Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Is it wrong to get inspired by jealousy

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆత్మశక్తులు. - ఆదూరి హైమావతి

atmashaktulu

 మన దేహం లో ఆత్మ ఉంటున్నదికదా!ఆ ఆత్మ శక్తి చాలాగొప్పది. ఆ ఆత్మకు మూడువిధాలైన శక్తులుంటాయి. మొదటిది మనస్సు, రెండవది బుద్ధి, మూడవది సంస్కారము. మనో బుద్ధి సంస్కారముల స్వరూపమే ఆత్మ. ఈ  మూడు శక్తులూ ఆత్మకు ఉంటున్నాయి. మనస్సు ఆత్మనుండియే పుట్టింది. మనస్సుచాలా విశాలమైనది, దీని వైశాల్యాన్ని  వర్ణించను ఎవ్వరికీ సాధ్యం కాదు. సంకల్పించుకుంటే అది క్షణంలో ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. ఇండియాలో ఉండి కళ్ళుమూసుకుని ఊహించగానే అమేరికాలో ఉంటాము, హిమాలయాల్లో కూడ ఉంటాము.మనస్సు యొక్క శక్తిని ఎవ్వరూ గుర్తించలేరు. దానిని వర్ణించను భాష చాలదు. మనస్సు లేకుండా ఏ చిన్న కార్యాన్నైనా సాధించలేం. ఐతే, మనస్సుకొక రూపం లేదు. ఆత్మశక్తిద్వారానే అది పనిచేస్తుంది. మనస్సుతత్త్వాన్ని గుర్తించను  కొన్ని యుగాలైనా చాలవు. 

రెండవది బుద్ధి. ఇది ప్రకాశవంతమైనది, వికాసవంతమైనది, విచారణ శక్తితో కూడినది; స్వార్థస్వప్రయోజనాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా విచారణ చేస్తుంది.ఈ బుధ్ధి మనకర్మలను అనుసరించి నడుస్తుంటుంది. ఆందుకే ‘బుధ్ధిః కర్మానుసారిణి  ’ ఆన్నారు .

ఇంక మూడవది సంస్కారం. ఇది ప్రస్తుత జన్మలోనేగాక ముందు జన్మలనుండీ  రాబోయే జన్మలలోకూడా ప్రభావం చూపుతుంది. గతజన్మల సంస్కారం ఈ ఈ జన్మలోనూ ప్రతిఫలిస్తుంటుంది.చెడును దూరంచేసి మంచిని గుర్తించి వర్తిం చడమే సంస్కారం. నిత్యజీవితంలో మనం ఆచరించే కర్మలను దోష రహితంగా తీర్చిదిద్దుకోవడమే సంస్కారం. మంచి చెడులను వేరుపరచేశక్తి సంస్కారానికి మాత్రమే ఉంటుంది.  మనో బుద్ధి సంస్కారములను గురించి పూర్తిగా తెలుసుకోవ డమూ చాలాకష్టమే.

కొందరు కేవలం గ్రంథపటనం మాత్రమే చేసి  తాము గొప్ప విద్యావంతులమని భావిస్తుంటారు. అదిపొరపాటే. గొప్ప విద్యా వంతుడని పేరుపొందిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ''అయ్యా! నీవెవరు?'' అని ప్రశ్నిస్తే  ఆ గొప్ప విద్యావంతుడు కూడా దీనికి సరియైన సమాధానం చెప్పలేడు. "అయ్యా! నేను కృష్ణశాస్త్రిని, లేదా వెంటశాస్త్రిని", అని తనపేరు మాత్రం చెప్పు కుంటాడు. "కృష్ణశాస్త్రి లేదా వారు చెప్పిన మరోపేరు కేవలం వారి దేహానికి పెట్టిన పేరేగాని, యదార్ధమైన సమాధానం కాదు. “నీవెవరు?'' అని రెండవ మారు  ప్రశ్నిస్తే. "నేనొక వేదపండితుడను", అని జవాబిస్తాడు.లేదా నేనొక ఉద్యోగిని ”అంటారు "పాండిత్యము నీవు అభ్యసించిన విద్యకు సంబంధించినదేగాని, నీవు కాదు.ఉద్యోగం నీవుచేసే కొలువుకు సంబంధించినదేకానీ అదీనీవుకాదు."నీవెవరు?" అని మళ్ళీ అడిగితే ."నేను భారతీయుడను", నేను అమేరికన్ ను " అని తన జాతీయతను చెప్తాడు. తాను గొప్ప విద్యా వంతుడైనప్పటికీ "నీవెవరు?" అనే ప్రశ్నకి సమాధానంగా తన దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు తెలియజేస్తున్నాడు. ఇవేవీ తన నిజతత్త్వానికి సంబంధించినవి కావని తెలుసుకో లేకపోతున్నాడు. కారణమేమి? ఆత్మతత్త్వాన్ని తెలియక కేవలం దేహాన్ని మాత్రమే తన దృష్టియందుంచుకోడం వలన . ఆత్మజ్ఞానం లేనివాడు ఆనందాన్ని అనుభవించలేడు. దేహము, మనస్సు మన స్వాధీనంలో ఉన్న పనిముట్లు మాత్రమే. ఈ పనిముట్లకు అతీతమైన ఆత్మతత్త్వమే  ‘నీవు’. యజమానివి. అందుకోసమే’ Master the mind , be a master mind’ఇలా ఆలోచించమని  బోధించినప్పుడు సత్యాన్ని గుర్తించి "అయ్యా! నేనింత కాలం దేహాభిమానంలో మునిగి అజ్ఞానంచేత కాలాన్ని వ్యర్థం చేశాను. దేహాతీతమైన, కాలాతీతమైన ఆత్మయే నేను", అని సరియైన సమాధానం చెబుతాడు.

