స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్‌ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినీ ప్రస్థానం అయిన 'కథానాయకుడు' కాగా, రెండోది రాజకీయ ప్రస్థానం 'మహానాయకుడు' గా రూపొందుతోంది. అయితే రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే కథలో చిన్న చిన్న మార్పులు చేసే అవకాశాలున్నాయనీ తాజా సమాచారమ్. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ పరిస్థితుల నుండి, ఇప్పటి రాజకీయ పరిస్థితులు వరకూ ఈ కథ నడవనుందట. అయితే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ దాస్య శృంఖలాల నుండి విముక్తిని పొందడానికే తెలుగు వారి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
అలాంటిది ఆ కాంగ్రెస్ మద్ధతునే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటుండడంతో క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో దీనికి సంబంధించిన మార్పు చేర్పులు చూపించే అవకాశాలున్నాయనీ టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్ట్‌గా ఆ మార్పును అలా చూపించకుండా, పార్టీలకతీతంగా ఢిల్లీ పాలకులపై తెలుగు దేశం పార్టీ చేసే పోరాటంగానే చూపించనున్నారట. చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది నెలల వ్యవధిలోనే రెండు భాగాల్నీ విడుదల చేయనున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఎన్టీఆర్' బయోపిక్‌ని బాలయ్య తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
|