సాధారణంగా పత్రికలు ధారావాహికలను ప్రారంభించేముందు వాటి రచయిత(త్రి) పేరుని హైలైట్ చేస్తూ పబ్లిసిటీ ఇస్తాయి.ఎందుకంటే ప్రతి రచయిత(త్రి)కీ ఒక అభిమాన వర్గం, పాఠకుల్లో ఒక అంచనా ఉంటాయి....వారిని చేరుకోవడానికి రైటర్ పేరూ ముఖ్యమే....అయితే, అసలెవరు రాస్తున్నారో తెలీకుండా, ఏం రాస్తున్నారనేదాని మీద పాఠకులకు ఆసక్తి కలిగిస్తూ, ఎవరు రాస్తున్నారు ఇంతమంచి సీరియల్ ని అని కూడా పాఠకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తూ రైటర్ పేరును దాచి సీరియల్ ప్రారంభించే సరికొత్త ప్రయోగానికి తెర తీసింది మీ గోతెలుగు...
ఈ ప్రయోగాన్ని ఆదరిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు...
ఎవరు రాస్తున్నారనేది ఎప్పుడు ప్రకటిస్తారా అని ఇప్పటికే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు.తప్పకుండా ప్రకటించేస్తాం...అయితే అంతకంటే ముందు, వారెవరో పట్టుకోవడానికి మీ ప్రశ్నలను సంధించమని పాఠకులను కోరాం....ఎంతోమంది ఉత్సాహంగా ప్రశ్నలు పంపించారు...రైటర్ ని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు....ఆ ప్రశ్నలన్నిటినీ కలిపి ఒక ఇంటర్వ్యూ లాగా తయారు చేసి రైటర్ మీదికి వదిలాం....మరి వారు చిక్కారో లేదో తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ లోకి వెళ్ళాల్సిందే.....
గోతెలుగు : నమస్కారమండీ..
? :న ’మస్కా‘ రమండి.
గోతెలుగు : మీరెవరు?
? : నేనేనండీ...మీ అభిమాన రైటర్ ని..
గోతెలుగు : ఇంతకుముందేమైనా రాసారా? గోతెలుగుకి ఏం రాసారు?
? : ఆఁ..చాలా! రాశాను...మీ అభిమానాన్ని దోచుకున్నాను...
గోతెలుగు : మరి ఎందుకిలా అజ్ఞాతంలో ఉండి రాస్తున్నారు?
? : ఎందుకేమిటి...కొత్తదనం కోసమే..!
గోతెలుగు : ఇలా మీరెవరో తెలీకుండా సీరియల్ రాయాలనే ఆలోచన మీకెలా వచ్చింది? ఎవరిచ్చారు?
? : ఆలోచన, అవకాశం అన్నీ ఇచ్చింది మీ, మా, మనందరి గోతెలుగే..
గోతెలుగు : మిమ్మల్ని మేమెవరమూ పట్టుకోలేమని అనుకుంటున్నారా?
? : నేనలా అనుకుంటున్నానని మీరెప్పుడూ అనుకోవద్దు...నేనెక్కడికీ పరిగెత్తట్లేదు....సీరియల్ ని పరిగెత్తిస్తున్నానంతే....
గోతెలుగు : మీరెవరో ఆల్రెడీ మాకు తెలిసిపోయిందనే విషయం మీకు తెలుసా?
? : తెలుసు. ఎవరికి వారు మనసులో దాచుకున్నారనీ తెలుసు.
గోతెలుగు : దేవలోకంలో మొదలైన కథ భూలోకానికి చేరింది...ఇక్కడి నుంచి ఇంకెక్కడికి తీస్కెళతారు?
? : ఎక్కడికి తీస్కెళ్ళినా ఆసక్తిలోంచి మాత్రం మిమ్మల్ని బయటికి రానివ్వను....
గోతెలుగు : కాత్యయనికేం జరగదు కదా?
? : జరగబోయేది మీరే చూస్తారు కదా...మీతోబాటు నేనూ చూస్తూనే ఉంటాను....
గోతెలుగు : అమ్మాయిల జీవితాలు కాత్యాయని లాగే ఉంటున్నాయనా మీ ఉద్దేశం?
? : కాత్యాయని కూడా అందరు అమ్మాయిల్లాంటిదే కదా...
గోతెలుగు : సరే, మీరెవరు?
? : కాత్యాయని రైటర్నండీ..!
గోతెలుగు : మీ పేరు మాకు తెలుసు, చెప్పేయమంటారా?
? : ఎంత తెలిస్తే మాత్రం. చెప్పులు..బూట్లు వేయాలా.
గోతెలుగు : మీకిదే మొదటి సీరియల్ అని ఒకరూ, కాదని మరొకరూ పెద్దగా గొడవ పడి కొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు, అందులో ఎవరు కరెక్ట్ చెప్పండి.
? :ఎవరు కరెక్టో చెప్పడం చాలా సింపుల్ అండీ...ఇద్దరిలో ఒకరు కచ్చితంగా కరెక్ట్....కావాలంటే కోర్టుకు వెళితే జడ్జిగారు చెబుతారు.....
గోతెలుగు : ఇలా తప్పించుకుని ఎంత కాలం అజ్ఞాతంలో ఉండిపోతారు?
? : అజ్ఞాతం నుండి బయటకు వచ్చేవరకు.....
గోతెలుగు : మీ పేరు సస్పెన్స్ కాకుండా ఈ సీరియల్ లోని సస్పెన్స్ గురించి చెప్పండి.
? : సస్పెన్స్ అంటేనే చెప్పకుండా తెలుసుకునేది..మళ్ళీ నేను చెబితే అది సస్పెన్స్ ఎలా అవుతుంది....
గోతెలుగు : సరే ఎంత కాలం ఇలా దాక్కుంటారో చూస్తాం...ఆల్ ద బెస్ట్....
? :చూద్దాం ఎంతకాలానికి కనుక్కుంటారో. థాంక్స్.
ప్రయోగాల పుట్టిల్లు గోతెలుగు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎడిటర్ బన్నుగారికి, ముఖ్యంగా చదివి ప్రోత్సహిస్తున్న పాఠక మహాశయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
|