Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The mother tongue goes back.

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

పాపం..ఆయన!

మా నాన్నగారు భ్రాంకైటీస్ తో ఊపిరాడక బాగా ఇబ్బంది పడుతుంటే, ఆయణ్ని నిమ్స్ లో చేర్చాం. జనరల్ వార్డ్ లో ఆయనకు చికిత్స జరుగుతుండేది. మా అమ్మ దాదాపు అక్కడే ఉండేది కాని నేను మాత్రం ఉదయం సాయత్రం కూకట్ పల్లిలో ఉండే మా మామయ్య వాళ్లింట్లోంచి అమ్మకు, నాన్నకు టిఫిన్ తెచ్చి పెట్టేవాడిని. నాకు మొదటి నుంచి వార్డ్ లో ఉన్న అందరితో సరదాగా మాట్లాడడం అలవాటు. ఎందుకంటే, పేషెంట్లుగా ముద్రేయించుకుని తమకొచ్చిన వ్యాధితో బెంగగా, నిరాశగా బెడ్ మీద పడుకుని ఉంటారు. వాళ్లతో చలాకీగా ‘వ్యాధి త్వరలోనే ఫట్ మని మాయమైపోతుంది, మామూలు జీవనంలో పడ్డాక నన్ను గుర్తుంచుకోవాలి సుమా’ అని ఓ నాలుగు జోకులతో..నాలుగు మంచి మాటలు మాట్లాడితే, కాస్సేపయినా మామూలైపోతారు. అది ఆసుపత్రని, తాము పేషెంట్లమనీ మరచిపోతారు. 

మా నాన్నగారి పక్కబెడ్ మీదకి ఒకాయన్ని రెండురోజుల క్రితమే చేర్చారు. ఆయనకేదో గుండె ఆపరేషన్ జరిగిందట, ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు. నేనెళ్లినప్పుడు ఆయనతో, వాళ్లావిడతో, పిల్లలతో (ఒకమ్మాయి, అబ్బాయి చిన్నపిల్లలు) చాలా సరదాగా మాట్లాడేవాణ్ని.

ఆ రోజు మా నాన్నగార్ని డిస్చార్జ్ చేసే రోజు. మా అందరికీ సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా నాన్నగార్కి- ఆఫీసుకు వెళ్లిపోవచ్చని.
నేను వెళ్లంగానే వార్డ్ బైట గోడవారగా ఉన్న బెంచి మీద కూర్చున్నారు ఆవిడ పిల్లలతో. నన్ను చూడంగానే నవ్వుతూ ’ ఇవాళ మీ నాన్నగారి డిస్చార్జట కదా. వాళ్లు అన్నీ సిద్ధం చేసుకుని కూర్చుని, మీకోసం ఎదురుచూస్తున్నారు’ అందావిడ. ’ఇవాళ మా నాన్నగారు డిస్చార్జ్ అవుతారు. రేపు ఆయన డిస్చార్జ్ అవుతారు. ఇంటికెళ్లాక ఈ బుజ్జి పిల్లలతో ఆడుకుంటారు’ అని వాళ్ల చేతుల్లో చాక్లెట్లు పెట్టాను.
లోపలికెళ్లబోతూ "మీ వారిని చూశారా?"అన్నాను.

"అరగంట నుంచి ఆయన దగ్గరే ఉన్నాం. ఇప్పుడే ఇలా బయటకు వచ్చాం. సిస్టర్స్ విసుక్కుంటారు కదా!"అంది.

పిల్లలు దూరంగా స్తంబం దగ్గర ఆడుకుంటున్నారు. నేను లోపలికి అడుగుపెట్టి, మా నాన్నగారి బెడ్ దగ్గరకు వెళ్లి, అప్పటికే అన్నీ సర్ది ఉంచడం చేత బాస్కెట్స్ తీసుకుని బయటకి వెళ్లడానికి సిద్ధపడుతుండగా ఉన్నట్టుండి పక్క బెడ్ ఆయనకేదో అయినట్టుంది, గబ గబ అక్కడే ఉన్న సిస్టర్ అది గుర్తించి కొద్ది దూరంలో ఉన్న డ్యూటీ డాక్టర్ కి ఏదో చెప్పింది. ఆయన ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తూండగానే, సిస్టర్స్ ఆ బెడ్ చుట్టూ గ్రీన్ కర్టెన్స్ ఉన్న స్టాండ్స్ పెట్టేశారు. లోపల ఆయనకేదో అయింది. పాపం. ’సార్ మీరు డిస్చార్జ్ అయ్యారు కదా! ఇక్కడినుంచి వెళ్లిపోవాలి ప్లీజ్" అంటూ అక్కడున్న మరో నర్స్ మమ్మల్ని అభ్యర్థించింది. మేము చిన్నగా బయటకు వెళ్లడానికి అడుగులేస్తున్నాము. నాలుగు అడుగులేయంగానే నాతో ఫ్రెండ్లీగా ఉండే మరో సిస్టర్ ఏదో పనిమీద ఆ కర్టెన్స్ చాటునుంచి బయటకొచ్చింది. నేను వెంటనే ఆవిణ్ని ’ఆయనకెళాఉందని?’ అడిగాను.

‘సారీ..వెరీ సీరియస్’ అంది.

నా గుండె బిగుసుకుపోయింది.

మేము బరువైన హృదయాలతో బయటకొచ్చాము.

తలుపు దాటి ఇవతలకు రాగానే..గోడకివతల ‘మా ఆయనకేంగాదు’ అన్న ధీమాతో ఆవిడ, ‘మా నాన్న ఇంటికొచ్చి మాతో ఆడుకుంటాడులే’ అన్న నమ్మకంతో పిల్లలూ సంతోషంగా మాకు చేతులూపుతున్నారు.

‘దేవుడి దయవల్ల ఆయనకేం కాకూడదు’ మనసులో గట్టిగా అనుకుంటూ హాస్పిటల్ ప్రెమిసెస్ ఎలా దాటామో మాకే తెలీదు.

ఆ తర్వాతేమయిందో కూడా నేను తెలుసుకోలేదు. ఎందుకంటే ఆయన బతికుంటాడన్నది నా బలమైన భావన.

ఇది జరిగి చాలా కాలమయిపోయింది. అయినా ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్లినప్పుడు, లోపల పేషెంట్ల కోసం బయట ఎదురుచూసే ఆత్మీయులని చూసినప్పుడల్లా ఆ సంఘటనే గుర్తొస్తుంది. మనసును కలచివేస్తుంది.

పాపం..ఆయన!

వాళ్లని తల్చుకుంటే మనసు చెమ్మగిల్లుతుంది.

***

మరిన్ని శీర్షికలు
pesarapappucharu