Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( జంబుకేశ్వరం )

శ్రీరంగం ద్వీపంలోని వున్న మరో ముఖ్యమయిన మందిరం జంబుకేశ్వరం . రంగనాధుని మందిరంతో వైశాల్యంలోనూ శిల్పకళలోనూ పోటీ పడుతూ వుంటుంది . నిష్పక్షపాతంగా చెప్పుకోవాలంటే యీ కోవెల కాస్త ముందుంటుందనే చెప్పుకోవాలి .

ఈ ఈశ్వరాలయం సుమారు 18 వందల సంవత్సరాలకు ముందు నిర్మింపబడినట్లుగా చరిత్రకారుల అంచనా . మందిరం చుట్టూరా సుమారు 25 అడుగుల యెత్తైన ప్రహారీగోడ నిర్మింపబడి వుంటుంది . లోపల గర్భగుడి అయిదు ప్రాకారాలలో వుంటుంది . ఒక్కో ప్రాకారం నడిచేసరికి మనకి కాళ్లనొప్పులు రావడం ఖాయం . ఈ మందిరం వున్న ప్రాంతాన్ని తిరువానైకల్ అని తిరువానైకోయిల్ అనిగాని అంటారు .          జంబుకేశ్వరం పంచభూతలింగాలలో ఒకటి . దీనిని జల లింగం అంటారు .

ఈ మందిరం అయిదు ప్రాకారాలతో నిర్మింపబడిందని చెప్పేనుకదా ? మొదటి ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అని అంటారు . ప్రహారీ గోడ చుట్టుకొలత సుమారు ఓ మైలు వుంటుందట 25 అడుగుల యెత్తు , యింత పెద్ద గోడను నిర్మించడానికి స్వయంగా శివుడు పనివాళ్లతో కలిసి నిర్మించేడని స్థానికులు చెబుతారు . నాలుగవ ప్రాకారంలో 796 స్థంబాలతో నిర్మింపబడ్డ 2436 అడుగుల పొడవు 1493 అడుగుల వెడల్పు కలిగిన మండపం చూడ ముచ్చటగా వుంటుంది . ఇక్కడే  నీటి జల వున్న పుష్కరణి వుంది . మూడవ ప్రాకారంలో సుమారు 745 అడుగుల పొడవు 197 అడుగుల వెడల్పు , 30 అడుగుల యెత్తైన చుట్టుగోడ కలిగిన మండపం వుంటుంది . ఇక్కడ రెండు ముఖద్వారాలు ఒకటి 73 అడుగుల యెత్తు రెండవది 100 అడుగుల యెత్తు . ఈ ప్రాకారంలో చిన్న పుష్కరిణి కొబ్బరి తోపు వున్నాయి . ఈ తోపులో ప్రతీ సంవత్సరం ఉత్సవం నిర్వహిస్తారు . శ్రీరంగనాథుడు శ్రీదేవి భూదేవి సమేతుడై జంబుకేశ్వరుని కలవడానికి వస్తాడు , జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరితో యిక్కడకు వస్తాడు , యీ వేడుక తమిళనాడులో బాగా ప్రసిధ్ద పొందింది . ఈ ప్రాకారంలో ఉపమందిరాలు వున్నాయి .

రెండవ ప్రాకారం 306 అడుగుల వెడల్పు , 197 అడుగుల వెడల్పు వుండి అందులో చిన్నచిన్న మందిరాలు చాలా వున్నాయి , లోపలి ప్రాకారం సుమారు 126 అడుగులు పొడవు , 123 అడుగుల వెడల్పువుంటుంది గర్భగుడి చతురస్రాకారంలో వుండి నాలుగడుగుల ద్వారం ద్వారం లోపలకు వెళ్లగానే కందకం లాగా

మూడువైపులా వుండి ,

మూల విరాట్టుని చేరడానిక మూడుమెట్ల వరుస వుంటుంది . గుమ్మం బయట పెద్ద ఇత్తడి నంది విగ్రహం వుంటుంది . లోపల మూడడుగుల రాగిరంగు లింగం రాతి పానువట్టం మీద వుంటుంది రెంటినీ కలుపుతూ ఇత్తడి రింగు వుంటుంది , శివలింగం దగ్గర సాలెపురుగు , ఏనుగు బొమ్మలతో పాటు ఆండాళ్ విగ్రహం వుంటుంది . గర్భగుడి పైన స్థలపురాణం రాసిన బోర్డు వుంటుంది . గర్భగుడిని రెండవ ప్రాకారానికి కలుపుతూ పెద్ద మంటపం వుంటుంది . రెండవ ప్రాకారంలో ఆగ్నేయమూలలో స్థలవృక్షమైన జంబూ వృక్షం  ( తెల్ల నేరేడు ) వుంటుంది . 