ఆత్మ తెరవెనుక ఉండి దేహాన్ని తోలుబొమ్మవలె ఆడిస్తుంది. కాని, మనం ఆత్మను మరచిపోయి దేహాన్ని చూసి అదే సత్యమని భ్రమిస్తున్నాం.

దేహం అశాశ్వతమైనది. ‘నీవు’ సత్యమైనవాడవు. సత్యమే 'నీ ' పేరు. అదియే ఆత్మ. కనుక, ఆత్మను ఆధారం చేసు కోవాలి . దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. దేహాభిమానాన్ని వీడనంతవరకు ఆత్మజ్ఞానాన్ని  కొంచెమైనా అర్థం చేసు కోలేము. ఆత్మయే అన్నింటికీ ఆధారమైన శక్తిస్వరూపం. అట్టి ఆత్మశక్తిని అర్థంచేసుకోను ప్రయ త్నించాలి. మొట్ట మొద ట మనస్సు తత్త్వాన్ని గుర్తించాలి. పుట్టుట, భూమిమీద ఊండటం, సంసారం, చావు, బాల్యము, వార్ధక్యము, కర్మలు, కష్టాలు, సంతసం,దుఃఖం -- ఇవన్నీ మనస్సుయొక్క ప్రభావాలు.. మనస్సు తత్త్వాన్ని గుర్తించాలంటే ఇంద్రియాలను అరికట్టుకోవాలి. ఇంద్రియాల నరికట్టుకోలేనివాడు ఇతరులకు ఏమీ చెప్పలేడు. ఇతరులను నడిపించలేడు. నేడు మనం  ఇంద్రియాల అరికట్టుకోలేక, మనస్సుయొక్క తత్త్వాన్ని గుర్తించలేక, కొంచెమైన విద్యకే విపరీతమైన గర్వాన్నిపొందు తున్నాం . మనకు అన్నీ తెలుసునను కుంటున్నాం. అది అసమంజసం. అల్పమైన విషయాలపై దృష్టిపెట్టి ఆత్మ తత్త్వాన్ని మఱచిపోతున్నాం. అందువల్లనే కష్టనష్టములచేత క్రుంగిపోతున్నాం. మన తత్త్వాన్ని మనం గుర్తించుకోలేక పోవడంచేతనే సుఖ దుఃఖాలకు గురి అవుతున్నాం. మన నిజ తత్త్వాన్ని మనం గుర్తించినప్పుడు సుఖ దుఃఖాలు మనలను తాకలేవు.

