ముమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగత వైఎస్సార్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'యాత్ర'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదెవ్వరూ. అయితే ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. వైఎస్సార్ పాత్రలో ముమ్మట్టి చెప్పే డైలాగులు ఎమోషనల్‌గా ఎక్కడో టచ్ చేస్తున్నాయి. ఆయన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించారాయన. అయితే రాజశేఖర్ రెడ్డి అంటే స్వచ్ఛమైన చిరునవ్వుకు కేరాఫ్ అడ్రస్. ఆ చిరునవ్వు మమ్ముట్టి పాత్రలో కరువైనట్లు కనిపిస్తోంది. సీరియస్ టోన్‌లో సినిమా సాగినట్లుగా ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. ఏది ఏమైనా మొదట్లో అంచనాలు క్రియేట్ చేయని 'యాత్ర' సినిమాపై ఇప్పుడు అనూహ్యంగా హైప్ వచ్చేసింది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది. 'ఆనందోబ్రహ్మ' ఫేం మహి.వి.రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
అయితే టీజర్, ట్రైలర్ వచ్చినా కూడా ఎక్కడా అనసూయ పాత్రను రివీల్ చేయలేదు. వైఎస్సార్ కూతురు షర్మిలగా అనసూయ కనిపించబోతోందనీ ప్రచారం జరిగింది. కాదు కాదు, చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్రట అంటూ మరో టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ పాత్రపై సస్పెన్స్ వీడాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందేనేమో. మరోవైపు వైఎస్ విజయమ్మ పాత్రలో మలయాళ భామ ఆశ్రిత నటిస్తోంది. యాత్ర ట్రైలర్‌తో పాటు విడుదలైన విజయలక్ష్మి ఫస్ట్‌లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అచ్చం విజయమ్మలాగే ఆశ్రిత ఈ పాత్రలో ఒదిగిపోయి కనిపించారు.
|