ఒక సినిమా తీయడం లో కాని, విజయం సాధించడంలో కాని దర్శకుని పాత్ర ఎంతో కీలకమైనది, ముఖ్యమైనది. అందుకే దర్శకుణ్ణి 'కెప్టెన్ అఫ్ ది షిప్' అంటారు. ఒకప్పుడు సినిమా దర్శకుడు కావాలంటే ఎవరో ఒక సీనియర్ దర్శకుని వద్ద శిష్యరికం చేయాల్సిందే. అలా చాలా కాలం శిష్యరికం చేసిన తర్వాతనే దర్శకునిగా అయ్యేది. అలా శిష్యరికం చేసి ఇలా దర్శకులు అయిన వారు తర్వాత కాలంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసారు. తీస్తునారు. అలాంటి గురుశిష్యుల గురించి కొన్ని సంగతులు...
ఆదుర్తి సుబ్బారావు:
హీరోల హవా కొనసాగుతున్న కాలంలో 'మంచి మనసులు, తేనె మనసులు, వెలుగు నీడలు, తోడి కోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, నమ్మిన బంటు' తదితర సినిమాలతో తన సొంత ముద్ర వేసుకున్న ఆదుర్తి సుబ్బారావు సొంత బ్యానర్ పై తీసిన 'మూగమనసులు' పెద్ద హిట్. ఆదుర్తి దగ్గర శిష్యరికం చేసిన కె. విశ్వనాథ్ తొలత సౌండ్ ఇంజనీర్ గా పని చేసారు. తర్వాత ఆదుర్తి శిష్యరికంలో ఎన్నో మెలుకువలు నేర్చుకొని చిత్ర పరిశ్రమ ఫార్ములా రొంపిలో కూరుకుపోయిన సమయంలో విశ్వనాథ్ తీసిన 'సప్తపది, సాగరసంగమం, సిరి సిరి మువ్వ, శంకరాభరణం, స్వాతిముత్యం, కాలం మారింది, మాంగల్యానికి మరో ముడి, చెల్లెలి కాపురం' వంటి చిత్రాలతో తెలుగు దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ని సొంతం చేసుకున్నారు.
'విక్టరీ మధుసూధనరావు':
మనిషిగా, మంచి వాడుగా , సెట్స్ పై చండశాసనుడిగా. విజయానికి మారుపేరుగా నిలిచినా మరవరాని దర్శకుడు వి. మధుసూధనరావు. పని మీద శ్రద్ధాసక్తులు, క్రమశిక్షణ విక్టరీ సొంతం. మధుసూధనరావు తొలత ఎల్వీ ప్రసాద్ దగ్గర, ఆ తర్వాత కె.ఎస్. ప్రకాశ రావు (కె. రాఘవేంద్రరావు తండ్రి) దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యరికం చేసి 'సతీ తులసి' తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి 'అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, గుడి గంటలు, వీరాభిమన్యు, రక్తసంబంధం, మల్లెపూవు' లాంటి విజయాలతో 'విక్టరీ' ని సొంతం చేసుకున్నాడు. విక్టరీ మధుసూధనరావు దగ్గర శిష్యరికం చేసిన వారిలో పి. సి. రెడ్డి, వంశీ, కె. రాఘవేంద్రరావు, కోదంద రామిరెడ్డి, శివనాగేశ్వరరావు, బి. గోపాల్ లాంటి వారంతా దర్శకులుగా ఉన్నత స్థితికి ఎదిగారు.
కె.వి.రెడ్డి :
కె.వి.రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ గురించి ఎంతచెప్పినా చరిత్ర చరణమే అవుతుంది. ఆయన తీసిన, 'మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ, భక్త పోతన, గుణసుందరి కథ' సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయన దర్శకత్వం చేసిన 'దొంగరాముడు' స్క్రీన్ ప్లే పరంగా ఓ ఆణిముత్యం. దర్శకత్వ శాఖపట్ల ఉత్సుకత వ్యక్తపరిచేవారికి ఓ పాఠ్యగ్రంధం. అలాంటి కె.వి.రెడ్డి దగ్గర శిష్యరికం చేసిన సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన తీసిన 'మయూరి, పంతులమ్మ, భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, ఆదిత్య 369' సినిమాలు విజయం సాధించాయి. 'పుష్పక విమానం' సినిమా ఓ అద్భుతం. కె.వి.రెడ్డి దగ్గరే శిష్యరికం చేసిన కమలాకర కామేశ్వరరావు పౌరాణిక బ్రహ్మగా పేరొందారు. కామేశ్వరరావు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన 'నర్తన శాల, పాండురంగ వనవాసం, మహాకవి కాళిదాసు, మాహామంత్రి తిమ్మరుసు, గుండమ్మ కథ' చిత్రాలు మరపురాని సినిమాలుగా పేరొందాయి.
