Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Bhai

ఈ సంచికలో >> సినిమా >>

శేష్ అడివి తో ముఖాముఖీ

Interview with Adivi Sesh

తెలుగు సాహిత్యంలో అడివి బాపిరాజు పేరు తెలియనివారు ఉండరు. పలు జానపద, చారిత్రిక నవలల సృష్టి కర్త ఆయన. హిమబిందు, గోన గన్నారెడ్డి వంటి నవలలు ఎన్నిసార్లు అచ్చయ్యాయో ఎన్ని తరాలుగా పాఠకుల మనసుల్ని రంజింపజేస్తున్నాయో చెప్పడం అంత తేలిక కాదు. రచయితగానే కాక చిత్రకారులుగా కూడా బాపిరాజు కీర్తి గడించారు. ఈ ఉపోద్ఘాతం దేనికంటే, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వంశంలో నాల్గవ తరంలో పుట్టిన అడివి శేష్ తన ముత్తాతగారి కళాప్రాభవాన్ని అందిపుచ్చున్నాడు. కవిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా ఇలా ఎన్నో విభాగాల్లో చిన్న వయసులోనే తన ప్రతిభ చాటుకున్నాడు.

24 ఏళ్ల వయసులో "కర్మ" సినిమాతో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన శేష్ ప్రముఖ దర్శకుడు అడివి సాయికిరణ్ కి సోదరుడు కూడా. సినీ రంగప్రవేశం చేసిన తొలినాళ్లల్లోనే పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థిగా "పంజా"లోను, రవి తేజ కి ప్రత్యర్థిగా "బలుపు"లోనూ నటించి మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా తెలుగు చిత్ర చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి" లో ఒక ప్రధాన ప్రతినాయకుని పాత్ర పోషిస్తున్నాడు. బహుముఖ ప్రతిభావంతుడైన అడివి శేష్ తో గోతెలుగు జరిపిన సంభాషణ ఈ వారం మీ కోసం:

* మీ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి?
- మా కుటుంబంలో "కళ" అనేది ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది.  అడివి బాపిరాజు గారు నాకు ముత్తాత అవుతారు. ఆయన 'హిమబిందు' కాని... 'గోన గన్నా రెడ్డి' కాని... తెలుగు లిటరేచర్ లో ఉన్న లోతుకి ఉదాహరణలు. ఆయనకి ముందు, ఆయన తరువాత కూడా, మా ఇంట్లో సంగీతం, నటన, పెయింటింగ్ మరియు వ్రైటింగ్ మీద ధ్యాస ఎప్పుడో ఉంది. అదే కల్చర్, అదే "ఆర్ట్స్" మీద ఇంట్రస్ట్, ఇప్పుడు నాలో కూడా ఉంది. అదే కంటిన్యూ అవుతోంది. నేను సాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ లో "సినిమా" చదువుకున్నాను. నాకు వేరే ఇంట్రస్ట్ ఎప్పుడూ లేదు, ఎప్పటికీ ఉండదు.

* మీకు సినిమా పట్ల ఆసక్తి ఎప్పటి నుంచి మొదలైంది?
- సినిమా మీద ఆసక్తి నాకు చిన్నప్పట్నించి ఉంది. ఇంట్లో "arts" మీద ధ్యాస ఉండటం వల్ల ప్లస్... మా తరంలో సినిమా అనేది ప్రముఖమైన "artform" కాబట్టి, సినిమా రంగంలోకి ప్రవేశించడం జరిగింది. నాకు నాలుగు సంవత్సరాలప్పుడే, యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ కలగడం, యాక్టింగ్ చెయ్యడానికి ప్రయత్నించడం జరిగింది అని అమ్మ, నాన్న చెప్పారు.

* 'కర్మ' సినిమాకి నటన, దర్శకత్వం, సంగీతం, గానం... ఇలా అన్నిటా, అంతటా మీరే అయ్యారు. ఆ అనుభవాలు మాతో పంచుకుంటారా? అసలు అలాంటి అంశం తో సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది?
- కర్మ అనేది ఒక ప్రయోగం. ఆ ప్రయోగం నాకు ఇండస్ట్రీ లో చాలా గౌరవం తీసుకొచ్చింది. ఆ సినిమా తీస్తున్నప్పుడు, నాకు సినిమా ఇండస్ట్రీ లో ఎవరూ తెలియదు. జీవితం లో మరో సినిమా తీస్తానో లేదో, మరో సినిమాలో నటిస్తానో లేదో నాకు తెలియదు. కర్మ లో దర్శకత్వం, నటన నచ్చి చేశాను. మిగిలినవి అన్నీ "hobbies" లాగ, plus U.S. లో తెలుగు టాలెంట్ కి పరిమిత వనరులు ఉండటం వల్ల (నా బడ్జెట్ కూడా పరిమితం)... తప్పక చెయ్యడం జరిగింది. కర్మ నా వ్యక్తిగత చిత్రం.

