చిత్రం: భాయ్
తారాగణం: నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, ప్రసన్న, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, జారా, కామ్నా, హంసా నందిని, నథాలియా కౌర్ తదితరులు
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్
నిర్మాత: నాగార్జున
దర్శకత్వం: వీరభద్రం
విడుదల తేదీ: 25 అక్టోబర్ 2013
క్లుప్తంగా చెప్పాలంటే:
దుబాయ్ లో ఓ మాఫియా డాన్ భాయ్ (నాగార్జున) వుంటాడు. అతని బాస్ డేవిడ్ (ఆశిష్ విద్యార్థి). హైద్రాబాద్ లో ఓ టఫ్ పోలీస్ ఆఫీసర్, మాఫియాని ఏరి పారేసే పనిలో బిజీగా వుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ని అంతం చేసేందుకు డేవిడ్, భాయ్ ని హైద్రాబాద్ కి పంపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ ని ఖతం చేయడానికి హైద్రాబాద్ వచ్చిన భాయ్, చివరి నిమిషంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఎందుకు? అన్నది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే:
నాగార్జున ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఈ సినిమాకి వున్న స్టార్ వాల్యూ నాగార్జున మాత్రమే. అయితే, నాగ్ గ్లామర్ నీ, ప్రేక్షకుల్లో అతనికి వున్న ఇమేజ్ నీ కరెక్ట్ గా దర్శకుడు వాడుకోలేకపోయాడు. తన పాత్ర వరకూ నాగ్ న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. రిచా గంగోపాధ్యాయ్ ఫర్వాలేదంతే. నటిగా వెలగాలంటే ఆమెలో చాలా మార్పులు రావాల్సి వుంది. ప్రసన్న పాత్ర వరకూ ఓకే. అతన్నీ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆశిష్ విద్యార్థి మామూలే. సోనూ సూద్ పాత్ర వృధా అయ్యింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలకు తగిన పాత్రలు లభించలేదు. జరా జస్ట్ ఓకే. మిగతా పాత్రధారులు పెద్దగా చేసిందేమీ లేదు.
ఆసక్తి రేపే కథాంశాన్ని ఎంచుకోవడంలో దర్శకుడు కొంతమేర సఫలమయ్యాడు. మాటలు బాగున్నాయి. సినిమా రిచ్ గా తెరకెక్కింది. సంగీతం అంచనాలకు తగ్గట్టుగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ విభాగంలోనూ లోపాలున్నాయి. సెకెండాఫ్ లో ఎడిటింగ్ లోపాలు ఎక్కువగా కన్పిస్తాయి. స్టయిలింగ్ బావుంది. కాస్ట్యూమ్స్ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి. భారీ అంచనాలతో వచ్చినప్పటికీ, అంచనాల్ని అందుకునేలా సినిమాని తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకెండాఫ్ డ్రాగింగ్ అన్పిస్తుంది. నాగ్ అభిమానుల్ని సైతం అంతగా ఆకట్టుకునేలా లేదు. బాక్సాఫీస్ వద్ద సినిమాకి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
మాటల్లో చెప్పాలంటే: అంత సీన్ లేదు ‘భాయ్’
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
|