. గూఢచారి పాత్రలో కమల్ నటిస్తున్న ఈ సినిమా 'విశ్వరూపం' సినిమాకి ప్రీక్వెల్ మరియు సీక్వెల్ అని కమల్ అంటున్నారు. అందుకే 'విశ్వరూపం' చూడని వారికి కూడా ఈ సినిమా అర్ధమవుతుందట. అంటే తొలి పార్ట్‌లోని కథను ఈ పార్ట్‌లో కూడా చూపించనున్నారట. ఈ సినిమా విడుదల విషయంలో జరిగిన వివాదాలే ఈ సినిమాకి మెయిన్ ప్రమోషన్స్ అని కమల్ చెబుతున్నారు. ఆల్రెడీ జనంలో ఈ సినిమాపై ఓ రకమైన ఆశక్తి నెలకొంది. సో విడుదల ఆలస్యమైనా, సినిమాకి పెద్దగా నష్టం చేకూరదు. ఖచ్చితంగా అంచనాలను అందుకునే సినిమాగా 'విశ్వరూపం 2' నిలుస్తుంది అని కమల్ నమ్మకంగా చెబుతున్నారు. ఆయన చెప్పినట్లు, కమల్‌హాసన్ నట 'విశ్వరూపం' చూడాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేస్తే సరిపోతుంది.
|