తెలుగు టీవీ యాంకర్లు అంటే తెలుగు భాషకి లక్షన్నర వంకర్లు తిప్పేస్తారని ప్రతీతి. కానీ అందులో సుమ, శిల్పా చక్రవర్తి చాలా ప్రత్యేకం. వీరిద్దరికీ తెలుగు మాతృ భాష కాదు. సుమ మలయాళీ, శిల్పా చక్రవర్తి బెంగాళీ. కానీ, ఇద్దరూ తెలుగులో మాట్లాడేందుకే ఎక్కువ ఇష్టపడ్తారు.
ఇంగ్లీషు, హిందీలలో అనర్గళంగా మాట్లాడగలిగినా, వీరి మాటల్లో అచ్చమైన తెలుగు స్ఫురిస్తుంది. ఎందుకిలా? మిగతా యాంకర్లు ఎందుకు తెలుగు భాషని నూటొక్క వంకర్లు తిప్పి, టెల్గుని చేసేశారు? అని ఆలోచిస్తే, తెలుగు భాషపై మమకారం వుంటేనే తెలుగు భాషలోని అందాన్ని ఆస్వాదించగలుగుతారు, ఆ అందాన్ని అందరికీ పంచగలుగుతారు అని చెప్పవచ్చు. నేను తెలుగమ్మాయినే, కాదని ఎవరన్నారు? అంటారు సుమ, శిల్పా చక్రవర్తి.
పుట్టుకతో తాను మలయాళీ అయినా, తెలుగు ప్రజల మధ్యే ఎక్కువగా వున్నాను, అన్ని మాండలికాలపైనా అవగాహన వుంది, తెలుగు భాషను ప్రేమిస్తున్నాను.. అంటారు సుమ. శిల్పా చక్రవర్తి కూడా అంతే. తెలుగు గడ్డపై పుట్టిన యాంకరమ్మలు తెలుగు భాషకు వంకర్లు తిప్పుతోంటే, ఎక్కడో పుట్టిన సుమ, శిల్ప మాత్రం తెలుగు తల్లి ముద్దుబిడ్డలనిపించుకుంటున్నారు.
|