పురాణకాలంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, గురుకులానికి వెళ్ళి, వివిధ రకాల విద్యలూ నేర్చుకునేవారు.. విద్య నేర్చుకున్నంత కాలం, అక్కడే అంటే గురుకులంలోనే , తిండి, బస కూడా.. రకరకాల విద్యలు—అస్త్రశస్త్ర విద్యలు, జ్యోతిష్, తర్క, మీమాంస విద్యలు కూడా నేర్పేవారు.మరో విషయమేమిటంటే, ఆరోజుల్లో గురువులు కూడా అన్ని విద్యలలోనూ నిష్ణాతులుగా ఉండేవారు.
పురాణ కాలంలోనే కాక, ఆధునిక కాలంలో కూడా, పాఠశాలల్లో, ఉపాధ్యాయులు అన్ని రకాల subjects చెప్పగలిగేవారు.. పూర్తి జ్ఞానం కాకపోయినా, ఎంతో కొంత తెలిసుండేది. గుర్తుండే ఉంటుంది—చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో , కొన్నిచోట్ల ఒకే మాస్టారుండేవారు.. ఆయనే అన్ని పాఠాలూ చెప్పేవారు.. అలాగే హైస్కూలుకి వచ్చాక కూదా, ప్రతీ ఉపాధ్యాయుడికీ , ప్రతీ సబ్జెక్ట్ లోనూ ఎంతోకొంత పరిజ్ఞానం ఉండేది.. అంతదాకా ఎందుకూ, మనకి ప్రధమ గురువైన “ అమ్మ “ కి ఎన్నెన్ని తెలిసేవో? ఆరోజుల్లో ఆవిడ ఏమీ స్కూలుకికానీ, కాలేజీకి కానీ వెళ్ళలేదే? అయినా మన భావిజీవితానికి కావాల్సిన ఎన్నొ విషయాలు నేర్పేది.. కారణం పురాణ ఇతిహాసాలు క్షుణ్ణంగా చదివేవారు.
ఇంక హైస్కూలుకి వెళ్ళేసరికి , అన్ని సబ్జెక్ట్సూ మాతృభాషలోనే నేర్చుకునేవారం. అలాగని ఇంగ్లీషుని అశ్రధ్ధ చేయలేదు, అలాగే రాష్ట్రభాష హిందీ లోకూడా, కొంతైనా అంటే అక్షరాలు నేర్చుకోవడమైనా ఉండేది. అలాగే తెలుగులో వ్యాకరణం, ఇంగ్లీషులో Grammar కూడా నేర్పేవారు. అలాటిది ఒక్కసారిగా కాలేజీ కి వెళ్ళేసరికి అకస్మాత్తుగా అన్ని సబ్జెక్ట్సూ ఇంగ్లీషులో చెప్పేవారు.. అయినా హైస్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీషు ధర్మమా అని, పాఠాలు అర్ధమయేవి.
అలాగే హైస్కూలు చదువుల్లో పరీక్షల దగ్గరకొచ్చేసరికి, సైన్స్, సోషల్, లెఖ్ఖలకీ రెండేసి పేపర్లుండేవి.. ఒకటి subjective 60-70 మార్కులకీ, రెండోది objective అంటే , ఇచ్చిన ఆన్సర్లలో ఏదో ఒకటి ఎంచుకోవడం. వీటికి 40-30 మార్కులుండేవి.. ఆతావేతా మొత్తం మీద పరీక్షలో పాస్ అవడానికి కావాల్సిన మార్కులొచ్చేసేవి. బాగా చదివేవారికి, మహా అయితే 70% - 80% దాకావచ్చేవి. వారికి మెడిసిన్ లోనూ, ఇంజనీరింగులోనూ , గ్యారెంటీగా సీట్లొచ్చేసేవి. ఇంక మిగిలిన అత్తిసరు మార్కుల వారైతే ఊళ్ళోనే ఉన్న కాలేజీలో చేరి , ఏ బీకామ్మో, బిఎస్సీ యో, ఏ బియ్యే యో చదివేవారు.
