Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( కుంభకోణం )

ఈ వారం నుంచి మనం కుంభకోణం లో తిరుగుదాం , కుంభకోణం అనగానే మనకి రాజకీయనాయకులు చేసేవి గర్తొస్తాయి కాని మనం యిప్పడు ఆకుంభకోణం గురించి మాట్లాడు కోడం లేదు , తమిళనాడు రాష్ట్రంలో ఓ పట్టణం కుంభకోణం . మా చిన్నప్పుడు యెవరైనా రామేశ్వరం వెళ్లేం అంటే  మా  నానమ్మగారు కుంభకోణం వెళ్లేరా ? అని అడుగుతూ వుండేవారు . అప్పటినుంచి నాలో కుంభకోణం లో యేముంది యీవిడ యిన్నసార్లు తలచుకుంటోంది అనే కుతూహలం మొదలయింది . 1995 లో యేవో శలవులలో కుంభకోణం బయలుదేరేం . హోటలు లోంచి బయటకు రాగానే రిక్షా అతను అన్ని మందిరాలు చూపిస్తాను పదిరూపాయలివ్వండి అంటే యేవో ఒకటో రెండో అనుకున్నాం . నాలుగు మందిరాలు చూసేక మాకు విసుగొచ్చి రూముకొచ్చేసేం . నడిచింది యెక్కువ , రిక్షాలో కూర్చున్నది తక్కువ . ఊరు చూస్తే సాంప్రదాయకమైన ఓ చిన్న పట్టణం . ఊరు కన్నా మందిరాలు పెద్దవిగ అనిపించేయి . దానితరువాత లెక్కలేనన్ని సార్లు వెళ్లేం కాని కుంభకోణం చుట్టుపక్కల చూడవలసిన మందిరాలు యెన్నో మిగిలిపోయేయి . ‘ నాయనార్ల ( శైవభక్తులు , శివుని మీద ప్రబంధాలు  రచించిన వారు ) ‘కావేరి నదీ తీరంలో సుమారు 275 పాతాళ పేత్ర స్థలాలు  స్వయంభూ శివలింగాలుగా చెప్పబడ్డ మందిరాలు వున్నాయి , అందులో సుమారు ఓ యాభైయేనా చూసేమో లేదో ? మిగతావి చూడగలనో లేదో మరి , చూసినంతమటికి మీకు కూడా నాకళ్లతో చూపిస్తాను .

అయితే ప్రస్తుతం లోకి వస్తే ఆ సారి ఒక రోజు వుందామనకున్న వాళ్లం మూడురోజులు వుండి కుంభకోణం పట్టణం లో వున్న కొన్ని మందిరాలు చూసేం . అందులో కుంభేశ్వరాలయం ముందు చూడదగ్గది , అన్నిటికన్నా పెద్దది కూడా ? ముఖద్వారం నుంచి లోపలకి సుమారు అరకిలోమీటరు నడవడం , పెద్దపెద్ద రాతి ద్వారాలు వాటిమీద బొమ్మలు అని తప్ప వివరంగా చూడలేదు , తిరిగి 2000 సంవత్సరంలో వెళ్లినప్పుడు మందిరాలను పరిశీలనగా చూడడం , స్థలపురాణం తెలుసుకోడం చెయ్యడంతో మందిరాలు చూసే దృష్టి మారింది .

చెన్నై నగరానికి సుమారు 273 కిలోమీటర్ల దూరంలో కావేరి , అర్సలార్ అనే రెండునదులకు మధ్యన వుంది కుంభకోణం పట్టణం . ముందుగా కుంభకోణం వూరికి ఆ పేరు యెలావచ్చిందో తెలుసుకుందాం , అలాగే ఆవూరితో ముడిపడి వున్న మందిరం గురించి తెలుసుకుని తరువాత చుట్టుపక్కల వున్న మందిరాలను దర్శించుకుందాం .

కుంభకోణం అంటే ‘ కుండ మూల ‘ అని అర్దం , వివరంగా చెప్పాలంటే బ్రహ్మ మహాప్రళయ సమయంలో జీవులను భద్రపరచిన కుండను యిక్కడ కొన్నాళ్లు భద్రపరచేడట , అందుకు యీ ప్రాంతాన్ని కుంభకోణంగా పిలువసాగేరు . . ఈ పట్టణం కావేరి డెల్టా లో వుండడం వల్ల యిక్కడి నేలంతా సారవంతంగా వుండి వరి , చెరుకు పంటలకు అనువుగా వుంది . 17 వ శతాబ్దం లో కావేరి నదికి ఆనకట్ట నిర్మాణం చేసి వరదలను నియత్రించేరు .

ఈ మధ్య కాలంలో చాలామంది నగరవాసులు అరబ్ దేశాలకు వెళ్లి బాగా సంపాదించడం  , ఆ డబ్బుతో యిక్కడ వ్యాపారసంస్థలు కట్టడం , పర్యాటకులక కావలసిన సౌకర్యాలు పెంచడం వల్ల పర్యాటకులను ఆకర్షించటం వల్ల యిదో పెద్ద నగరంగా రూపుదిద్దుకుంది . చుట్టుపక్కల గ్రామాలకు యిదొక వ్యాపార కూడలిగా గుర్తింపు పొందింది . విద్యా సంస్థలు , యితరమత ప్రార్ధనల మందిరాలు కూడా వెలిశాయి . అలాగే చిన్న పట్టణమల్లా పెద్ద నగరంగా మారిపోయింది .
ఇక మందిరాల విషయానికి వస్తే మనం ముందుగా కుంభకోణం పట్టణానికి పేరు తెచ్చిన కుంభేశ్వరుని కోవెల గురించి చెప్పుకుందాం . రైల్వే స్టేషనుకి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోను , బస్టాండుకి అర కిలోమీటరు దూరంలోనూ వున్న విశాలమైన మందిరం . ఈ మందిర నిర్మాణ కాలం చరిత్ర కారులు నిర్ధారించలేక పోయేరు , కాని 7 వ శతాబ్దం లో చోళరాజుల కాలానికే యీ మందిరం వున్నట్లు నిర్ధారించేరు .

సుమారు నాలుగు యెకరాలలో నిర్మింపబడ్డ శివకోవెల , నాలుగు ప్రక్కలా పెద్దపెద్ద రాతితో చెక్కిన ప్రవేశ గోపురాలు , అందులో ముఖ్యంగ తూర్పున వున్న గోపురం 11 అంతస్థులలో సుమారు 128 అడుగుల యెత్తులో వుంటుంది . ముఖ్య ద్వారం లోంచి గర్భగుడి లోకి వెళ్లడానికి స్థంభాలతో నిర్మించిన 300 అడుగుల పొడవైన మండపం వుంటుంది , అక్కడనుంచి నవరాత్రి మంటపం లోకి ప్రవేశిస్తాం , నవరాత్రులలో యిక్కడ బొమ్మలకొలువు పెడతారు , అందుకే దీనికి నవరాత్రి మంటపం అనే పేరొచ్చిందేమో మరి , కాని నవరాత్రులలో యిక్కడ బొమ్మమలకొలువు పెట్టి , రాత్రి పూట అమ్మవారిన సర్వాలంకారాలతో అలంకరించి దీపధూపాలతో అర్చించి ఉయ్యాల సేవ చేసి పాటలు పాడుతూ పవళింపు సేవ హారతి చేస్తారు , ఓ సారి దశరా నవరాత్రులలో కుంభకోణం వెళ్లడం జరిగింది , అప్పుడు మేం వెళ్లిన ప్రతీ కోవెలలోనూ బొమ్మలకొలువుని చూసేం .

ఈ నవరాత్రి మంటపం లో ఒకే రాతి స్థంభం మీద చంద్రుని పత్నులైన 27 నక్షత్రాలను , పన్నెండు రాశులను చూడొచ్చు . వీటిని మరే కోవెలలోని మనం చూడం . మరో అరుదైన శిల్పం ‘ షణ్ముఖుడు పన్నెండు చేతులకు బదులుగ ఆరుచేతులతో వున్న శిల్పం ‘ . ‘    కిరాతక మూర్తి ‘ అంటే శివుడు వేటగాని రూపంలో వుంటాడు , రాతితో చెక్కిన ‘ నాదశ్వరం ‘ వీటిని చూడొచ్చు . ఈ మంటపాన్ని విజయనగర రాజులు నిర్మించరు .

ఈ మందిరం మూడు ప్రాకారాలలో మూడు వరుసల గోపురాలతో వుంటుంది . గర్భగుడి గోపురం 9 అంతస్థులలో వుంటుంది , కుంభకోణంలో వున్న శైవ మందిరాలలో యిదే పెద్దమందిరమని చెప్తారు . ద్వజస్థంభానికి యెదురుగా మెట్లెక్కి వెళితే పెద్ద మంటపం దానితరవాత గర్భగుడి .గర్భగుడిలో మూలవిరాట్టు ‘ ఆది కుంభేశ్వరుడు ‘ మన్ను తో చేసిన శివలింగం , ఈ శివలింగానికి అభిషేకాదులు నిర్వహించరు , నిత్య అభిషేకాదులు కూడా ఉత్సవ విగ్రహాలకు చేస్తారు . మూలవిరాట్టైన కుంభేశ్వరునికి యెడమవైపున అమ్మవారు ‘ మంగళ నాయకి ‘ గా పూజలందుకుంటోంది , కుడివైపున సోమస్కందం వుంటాయి .

ఈ మందిరం లో శివునికి రోజూ ఆరు పూజలు నిర్వహిస్తారు . ప్రతీ 12 యేళ్ల కొకసారి మాఘ మాసంలో  ‘ మహామఖం ‘ ఉత్సవాన్ని నిర్వహిస్తారు .గర్భగుడి గోడలపైన వీరభద్రుడు , సప్తకన్యలు , విశాలాక్షి , విశ్వనాథుడు ,భిక్షాటన , ార్తికేయుడు , అన్నపూర్ణ , గజలక్ష్మి , మహాలక్ష్మి , సరస్వతి , జేష్టాదేవి , దుర్గ , దక్షిణామూర్తి ,సంధికేశ్వరుడు , అరకుల వినాయకుడు , నంది , బలిపీఠం, సభావినయకుడు , కాశీవిశ్వనాథుడు శిల్పాలను చూడొచ్చు . జ్వరహరేశ్వరుడు , భైరవుడు , సంధికేశ్వరుడు , శ్రీగోవింద దీక్షితార్ , నాగంబాళ్  , చంద్రుడు , సూర్యుడు , అధికార నంది ( అంటే యేమిటో నాకూ తెలీదు , అక్కడివార ఆ పేరు చెప్పేరు ) . వల్లభగంపతి , షణ్ముఖుడు , నవగ్రహాలు , నంది , లక్షీనారాయణ పెరుమాళ , ముట్రవేల్ వినాయకుడు , బాల దండాయుధపాణి , వన్న వినాయకుడు మొదలయిన విగ్రహాలు గర్భగుడి వెలుపల కొన్ని చిన్న మందిరాలలో వుంటే మరికొన్ని మంటపం స్థంభాలపైన వున్నాయి .

రెండో ప్రాకారంలో ని మంటపాలలో 63 శైవ మునుల విగ్రహాలు , తమిళ ప్రబంధ కర్తలైన అప్పార్ , సంబందార్ , సుందరార్ ల విగ్రహాలు వున్నాయి .వెండి తాపడం చేసిన వాహన మంటపం లో స్వామి వారిని ఊరేగించే రకరకాల వాహనాలు వున్నాయి . అలంకరణ మంటపం , పాకశాల , ఏనుగుల మంటపం ( మందిర సేవలో వుండే యేనుగలను యిక్కడ కడతారు ) , గోశాల , కల్యాణ మంటపం వున్నాయి . ఈ మందిరం లో కుంభేశ్వరునికి ప్రతీరోజూ ఆరు సేవలను చేస్తారు . మందిర ప్రాకారం లో చంద్రతీర్థం , సూర్యతీర్థం , గౌతమతీర్థం , వరాహతీర్థం అనే నాలుగు పుష్కరిణులు వున్నాయి  , అన్వ తీర్థం , నాగతీర్థం , క్రూరతీర్థం అనే మూడు మంగళ కూపాలు ( నూతులు ) వున్నాయి , ఈ మందిరానికి చెందిన మహామఖ తీర్థం , వరుణతీర్థం , కశ్యప తీర్థం , చక్రతీర్థం , మాతంగతీర్థం , భగవత తీర్థం , పోత్రమారై తీర్థం మందిరం బయట వుంటాయ . ఇక స్థలపురాణం గురించి చెప్పుకోవాలంటే మహాప్రళయ సమయంలో జీవరాశుల బీజాలను నిక్షిప్తం చేసిన కుండ ప్రళయం లో కొట్టుకుపోతూవుండగా శివుడు తన శక్తితో ఆ కుండను జాగ్రత్తగా యీ ప్రదేశం లో దాచి ప్రళయానంతరం దానిని తిరిగి బ్రహ్మకు యిచ్చి వేస్తాడు . కుండను దాచిన ప్రదేశంలో శివుడు స్వయంగా మన్నులో అమృతం కలిపి చేసిన లింగమని శైవమునులు వారి స్తోత్రాలలో స్తుతించేరు . మన్ను తో చేసిన లింగం కాబట్టి మూలవిరాట్టుకి అభిషేకం చెయ్యరు . కుంభకోణం లో అమృతం చుక్కలు పడ్డాయని అంటారు , అవి యెక్కడెక్కడ పడ్డాయో , అమృతం యిక్కడకు యెలా వచ్చింది , యెవరు తెచ్చారనే విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాం .

మరిన్ని శీర్షికలు
weekly horoscope november 2nd to november 8th