చిత్రం: నోటా
తారాగణం: విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ పిర్జాదా, సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదితరులు.
సంగీతం: శామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: శంతన్ కృష్ణన్ రవిచంద్రన్
నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాణం: స్టూడియో గ్రీన్
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2018
కుప్లంగా చెప్పాలంటే..
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకైన వరుణ్ (విజయ్ దేవరకొండ)కి రాజకీయాలంటే పెద్దగా ఇష్టం వుండదు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేసే ఓ యువకుడు, అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాల్సి వస్తుంది. తండ్రికి వచ్చిన ఓ సమస్య కారణంగా, ముఖ్యమంత్రి పదవిలో తాత్కాలిక ప్రాతిపదికన కూర్చునే వరుణ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తుంది. ఆ ప్రత్యేక పరిస్థితులేంటి? వాసుదేవ్ ఎందుకు ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది? ముఖ్యమంత్రిగా తనకు ఎదురైన సవాళ్ళను వరుణ్ ఎలా అధిగమించాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
మొత్తంగా చెప్పాలంటే..
చాలా బరువైన కథని, పాత్రనీ భుజానికెత్తుకున్నా అత్యంత సమర్థవంతంగా ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు కష్టపడ్డాడు. అతని కష్టం తెరపై కన్పిస్తుంది. నటుడిగా విజయ్‌కి నూటికి నూరు మార్కులూ వేసెయ్యాల్సిందే. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, తనకి మాత్రమే ప్రత్యేకమైన యాటిట్యూడ్‌తో విజయ్ దేవరకొండ భళా అన్పిస్తాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ విజయ్ దేవరకొండ ఎనర్జీలో ఎక్కడా లోపం కన్పించదు. మొత్తం సినిమాని విజయ్ తన భుజాల మీద మోశాడంటే అతిశయోక్తి కాదు.
హీరోయిన్ మెహరీన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమె ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకుందో అర్థం కాదు. అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో కన్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమెది జస్ట్ గెస్ట్ రోల్ అంతే.
ముఖ్యమంత్రి వాసుదేవ్ పాత్రలో నాజర్ తన అనుభవాన్నంతా రంగరించారు. సత్యరాజ్ పాత్ర సినిమాకి అదనపు ఆకర్షణ. ఆద్యంతం తనదైన హావభావాలతో సత్యరాజ్ ఆకట్టుకుంటారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
కథ విషయానికొస్తే.. ఇలాంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాల్నే చూసేశాం. కథనం పరంగా కూడా పెద్దగా మెరుపులు ఏమీ కన్పించవు. డైలాగుల విషయానికొస్తే, డబ్బింగ్ సినిమా చూసిన అనుభవం కలుగుతుంది తప్ప స్ట్రెయిట్ సినిమా అన్న భావన కలగదు. సంగీతం పాటల వరకూ అస్సలేం బాగా లేదుగానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఆయా సన్నివేశాలకు సంబంధించి మూడ్‌కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ వుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఓకే.
పొలిటికల్ థ్రిల్లర్ అనగానే, మన సమాజాన్నీ.. మన రాజకీయాల్ని సరిపోల్చుకోవడం సహజమే. అందుకు తగ్గట్టుగా సన్నివేశాలుంటే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ, ఎక్కువగా ఈ సినిమాలో తమిళ వాసనలు కన్పిస్తాయి. తెలుగు నేటివిటీ బాగా తగ్గిపోయింది. డ్రామా కూడా స్లోగా అన్పిస్తుంటుంది. ఫస్టాఫ్, సెకెండాఫ్‌లో సాగతీత సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అక్కడక్కడా ట్విస్ట్‌లు వున్నా, ఆ వెంటనే సాగతీత ఆడియన్స్‌ని బోరెత్తించేస్తుంది. ఓవరాల్‌గా విజయ్ దేవరకొండ కోసం ఈ సినిమా చూడాల్సి వస్తుంది తప్ప, అదనపు హంగులేమీ లేవు. విజయ్ పెట్టిన ఎఫర్ట్స్‌ని మాత్రం అభినందించి తీరాల్సిందే.
అంకెల్లో చెప్పాలంటే.. 2.5/5
ఒక్క మాటలో చెప్పాలంటే
నిరాశపర్చిన రౌడీ సీఎం కథ 'నోటా'
|