హైస్కూల్లోకానీ, కాలేజీలో కాని, మనకి పాఠాలు అంతగా అర్ధమవకపోతే, ఆ మాస్టార్లే , విడిగా కూడా చెప్పేవారు… అంతేకానీ ఈరోజుల్లోలాగ వీధికో ఫలానా క్లాసెస్ అని గంటకి వేలల్లో వసూలుచేసేవారు కాదు… ఆ రోజుల్లో 50% వస్తే Second Class, 60% వస్తే First Class, ఆపైన వస్తే Distinction అనేవారు.ఆరొజుల్లో చదువుకున్న ఎందరో మేధావులు దేశవిదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు… విద్యాభాసం అనేది చాలా పవిత్రంగా ఉన్నరోజులవి..
ఎప్పుడు అకస్మాత్తుగా పరిస్థితి మారిపోయిందో కానీ, ఈరోజుల్లో విద్య అనేది వ్యాపారాత్మకమైపోయింది.మనం కట్టే ఫీజుల్లాగానే మార్కులు కూడా 99, 100 దాకా వస్తున్నాయి. ప్రతీదీ డబ్బుతోనే లంకె.. ఒకానొకప్పుడు రాష్ట్రంలో పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీలు, ఓ నాలుగు విశ్వవిద్యాలయాలూ ఉండేవి. స్కూళ్ళు రాష్ట్రప్రభుత్వాల ఆధీనంలోనూ ఉండేవి. హైస్కూలుకి వెళ్ళాలంటే, దగ్గరలో ఉండే ఏ పెద్ద పట్టణానికో వెళ్ళాల్సొచ్చేది. అలాటిది ఈ రోజుల్లో ఒక్కో ఊరికీ ఓ పది పదిహేను స్కూళ్ళూ, కాలేజీలూ వచ్చేసాయి… కానీ వీటి ధర్మమా అని దెబ్బతిన్నవి మాత్రం ప్రభుత్వ పాఠశాలలూ, కాలేజీలూ అని మాత్రం చెప్పడంలో సందేహం లేదు. కారణం – ఈ కార్పొరేట్ స్కూలు/ కాలేజీల్లో బోధనా రుసుము వేలల్లో వసూలు చేస్తారు, అందరికీ అందుబాటులో ఉండదు. ఇంక బోధనా విషయానికొస్తే , ఇంగ్లీష్ లో మాత్రమే. దీనితో మాతృభాష వెనక్కి వెళ్ళిపోయింది.
ఎవరినోటవిన్నా, మాతృభాషలో నేర్చుకుంటే , భవిష్యత్తుండదని.. మరి ఆరోజుల్లో, స్కూల్లో మాతృభాషలోనూ, కాలేజీకి వెళ్ళిన తరువాత ఇంగ్లీషులోనూ నేర్చుకున్నవారందరూ, ఈనాడు దేశవిదేశాల్లో , అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకున్నారుట?.. బోధనా పధ్ధతి ఏ భాషైనా, విద్యార్ధి నేర్చుకోవాలనే తపన మీద ఆధారపడుతుంది కానీ, తాను వేలకువేలు పోసి చదివిన కార్పొరేట్ స్కూళ్ళలో మాత్రం కాదు అన్నది నిస్సందేహం.
ఇంక ట్యూషన్లకొస్తే, ఈ రోజుల్లో సందుకి రెండో మూడో , ఫలానా..ఫలానా క్లాసెస్ అని బోర్డులు చూస్తూంటాం. అంటే దానర్ధం, ఈరోజుల్లో స్కూలు/కాలేజీల్లో బొధన సవ్యంగా జరగనట్టే కదా…
ఇంత జరుగుతూన్నా, ప్రభుత్వాలకేమీ పట్టదు.. ముఖ్య కారణం—ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ, ఏ రాజకీయనాయకుడి పెట్టుబడో అయుండడం…
సర్వేజనా సుఖినోభవంతూ….
|