Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

అతి సర్వత్రవర్జయేత్! ఇది మన పెద్దలు చెప్పిన అతి ముఖ్యమైన విలువైన సూక్తి. ఇది తెలుసుకుని ఆచరిస్తే చాలు..జీవితం వరంలా అనిపిస్తుంది. ఆనందమయమౌతుంది.

మనకు ప్రాణాధారమైన అన్నం ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. మంచి నీళ్లు ఎక్కువగా తాగితే పైత్యం చేస్తుంది. అలాంటిది మనిషి కనుగొన్న, తయారుచేసిన వస్తువుల పట్ల వ్యామోహంతో వాటికి అంకితమయిపోతే ఇంకేవన్నావుందా?

ఈనాడు సెల్ ఫోన్ వినియోగం తామరతంపరగా మారిపోయింది. ఆబాలగోపాలమూ దాన్ని అంటిపెట్టుకునే ఉంటున్నారు. కంప్యూటర్ లు, ఛానెల్ టీవీలు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనిషికి మనిషికి మధ్య ఉన్న దగ్గరితనం దూరమయింది. ఇప్పుడు సెల్ఫోన్ లు వచ్చాక ఆ దూరం మరీ అగాథమయిపోయింది.

మెయిల్స్, ఫేస్ బుక్, వాట్సప్, టెలిగ్రామ్, యూ ట్యూబ్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో యాప్స్ అసలు మనిషిని తన నుండి తల తిప్పనివ్వట్లేదు సెల్ఫోన్.

పైవి మాత్రమే కాకుండా వాట్సప్ గ్రూప్స్! కులానికి, మతానికి, దేశానికి, పార్టీలకి, కవితలకి, కథలకీ, సంస్థలకీ, ఉద్యోగులకీ..అబ్బో ఇలా ఎన్నో గ్రూప్ లు. చూడంగానే సరిగాదు. రెస్పాన్సూ ఇవ్వాలిగా. ఇప్పటి పరిస్థితికి

‘క్షణం తీరికలేదు. దమ్మిడి ఆదాయం లేదు’ అన్న సామెత సరిగ్గా అతుకుతుంది. నిజానికి ఈ గ్రూప్ ల వల్ల ప్రయోజనమేముంటుందో గాని. మనం సీరియస్ గా పనిచేసుకుంటుంటే ఒక బీప్ తో మన కాన్సెంట్రేషన్ ను అట్రాక్ట్ చేసి, సమాధానంఇచ్చేలా చేసుకుంటుంది. ఏకాగ్రత తప్పిన పనిలో నాణ్యత దెబ్బతింటుందన్నది తెలిసిందే!

ఈ సెల్ ఫోన్ లు వచ్చాక మనిషికి మనిషికీ మధ్య దూరం పెరగడమే కాదు, సెల్ (యంత్రానికి)కీ మనిషికీ మధ్య అనుబంధం రోజు రోజుకు బలపడుతోంది. అది సమంజసం కాదు. మన నిత్యకృత్యాలన్నీ దాంతోనే ముడిపడి ఉంటున్నాయి.

డ్యూయల్ సిమ్ లు వచ్చాక మనిషి జీవన విధానం ఇంకా క్లిష్టమైంది.

ఇదిలా ఉండగా రేడియేషన్ కూడా మనిషి మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. రకరకాల మానసిక రుగ్మతలకి కారణమవుతోందన్నది తెలిసిందే!

ఒక్క క్షణం సెల్ లేకుండా మనిషి గడపలేని పరిస్థితి.

పొరబాట్న సెల్ పాడైపోయినా, పోయినా, ఛార్జింగ్ అయిపోయినా ఇహ ఆ మనిషి గంగవెర్రులెక్కిపోతాడు. తన సమస్తం కోల్పోయిన భావనకు లోనవుతాడు. మానసికంగా అది అంత మంచిది కాదన్నది శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

సెల్ మాట్లాడుతూ బస్సుల కింద, రైళ్ల కింద, ఎత్తైన కట్టడాలమీదనుంచి పడి చనిపోయిన వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది.

సెల్ ఫోన్లలో చక్కటి కెమెరా సదుపాయం వచ్చాక ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్నారు కుర్రాళ్లు. అసలు ఈ సెల్ఫీల పిచ్చి అకాల మృత్యువుకు చిరునామాగా చెప్పుకోవచ్చు.

మితం ఎప్పుడూ హితమే! సెల్ ఫోన్ అసలు వాడకూడదనడం మూర్ఖత్వం, మన అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించడం సామర్థ్యానికి నిదర్శనం.

సెల్  ఫోన్ వాడుతూ మనను మనం సెల్ లో బంధించుకోడం మానుకుని, అవసరార్థం చాలా తక్కువగా సెల్ ను ఉపయోగిద్దాం. ఏవంటారు?

మరిన్ని శీర్షికలు
Is it wrong to get inspired by jealousy