కె. రాఘవేంద్రరావు :
ప్రేక్షకుడ్ని ఒక స్వప్నలోకంలో విహరింపజేసి మెస్మరైజ్ చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు. తొలుత తన తండ్రి కె.ఎస్.ప్రకాశరావు, ఆ తర్వాత 'విక్టరీ' మధుసూదనరావు దగ్గర దర్శకత్వశాఖలో అసిస్టెంట్ గా చేసి 'బాబు' సినిమాతో దర్శకుడై 'జ్యోతి, కల్పన, ప్రేమలేఖలు' లాంటి విలక్షణమైన చిత్రాలు తీసి 'అడవిరాముడు' సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా మారి 'వేటగాడు, కొండవీటి సింహం, జానకిరాముడు, దేవత, బొబ్బిలి బ్రహ్మన్న, జగదేకవీరుడు అతిలోకసుందరి, పెళ్ళిసందడి, అన్నమయ్య మొదలైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడి వద్ద శిష్యరికం చేసిన బి. గోపాల్ 'ప్రతిధ్వని' సినిమాతో దర్శకుడిగా మారి ' బొబ్బిలి రాజా, కలెక్టర్ గారి అబ్బాయి, స్టేట్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, సమర సింహారెడ్డి, ఇంద్ర, నరసింహ నాయుడు' మొదలైన సినిమాలు తీసాడు.
ఇక అపజయమే ఎరుగని దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి కూడా రాఘవేంద్ర రావు దగ్గర' శాంతి నివాసం' టెలీ సీరియల్ కు అసిస్టెంట్ గా పనిచేసాడు. దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో 'స్టూడెంట్ నెం . 1' తో దర్శకుడిగా మారి వరుసగా 'సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న, చత్రపతి, సై, విక్రమార్కుడు, ఈగ, యమదొంగ' చిత్రాలను విజయవంతం చేసాడు. వై.వి. యస్ చౌదరి కూడా దర్శకేంద్రుడి దగ్గర కొద్ది కాలం అసిస్టెంట్ గా పనిచేసాడు.
దాసరి నారాయణరావు :
స్టోరీని హీరోగా చేసి డైరెక్టర్ ని స్టార్ చేసిన క్రియేటర్ దాసరి నారాయణరావు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి . మధ్యతరగతి జీవితాలను ప్రతిబించించాయి. దాసరి మొదట్లో ఎన్నో సినిమాలకు మాటలు రాసారు. తరవాత డైరెక్టర్ భీమ్ సింగ్, రైటర్ పాలగుమ్మి పద్మరాజు, నిర్మాత భావనారాయణ దగ్గర పనిచేసి 'తాత మనవడు' సినిమాతో దర్శకుడిగా మారి 'గోరింటాకు, స్వర్గం - నరకం, బొబ్బిలి పులి, శివరంజని, స్వయం వరం, మేఘ సందేశం, మజ్ను' మొదలైన సినిమాలతో తెలుగు సినీ రంగాన్ని ఒక కొత్త మలుపు తిప్పారు. దాసరి దగ్గర శిష్యరికం చేసిన వారిలో కోడి రామకృష్ణ, రవి రాజా పినిశెట్టి, రేలంగి నరసింహ రావు, ఆర్. నారాయణమూర్తి మొదలైన వారు తర్వాత కాలంలో దర్శకులుగా మారి తమకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు.
జంధ్యాల:
'హాస్యబ్రహ్మ' గా పేరొందిన జంధ్యాల తొలుత ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసారు. 'ముద్దమందారం' సినిమాతో దర్శకుడిగా మారి 'వివాహభోజనంబు, అహ నా పెళ్ళంట, సీతారామకల్యాణం, చూపులు కలిసిన శుభవేళ ' మొదలైన సినిమాలతో ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచారు. జంధ్యాల దగ్గర అసిస్టెంట్ గా చేరిన ఇ.వి.వి. సత్యనారాయణ దాదాపు 22 సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేసి 'చెవిలో పువ్వు' తో దర్శకుడై ఆ తర్వాత వరుసగా 'ప్రేమఖైదీ, అప్పుల అప్పారావు, జంబలకిడిపంబ, సీతారత్నం గారి అబ్బాయి, తొట్టిగ్యాంగ్, హలోబ్రదర్, వారసుడు' మొదలైన ఎన్నో సినిమాల్ని విజయవంతంగా చేసాడు.
టి.కృష్ణ :
అభ్యుదయ భావాలు గల దర్శకుడు టి.కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈయన తీసినవి చాలా తక్కువ సినిమాలైనప్పటికినీ అన్నీ ప్రేక్షకులను అలరించాయి. 'ప్రతిఘటన, రేపటిపౌరులు, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, నేటి భారతం' సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిన విషయమే. టి.కృష్ణ దగ్గర కోడైరెక్టర్ గా పనిచేసిన ముత్యాల సుబ్బయ్య, ముత్యాల వంటి సినిమాలు తీసారు.
వర్మ :
వర్మ తొలుత బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి 'శివ' తో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన వారిలో కృష్ణ వంశీ, పూరి జగన్నాధ్, వై.వి.ఎస్. చౌదరి, రమణ మొదలైన వారు దర్శకులుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందారు. ఇంకా మడమతిప్పని వీరుడిలా వరుస విజయాలు అందించిన కె. విజయభాస్కర్ తొలుత బి. గోపాల్ దగ్గర హిందీ 'ప్రతిధ్వని' కి పనిచేసారు. 'ఆరో ప్రాణం' లాంటి హార్ట్ టచింగ్ ఫిలిం తీసిన వీరూ. కె. దర్శకుడు s.v. క్రిష్ణా రెడ్డి దగ్గర పనిచేసారు.
-కె. సతీష్ బాబు
|