మన సుఖ దుఃఖాలు మనస్సుద్వారా ఏర్పడుతున్నాయి.ముందు మనస్సుయొక్క తత్త్వాన్ని గుర్తించాలి. అప్పుడే మనం  ధన్యు లైపోతాం .మన  సుఖదుఃఖాలకు కారకులం మనమే కాని, మరొకరు కారు. మన కష్టాలకు ఇతరులపై నింద మోపడం మహా పాపం. మన నడత సక్రమంగా లేకపోవడం చేతనే మనకు కష్టాలు కలుగు తున్నాయి. కర్మ మెట్టిదో గమ్య మట్టిది. దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. సంకల్పము లెట్టివో కర్మ అట్టిది. కాబట్టి సత్సంకల్పములను పోషించు కోవాలి. మనస్సుయొక్క తత్త్వాన్ని గుర్తించినపుడే మనం నిజమైన మానలం అవుతాము. ఇదే వేదాంతసారం. వేదాంత మనగా వేదముల అంత్యమే వేదాంతం. అదే ఆత్మజ్ఞానం. ఆత్మను మరచిపోయి దేహభ్రాంతిని పెంచుకోడం మూర్ఖత్వం . ఆత్మ అనేది కంట్రోల్ రూమ్ వంటిది. ఆ కంట్రోల్ రూములో ప్రవేశిస్తే అన్ని ఇంద్రియాలను క్షణంలో కంట్రోల్ చేస్తుంది. ఇంట్లో వున్న ఒక్క మెయిన్ స్విచ్చిని నొక్కితే అన్ని గదులలోని బల్బులన్నీ వెలుగుతాయి. ఆత్మ అనేది మెయిన్ స్విచ్చి వంటిది; ఇంద్రి యాలన్నీ వేర్వేరు గదులలోని బల్బులవంటివి. మనం ఒక పెద్ద ఇల్లు  కట్టుకున్నామనుకోండి.

అందులో పడకగది , స్టోర్రూము, డైనింగు రూము, వంటగది  ఇలా వేర్వేరు గదులను ఏర్పాటు చేసుకుటాం.ఒక గదికి మరొక గదికి మధ్యలో ఒక గోడ అడ్డంగా ఉంటుంది. గోడలవల్లనే ఇన్ని గదులు ఏర్పడ్డాయి.గోడలు లేకపోతే అంతా ఒకటే .ఆ గోడలను తీసివేస్తే ఒకే ఒక విశాలమైన హాలుగా కనిపిస్తుంది . అలాగా మనం దేహాభి మానమనే అడ్డుగోడను కట్టుకోడంవలన  ఏకత్వాన్ని గుర్తించ లేకపోతున్నాం. అనంతమైన, అమృతమైన ఆత్మతత్త్వాన్ని మనం  అనేక జన్మల నుండి మఱచిపోయి, అల్పమైన దేహాభిమానాన్ని మాత్రం పెంచుకుంటూ వస్తున్నాం; కనీసం ఈ జన్మ నుండైనా దేహాభి మానాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నం చేద్దాం.ఏమిటీ ఈదేహాభిమానం? ఇది ఎవరిది? " అని ఎవరైనా అడిగితే "ఇదంతా నాది" అంటాం. ఎంతవరకు మనది? దేహం ఉన్నం తవరకే! ఆ తరువాత అది ఎవరిదో! కాబట్టి, 'నాది' అనే మమకా రాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రాపంచికమైన జీవితంలో మనం తరచుగా "నేను", "నాది" అనే పదాలను ఉపయోగి స్తుం టాం కదా!. "నేను" అనేది ఆత్మ; "నాది" అనేది పదార్థం. ఆత్మ నుండి ఏర్పడినదే మనస్సు, మనస్సుయొక్క ప్రభా వమే పదార్థము. మనస్సు, పదార్థములయొక్క తత్త్వాన్ని గుర్తించినప్పుడే ఏకత్వం ఆకళింపునకు వస్తుంది.

మనం చిన్నతనం నుండే ఆధ్యాత్మికమార్గంలో ప్రవేశించాలి, మన పిల్లలనూ ప్రవేశపెట్టాలి. ఏదో వృద్ధాప్యం వచ్చిన తరువాత చూసుకుందా మని భావించరాదు. 'ఊరనో బయటలో ఉదకమధ్యంబునో ఎప్పుడో ఎచ్చటో ఎవరికెరుక '- అన్నట్లు మరణం ఎప్పుడో తెలియదు. అప్పుడు చేసేదేమీ ఉండదు, కనుక పసి వయస్సునుండే మనం  జాగ్రత్తగా ఉండాలి. చిన్నతనం నుండీ  మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే ముసలివయస్సులో నక్కకు ద్రాక్షపండ్లు అందని విధంగా మనకు ఆధ్యాత్మికత అందదు.

మరిన్ని శీర్షికలు
Capsicum Royyalu