విడుదలకు ముందే పైరసీ వీడియో బయటికి వచ్చేయడం, 'నోటా' డిజాస్టర్ కావడంతో 'టాక్సీవాలా' సినిమాపై అంతవరకూ ఉన్న అంచనాలు తారుమారైపోయాయి. 'నోటా' ఫెయిల్యూర్‌ని పెద్దగా పట్టించుకోకపోయినా, కష్టపడి రూపొందించిన సినిమా డిజిటల్ ప్రింట్ పైరసీతోనే విజయ్ దేవరకొండ బాగా డీలా పడిపోయాడు. అసలు రిలీజ్‌కే నోచుకోదేమో అనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కావడం, సినిమా ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్, ప్రబాస్ వంటి స్టార్ హీరోలతో పాటు, నిఖిల్ వంటి యంగ్ హీరోల సపోర్ట్‌తో 'టాక్సీవాలా' మంచి విజయమే సాధించింది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ సక్సెస్ కొట్టేసింది.
ఇక తర్వాత నుండీ కలెక్షన్లు మరింత పుంజుకోవడంతో దాదాపు నిర్మాతలు గట్టెక్కినట్లే అయ్యింది. దాదాపు 10 కోట్లు పైనే షేర్ సాధించేసింది. విజయ్ దేవరకొండ - ప్రియాంకా జవాల్కర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇకపోతే తర్వాత విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రంతో బిజీ అయిపోయాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకూ తెలంగాణా యాసతో అలరించిన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రంలో అచ్చమైన ఆంధ్రా కుర్రోడిలా ఆకట్టుకోనున్నాడు.
|