భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్‌తో పాటు, భారీ స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. అన్నింటికీ మించి మెగాస్టార్ అన్న పేరు చాలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 'సైరా' టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.. టీజర్ గురించి ఆల్రెడీ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. మెగా కాంపౌండ్‌కి సంబంధించి కొంతమంది ఆల్రెడీ టీజర్‌ని చూసేశారట. టీజర్‌లో ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ఉంటుందట. దేశభక్తి నేపథ్యంలో ఈ డైలాగ్ ఉండబోతోందని సమాచారమ్. చిరంజీవి గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడట. ఇది ఇన్‌సైడ్ సోర్సెస్ నుండి అందుతోన్న సమాచారమ్. అయితే టీజర్‌లో ఏముంటుందో అధికారికంగా తెలియాలంటే ఆగస్టు 21 వరకూ ఆగాల్సిందే.! ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు చరణ్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి యాక్షన్ ఘట్టాలకు ప్రాధాన్యత ఉంది. హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ పూర్తైంది. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|