జంబుకేశ్వరుడు జలలింగం కాబట్టి పానువట్టం మీద యెప్పుడూ నీరు చిమ్ముతూనే వుంటుంది . ఇక్కడి పూజారులు పానువట్టం మీద పొడిపంచతో వత్తి నీటిని పిండి చూపిస్తారు . వర్షాకాలంలో నూరి యెక్కువగా ప్రవహించడంతో నీరు చేత్తో తీసి చూపిస్తారు . ముఖ ద్వారానికి ఎడమవైపున రాతి కిటికి వుంటుంది . దీనికి తొమ్మిది భాగాలుగా వుంటాయి , వాటిలోంచి కూడా శివలింగాన్ని దర్శించుకుంటారు . వీటిని నవగ్రహాలకు ప్రతీక అంటారు . గర్భగుడిలోని అఖిలాండేశ్వరి విగ్రహాన్ని వర్ణించడం నావల్ల కాదుగాని , చాగంటివారు చాలా చక్కగా వర్ణించేరు , యీ మందిరం దర్శించుకోడానికి ముందు ఒక్కమారు అది వినండి , దాని తరువాత మందిరాన్ని దర్శించుకోండి . 

జంబుకేశ్వరుని కి యెదురుగా వుండేటట్లు అఖిలాండేశ్వరి మందిరం వుంటుంది . అంటే రెండు మందిరాలు యెదురెదురుగా వుంటాయి . ఎక్కడైన అలా రెండు మందిరాలు యెదురెదురుగా వుంటే వాటిని ఉపాసన మందిరాలు అంటారు . ఇక్కడ శివుడు ఉపదేశిస్తున్నట్లు అంటే గురువు స్థానం లో అమ్మవారు ఉపదేశం అందుకుంటున్నట్లు అంటే శిశ్యునిగా అన్నమాట . ఇక్కడ జంబుకేశ్వరుడు శివజ్ఞానం అఖిలాండేశ్వరికి ఉపదేశించేడట . అఖిలాండేశ్వరి మందిరానికి పక్కగా ప్రసన్న గణపతి మందిరం వుంటుంది . ఈ మందిరాన్ని ఆదిగురువు శంకరాచార్యులవారు నిర్మించేరట . అఖిలాండేశ్వరి మందిరం , ప్రసన్న గణపతి మందిరం రెండూనూ ప్రణవ మంత్రమైన ‘ ఓమ్ ‘ ఆకారంలో వుండేటట్లు నిర్మించేరు .

శంకరాచార్యులవారు జంబుకేశ్వరుని దర్శించుకొనేందుకు వచ్చినప్పుడు అమ్మవారు మహా ఉగ్రంగా వుండి విగ్రహంలోంచి వేడి సెగలు వచ్చి ఆ వేడికిఆ ప్రాంతమంతా జనావాసానికి ఆటంకం కలుగడం చూసి శంకరాచార్యులవారు ప్రసన్న గణపతిని ప్రతిష్టించి , అమ్మవారికి శ్రీ చక్రాలను కర్ణాభరణాలుగా చేయించి పెట్టేరుట , ప్రసన్నగణపతి మందిరం , అమ్మవారి మందిరం ‘ ఓమ్ ‘ ఆకారంలో వచ్చేట్లు కట్టించేరట . అలా చేసిన తరువాత అమ్మవారు చల్లబడ్డారట . ఈ మందిరాలను తరువాతి కాలంలో హోసల వంశానికి చెందిన ‘ వీర నరసింహుని కుమారుడిని సోమేశ్వరుడు ‘ పెద్దగా విశాలంగా కట్టించేడట .

జంబుకేశ్వరుని కోవెలలో మధ్యాహ్నపు పూజ పూజారులు చీర ధరించి చేస్తారు , అలాగే మధ్యాహ్నం నిర్వహించే ‘ అన్నాభిషేకం ‘ చాలా ప్రసిధ్ది పొందింది . ఇక్కడకి వచ్చే భక్తులు మధ్యాహ్నం అక్కడ వుండేటట్టుగా వస్తూవుంటారు . ఈ విషయం కూడా చాగంటివారు వారి ప్రవచనాలలో విశేషంగా చెప్పడం జరిగింది . ప్రతీ రోజూ ‘ కపిల గోవును ‘ తెచ్చి గోపూజ చేస్తారు .

ఇక స్థలపురాణం చెప్పుకుందాం .

ఒకానొకప్పుడు పార్వతీ దేవి వల్ల జరిగిన అపచారానికి శంకరుడు ఆమెకు శాపమిచ్చి కైలాశం నుంచి భూలోకానికి పంపివేస్తాడు . పార్వతీ దేవి భూలోకంలో కావేరీనది నీటితో లింగం చేసుకొని జంబుకేశ్వర ముని తపస్సు చేసుకుంటూ వుండగా అతనిపై మొలచిన చెట్టు మొదలులో లింగం ప్రతిష్టించుకొని ఘోరతపస్సు చేసుకో సాగింది .కొన్ని సంవత్సరాలనంతరం ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై పార్వతికి పడమర ముఖంగా నిలుచొని ‘ శివజ్ఞానాన్ని ‘ ఉపదేశించేడు . శివజ్ఞానం పొందిన పార్వతి కైలాసానికి వెళ్లిపోయింది .

కైలాశం లో శివుని గణాలలో మాల్యవనుడు , పుష్పదంతుడు అనేవారు ప్రతీక్షణం కొట్టుకుంటూ వుండేవారు , కోపించిన శివుడు పుష్పదంతుని ఏనుగుగాను , మాల్యవనుని సాలెపురుగు గాను అయి భూలోకంలో ఒక జన్మ గడపాలని శాపమిస్తాడు . ఇద్దరూ భూలోకంలో కావేరి నదీ తీరాన వున్న జంబుకేశ్వరుని సేవించుకో సాగేరు . ఏనుగు రకరకాల పత్రి పువ్వులతో పూజిస్తూ , కవేరీ నదీ జలాలతో  అభిషేకం చేసుకుంటూవుంటే సాలెపురుగు శివుని పై సూర్యరశ్మి పడకుండా గూడు అల్లేది . ఏనుగు ఆగూడును తన తొండంతో రోజూ తొలగించి వేసేది . సాలెపురుగు యేమీ చేయలేక ప్రతీరోజూ గూడు అల్లేది , ప్రతీరోజూ ఏనుగు గూడు తీసివేయడంతో ఏనుగు మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు ఏనుగు తొండంలో ప్రవేశించి కుట్టసాగింది . ఏనుగుక యేం చెయ్యడానికి పాలుపోక తలలో బాధ భరించలేక తొండాన్ని చెట్లకు , రాళ్లకు బాదుకొని మరణించింది . ఏనుగు తొండంలో దూరిన సాలెపురుగు కూడా మరణించింది . శాపవిముక్తులై యిద్దరూ తిరిగి ఈశ్వరుని వద్దకు చేరేరు , మాల్యవనుడుకి ఏనుగు చావుకు కారణమవడం వల్ల కొంతపాపం చుట్టుకొంది ఆ పాప నివృత్తి కొరకు తిరిగి భూలోకంలో జన్మ యెత్తవలసి వచ్చింది . మాల్యవనుడు చోళ వంశం లో ‘ కోచెన్ గోడ ‘ రాజుగా జన్మ యెత్తి మొత్తం 70 శివమందిరాలను నిర్మించేడు . ఏ కోవెలలో కూడా గర్భగుడి ద్వారం 4అడుగులు కంటే యెత్తు పెట్టలేదు . చిన్న ఏనుగు పిల్ల కూడా మందిరంలోనికి  ప్రవేశింపకోడదనేది అతని పట్టుదల .

      మనం ముందుగా ఈ ప్రాంతాన్ని ‘ తిరువానైక్కాడ్ ‘ అంటారని చదివేం కదా ? దానికి అర్దం ఇప్పడు చెప్పుకుందాం . తిరు అంటే శ్రీ , శ్రీ అంటే సాలెపురుగు అని అర్దం , ఆనై అంటే ఏనుగు , కాడ అంటే అడవి అని అర్దం , అలాగే యీ మందిరాన్ని ‘ తిరువానైకోయిల్ ‘ అని అంటారు . 

             వచ్చే వారం మరికొన్ని విశేషాలతో మీ ముందుంటానన మనవి చేస్తూ శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope october 19th to october 25th