అమ్మో క్యాన్సర్.. క్యాన్సర్ పేరు చెబితే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ అక్కినేని షాక్ అవలేదు. ఆ.. క్యాన్సరే కదా.. అనుకున్నారంతే. సినీ రంగంలో అక్కినేని ఎలాంటి విజయాలు సాధించారో అందరికీ తెలుసు. ఆరోగ్యం పరంగానూ ఆయన నిజమైన విజేత. గుండెకు శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ కాలం బతకరనే అపోహను తొలగించారాయన. శస్త్ర చికిత్స అనంతరం సాధారణ జీవితం గడపవచ్చని ఆయన నిరూపించారు. అదే ధైర్యం క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిశాక కూడా అక్కినేని ప్రదర్శించారు.
తొందరగా కోలుకుని, ప్రేక్షకుల ముందుకు రావడానికి అక్కినేని సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులు షూటింగ్ లో నాన్నగారు పాల్గొనాల్సి వుందని అక్కినేని తనయుడు నాగార్జున చెప్పారు. నాగార్జున చెప్పినట్లుగానే అక్కినేని షూటింగ్ లో పాల్గొంటారు కూడా. ఎందుకంటే ఆత్మ బలం ముందు ఎలాంటి అనారోగ్యమైనా తలవంచాల్సిందే అని ఆయన నమ్ముతారు. ఆయన విషయంలో అది నిజమైంది కూడా.
హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో అక్కినేనికి శస్త్ర చికిత్స జరిగింది. క్యాన్సర్ సోకిన అక్కినేని, శస్త్ర చికిత్స తరువాత వేగంగా కోలుకుంటున్నారని సమాచారం అందుతున్నది. ఐసీయూలో నడుస్తున్నారని, త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారని భాయ్ ప్రమోషన్ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు నాగార్జున. అక్కినేని త్వరగా కోలుకుని ప్రేక్షకుల ముందుకు మనం సినిమాతో రావాలని కోరుకుందాం.
|