Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope october 19th to october 25th

ఈ సంచికలో >> శీర్షికలు >>

మనవాళ్ళకీ నరనరాలా పట్టేసింది - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది—ఆర్ధికస్తోమత బాగా ఉన్నవారు, తమ ఇంట్లో అవసరానికి కావాల్సిన వస్తువులన్నీ కొనిపెట్టుకునేవారు. ఉదాహరణకి భారీ ఎత్తులో కావాల్సిన వంట సామాన్లు- పెద్దపెద్ద గిన్నెలూ, నీళ్ళకి గంగాళాలూ, పులుసుకోసం గోకర్నాలూ… ఇలా ఒకటెమిటి, ఓ సంతర్పణకి అవసరమైన సామగ్రంతా.. ఊళ్ళో ఎవరికి ఏ అవసరమున్నా, ఇచ్చేవారుకూడా.. మిగతా సమయాల్లో ఏ అటకమీదో పెట్టేసేవారు. ఏదో ఇచ్చారుకదా అని, అద్దె డబ్బులకనుకోకండి.. జస్ట్ అవసరానికి ఆదుకోవడం మాత్రమే.. ఫలానాది అవసరమయితే ఫలానాది ఫలానావారింట్లో ఉంటుందీ అని వంట బ్రాహ్మలకి కూడా తెలిసేది… ఏ శ్రీరామనవమికో  పానకం తయారుచేయడానికి పెద్దపెద్ద గంగాళాలవసరం కదా, అదేదో దైవకార్యం కింద భావించేవారు…

అలాగే ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగితే, ఇంట్లో వారందరికీ, పనిమనుషులతో సహా కొత్తబట్టలు కుట్టించడమో ఆనవాయితీ గా ఉండేది. ఎవరి పెళ్ళి అయితే, ఆ అమ్మాయికో, అబ్బాయికో ప్రత్యేకమైన బట్టలు తీసుకోవడం,  పెళ్ళికొడుక్కి మధుపర్కాలూ, ఖరీదైన సూటూ, అలాగే పెళ్ళికూతురుకి ఓ బెనారస్ చీర.. ఆ సూటూ, బెనారెస్ చీరా రోజూ వాడలేరుగా, అందుకే ఇంకొకరి పెళ్ళిలో కూడా ఓసారి ధరించేవారు.. మిగిలిన రోజుల్లో, కలరా ఉండలు వేసి, బీరువాలో దాచుకోవడమే.. ఒక్కరోజుకి వాడే ఇలాటి వాటికి అంతంత ఖర్చుపెట్టడం అవసరమా అని ఎవరూ అనుకునేవారు కాదు.. ఎప్పటి సరదా అప్పటిదీ అని సమర్ధించేవారు.

అలాగే అవసరమయే వస్తువులు కొన్ని – నూతిలో చేదపడిపోతే తీయడానికి ఓ గేలం, ఓ నిచ్చెనా, అంతదాకా ఎందుకూ… పిండి రుబ్బుకోడానికి ఓ పేద్ద రుబ్బురోలూ, అలాగే ధాన్యం దాచుకోడానికి గాదె.. ఇలాచెప్పుకుంటూ పోతే, నిత్యావసర వస్తువులు, ఏ ఊరి పెద్దగారింట్లోనే ఉన్నా, అందరికీ ఉపయోగపడేవి… జీవితాలు సాఫీగానే వెళ్ళేవి కూడా…

రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. కాలంతోపాటు మనుషుల ఆలోచించే పధ్ధతిలోనూ, మనస్థత్వాల్లోనూ కూడా మార్పొచ్చేసింది… ఇదివరకంటే వేరుగానీ, మరీ ఈరొజుల్లో ఎలా కుదురుతాయీ తో మొదలెట్టి,  చాలావాటిలో మార్పొచ్చేసింది. డబ్బుపోస్తే ఏదైనా  market  లో దొరుకుతుందిలే అనే ఓ అభిప్రాయానికి వచ్చేసారు చాలామంది… ఉదాహరణకి ఇదివరకటిరోజుల్లో ఇంట్లో కూతురికి పెళ్ళవుతోందంటే ఎంత హడావిడిగా ఉండేదో ? ముహూర్తం  చూసుకుని, పెళ్ళిపందిరికి రాటలు వేయడంతో మొదలెట్టేవారు, అలాగే వంటలకి గాడిపొయ్యిలూ, ఇల్లంతా వెల్లలూ.. ఇలా…ఇప్పుడో పందిరీలేదూ సింగినాదమూ లేదూ, వాడెవడికో డబ్బులు పారేస్తే, రంగురంగుల దుప్పటీలు కట్టిపారేస్తాడు.అదేదో  Pandal  అంటారుట. చిత్రం ఏమిటంటే పెళ్ళికీ ఆ గుడ్డలే, చావుకీ ఆ గుడ్డలే అలంకరణ. ఈరోజుల్లో ఏ ఇంటిముందరైనా రంగుల గుడ్డ కడితే, వాళ్ళింట్లో పెళ్ళో తెలియదూ, ఎవరైనా పోయారేమో అనికూడా అనిపిస్తూంటుంది… అయినా ఈరోజుల్లో ఇళ్ళల్లో పెళ్ళిళ్ళెవరు చేస్తున్నారూ? ప్రతీదానికీ మంగళకార్యాలయాలేగా… అవే మంగళ కార్యాలయాలు , పన్నెండో రోజుకి సంతర్పణకి కూడా అద్దెకివ్వడం …

ఇదివరకటి రోజుల్లో స్కూల్లో చదువుకునే పిల్లలలకి ఏ సాంస్కృతికకార్యక్రమమో, ఏ నాటకంలో నటించాల్సివస్తే, వారి తల్లితండ్రులు, ఖర్చుకోసం చూడకుండా, కావాల్సిన dress  కొనడమో కుట్టించడమో చేసేవారు, ఏదో పిల్ల / పిల్లాడు సంతోషిస్తారుకదా అని. కానీ ఈరోజుల్లో , పెళ్ళిబట్టలేమిటి, ధగధగా మెరిసే గిల్ట్ నగలుకూడా అద్దెకు దొరుకుతున్నాయి అందుకేనేమో ఏ పెళ్ళిలో చూసినా మిరుమిట్లూ ధగధగలూనూ… బంగారమా, ఇత్తడా అని ఎవడడగొచ్చాడూ? ఆ పెళ్ళి నాలుగ్గంటలూ మెరిసి, విడియోల్లోనూ, ఫొటోల్లోనూ కనిపిస్తే చాలదూ? ఈమాత్రం దానికి లక్షలుపోసి కొనుక్కోవడమెందుకూ?

ఇదివరకటిరోజుల్లోలాగ, మగపెళ్ళివారికి విడిదులూ అవీ ఎక్కడ కావాలి? ఏ కల్యాణమండపంలోనో, ఒకవైపు మగపెళ్ళివారూ, రెండోవైపు ఆడపెళ్ళివారూ హాయిగా ఉంటున్నారు, ఓ బోర్డోటి పెట్టేసుకుని. గృహప్రవేశ ముచ్చటలూ అక్కడే కానిచ్చేస్తున్నారు. అంతా టైముప్రకారం పూర్తవాలి, లేకపోతే మన తరవాత ఆ hall  బుక్ చేసుకున్నవాడొచ్చేస్తాడు.

ఇంక పెళ్ళంటారా? ఇదివరకటిరోజులు కావు.. ఎవరితో నచ్చితే వారితో అదేదో   LIVE in  అనిఉందిట.. నచ్చినంతకాలం సహజీవనం చేయడం, తరవాత ఎవరిదారి వారిదీ… సుఖం కదూ…

ఇంక పిల్లలసంగతంటారా, వాటికీ గర్భాశయాలు అద్దెకు దొరుకుతున్నాయిగా, అదేదో  surrogate  అంటారే అదన్నమాట. పిల్లలుకూడా అద్దెకు దొరుకుతారేమో చూడాలి ముందుముందు..

మొత్తానికి తేలిందేమిటంటే… పశ్చిమదేశాల  so called  సంస్కృతి మనవాళ్ళకీ నరనరాలా పట్టేసింది  .. ప్రతీదీ   USE AND THROW…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pratapabhavalu