* పవన్ కళ్యాణ్ తో 'పంజా', రవితేజ తో 'బలుపు' లో నటించారు. ఆ ఇద్దరు హీరోల్లో మీకు నచ్చిన మంచి, చెడు ఏమైనా ఉన్నాయా?
- పవన్ కళ్యాణ్ గారిలో నాకు అన్నిట్లో నచ్చింది ఆయనకు జీవితం మీద ఉన్న అవగాహన. నాకు సెట్ మీద చాలాసార్లు పుస్తకాలు చదువుతూ, లైఫ్ లో deeper things గురించి reflect చేస్తూ కనిపించేవారు. కొత్త విషయాల్ని నేర్చుకోవాలి అన్న తపన ఆయనలో కనిపించింది. ఒక స్టార్ అన్న గర్వం ఎప్పుడూ లేదు. రవితేజ గారిలో నచ్చింది ఆయన నిజాయితీ, ఆయన open minded స్వభావం, నన్ను కెరీర్ విషయంలో ప్రోత్సహించిన విధానం. ఆయనకి మనిషిలో హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తే, దాన్ని గుర్తిస్తారు, ఎంకరేక్ చేస్తారు.
వాళ్లు ఇద్దరితో నేను కోరుకున్నంత ఎక్కువగా మాట్లాడలేకపోయానని, ఎక్కువ సమయం గడపలేకపోయానని ఒక బాధ ఉంది.

* పెద్ద హీరోలకు ప్రత్యర్ధిగా నటిస్తూనే 'కిస్' నిర్మించారు. కాని అది మీకు విజయాన్ని కట్టబెట్టలేదు. కారణం ఏమంటారు?
- నేను జీవితంలో ఏది ప్రయత్నించినా, దానికి 100% ఇచ్చాను. కొన్ని వర్క్ అవుట్ అయ్యాయి. కొన్ని అవ్వలేదు. నో regrets.

* మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
- 'బాహుబలి' సినిమాలో ఒక ముఖ్యపాత్ర చేస్తున్నాను. నా డ్రీమ్ డైరెక్టర్ రాజమౌళి గారితో వర్క్ చేస్తున్నాను. అది కాకుండా 'లేడీస్ అండ్ జెంటిల్ మేన్' అనే 'కాన్సెప్ట్' సినిమా లో హీరోగా యాక్ట్ చేస్తున్నాను.

* 'బాహుబలి' లో మీ పాత్ర గురించి చెప్తారా?
- బాహుబలి గురించి ఏమీ చెప్పలేను అండి. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి నటుడికి ఇవ్వబడిన ప్రత్యేకమైన సూచనలు.

* నటన, దర్శకత్వం, నిర్మాణం... మీకు ఏది ఎక్కువ సంతృప్తి ఇస్తోంది?
- నటన. It is my first love.

* పరిశ్రమలో ఎదగడానికి ప్రతిభతో పాటు గాడ్ ఫాదర్ అవసరమంటారా?
- నేను 'గాడ్ ఫాదర్' అనే కాన్సెప్ట్ ని నమ్మను కాని. ఈ ఇండస్ట్రీలో, ఇన్ఫాక్ట్, ఏ ఇండస్ట్రీ లో ఐనా, నెట్ వర్కింగ్ అన్నది బాగా ముఖ్యం. ఇండస్ట్రీ లో మన కొలీగ్స్ ని కలుస్తూ ఉండాలి. చాలా విషయాలు ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్స్ మీద, రిలేషన్స్ మీద నడుస్తాయి. అలా అని మనం "ఫేక్" గా ప్రవర్తించవలసిన అవసరం లేదు. మనకి నచ్చిన మనుషులు, మన ఐడియాలజీ తో వర్క్ చెయ్యడం లో సంతృప్తి చాలా ఉంటుంది.

* ఇండియాలోలా కాకుండా అమెరికాలో ఇండిపెండెంట్ సినిమాకి కూడా ఆదరణ ఉంది కదా... ఒక వేళ ఇండిపెండెంట్ మూవీ బాగా హిట్ అయితే దానిని మైన్ స్ట్రీమ్ లోకి కూడా తీసుకెళ్ళే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ట్రై చేయకుండా మీరు ఇక్కడ సినిమాలు ఎందుకు తీస్తున్నారు?
- నేను 2014 లో ఒక ఇంగ్లీష్ సినిమా లో యాక్ట్ చేయబోతున్నాను. తెలుగు మన భాష కాబట్టి, ఎంతైనా తెలుగు సినిమాలు అంటే, తెలుగు కల్చర్ అంటే కొంత పక్షపాతము ఉంటుంది. కాని... వస్తున్న genuine హిందీ, ఇంగ్లీష్ ఆఫర్స్ ని కూడా టేక్ అప్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను.

* చివరిగా మీరు ఔత్సాహిక నటులకు, దర్శక నిర్మాతలకు మీ అనుభవాల నుంచి చెప్పే పాఠం ఏదైనా ఉందా?
- సక్సెస్ కి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఏమీ లేదు. మన పనిలో 100% సిన్సియారిటీ కనిపిస్తే, అదే ప్రజలకి, దేవుడికి, అందరికీ కనిపిస్తుంది. Nothing beats hard work. But....work smart. ఈ ఇండస్ట్రీలో మన హార్డ్ వర్క్ కాకుండా... మనకి లక్ కూడా బాగా అవసరం. నా మొదటి నాలుగు సినిమాలతోనే నేను పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, విష్ణువర్ధన్ గారు, శోభు గారితో వర్క్ చెయ్యగలిగాను అంటే... అది అదృష్టం అనే అనుకోవాలి. అదే సమయంలో, నాకు నచ్చిన పర్సనల్ ఫాషన్ ప్రాజెక్ట్స్ కూడా చెయ్యగలిగాను. మన ప్రయత్నంలో పట్టు... దేవుడి ఆశీస్సులు ఉంటే కాని... మనం పైకి రాలేము.

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka