ఈ రోజుల్లో దేశం లో ఎక్కడ చూసినా, విద్యార్ధుల పేరెంట్స్ ది ఒక్కటే ధ్యేయం.. ఎలాగైనా సరే మనపిల్లదో, పిల్లాడో I I T లో చేరాల్సిందే.. ఇంకేమీ అక్కర్లేదు జీవితంలో.. అక్కడ degree తెచ్చేసుకుంటే చాలు, ఏ అమెరికాకో ఆ పై చదువుకి వెళ్ళి లక్షల్లో జీతాలు సంపాదించేయాలి… మిగిలిన degree లు వీళ్ళ కళ్ళకి ఆనవు. పిల్లలు ఎంత ఒత్తిడికి లోనవుతారో ఈ పేరెంట్స్ కి అవసరం లేదు…
ఇది వరకటి రోజుల్లోనూ ఉండేది ఇటువంటి కోరిక, కానీ మరీ ఈ రోజుల్లోంత విపరీతంగా కాదు. ఓ రకంగా తెలివైన విద్యార్ధులే , ఏదో శలవల్లోనో, లేక పెద్దనగరాల్లో ఉండే, పేరున్న ట్యుటోరియల్స్ ద్వారా, పోస్టల్ ట్యూషన్ తో పని కానిచ్చేసేవారు. I I T ల్లో ప్రవేశం లభించాలంటే, అప్పుడూ, ఇప్పుడూ కూడా కష్టతరమైన పనే. అందులో సందేహం లేదు. ఆ పోటీకి తట్టుకోలేక, ప్రవేశం లభింపకపోతే, మరో పేరెన్నికకన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి పైకి వచ్చి, మంచిమంచి ఉద్యోగాలు సంపాదించేవారు… కానీ, కాలక్రమేణా ఈ I I T అన్నది ఒక Brand అయికూర్చుంది… చదివితే అక్కడే మన పిల్లాడు / పిల్ల చదవాలీ అనే ఓ దృఢ నిశ్చయానికి వచ్చేసారు ఈనాటి పేరెంట్స్… సరీగ్గా ఇదే బలహీనతనండి, ఇంకోటేదో అనండి, Cash చేసుకుంటున్నారు ఈనాటి విద్యావేత్తలు.. ఎక్కడ చూసినా ఈ I I T Coaching Classes, పుట్టగొడుగుల్లా వచ్చేసాయి, ఫీజులు కూడా ఎక్కువే… ఈ వ్యాపారంలో ఇంత potential ఉండగా, మన Corporate విద్యాసంస్థలా వదిలేదీ ఇలాటి సదవకాశం?
8 Th Class నుండే, విద్యార్ధికి IIT Foundation కూడా మొదలెట్టేసారు.. అసలు అర్ధం పర్ధం ఉందా ఈ వేలంవెర్రికీ? 12 th Class పూర్తయిన తరువాత చేరబోయే I I T కి, నాలుగేళ్ళ ముందరనుండీ, Foundation అని పేరుపెట్టి, పిల్లల్ని అంత హింసపెట్టడంలో ఏం సాధిస్తున్నారో వాళ్ళకే తెలియాలి.. ఈ కోర్సుల్లో వీళ్ళు నేర్పేదానికీ, పిల్లలు స్కూల్లో నేర్చుకునేదానికీ సంబంధం ఉండదు, వీళ్ళు ఏమైనా నేర్పుతారా అంటే అదీ లేదూ, గత 30-40 సంవత్సరాల్లోనూ, IIT Admission Tests లోవి , ప్రశ్నలన్నీ చేయించడం. ఉదాహరణకి లెక్కల్లో, Fundamentals తెలియకుండా, Higher Mathematics అసలెలా అర్ధం అవుతుందనుకుంటారో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ పిల్లలేమైనా స్వఛ్ఛందంగా చేరేరా అంటే అదీ కాదూ… ఆ పిల్లాడికో పిల్లకో వచ్చిన మార్కులను బట్టి, 8 th Class నుండీ, ఆ యాజమాన్యం వారే decide చేసేసి, పేరెంట్స్ కి చెప్తారుట..
పైగా దీని ఫీజు వేరే..పోనీ విద్యార్ధికి ఏమైనా అర్ధమవుతోందా అంటే, అదీలేదూ… కారణం ఆ పాఠాలన్నీ ఎప్పుడూ విన్నవి కాదాయే.. అడగడానికి కుదరదూ.. చివరకి ఈ మాయదారి Foundation Course ఎందుకుపయోగిస్తుందయ్యా అంటే, ఈ పేరెంట్స్ ఊళ్ళోవాళ్ళందరికీ చెప్పుకోడానికి “ మావాడు ఐఐటి ఫౌండేషన్ లో చేరాడండీ.. “ అని. ఈరోజుల్లో ఎక్కడచూసినా, ఇదే పలకరింపు.. “ మీవాడికి ఫౌండేషన్ లో సీటొచ్చిందా… “ అంటూ… అంతే కానీ, పాఠాలర్ధమవక పిల్లాడికి ఎంత మనోవేదన కలుగుతోందో మాత్రం చూడరు. ఆ ఒత్తిళ్ళకి తట్టుకోలేక, ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలకి కూడా సిధ్ధ పడుతున్నారో గమనించారా? ఓవైపు పేరెంట్స్ కి Prestige issue గానూ, ఇంకోవైపు పిల్లలకి ప్రాణ సంకటంగానూ తయారయింది పరిస్థితి.
దేశం నిండా వేలాది ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి, అన్నీ కాకపోయినా, చాలా కాలేజీల్లో చదివిన విద్యార్ధులు కూడా, విదేశాలకి పైచదువులకి వెళ్ళే అర్హత సంపాదించారు కూడా.. అంటే అక్కడి Degree కూడా పనికొచ్చినట్టేగా. పిల్లలమాటెలా ఉన్నా, కనీసం పేరెంట్సైనా ఈ వ్యామోహంలోంచి బయటపడి, పిల్లల్ని చదువుకోనిస్తే వాళ్ళూ ఎటువంటి ఒత్తిడీ లేకుండా చదువుకోగలుగుతారు.
సర్వేజనాసుఖినోభవంతూ…
|