Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవితలు - గంజాం భ్రమరాంబ

     చిరునామా లేని ఉత్తరం

సాయంత్రపు చల్లగాలిలో..
సరుగుడు చెట్ల నీడలో
సేదతీరుతున్న నా చేతికి
గాలికి ఎగిరొచ్చి తగిలింది
ఒక చిరునామా లేని ఉత్తరం

అది తన ప్రేయసికి పంపుతున్న
ఒక ప్రేమ సందేశం
తన విరహాన్ని వంపుకున్న
ఇంకొక మేఘసందేశం

తోటలోని పూలన్నీ
ఒక్కసారిగా విచ్చుకున్న
అనుభూతిని కలిగించి
నా జ్ఞాపకాల స్వరవాణిని
మృదువుగా పలికించి
నా  ఉద్వేగాన్ని చూసి
నవ్వుతూ పులకించి
మల్లెల మాలలను
మదిలో మెదిలించి
ఉన్నపళంగా నన్ను
గతానికి పంపించి
నన్ను నా నుంచి
దూరంగా కదిలించి..
ఇంతలో
వీచిన గాలికెరటంతో పాటు
దూరంగా ఎగిరి పోయింది...

మళ్లీ ఏ గుండెను కుదిపి కదిలించడానికో
ఏ జ్ఞాపకాలను ఆర్తితో రగిలించడానికో
ఎగిరెగిరి వెడుతోంది
చిరునామా లేని ఉత్తరం

*****************

అమ్మకు...ప్రేమతో..

ప్రియమైన అమ్మా...

నేను నీ కడుపులో
అంకురించిన తక్షణమే
నువ్వూ ఒక తల్లిలా
పరిణామం చెందావు

నీ బొజ్జనే ఊయలగా మార్చావు
ప్రేగుతో ఆహారం అందించావు
నా కదలికలను ఆస్వాదించావు
తంతున్నానని ఆనందించావు
నీ అందాన్ని ఆనందాన్ని పక్కన పెట్టి
నాకు జన్మనిస్తూ
నువ్వు పునర్జన్మ నెత్తావు

నీ రక్తాన్ని స్తన్యంగా మార్చావు
నాకు ఊహతెలిసే వరకూ
నీ ఒడినే ఒక గుడిగా మలిచావు

నువ్వు కరుగుతూ నన్ను వెలిగించావు
నన్ను పెంచుతూ నువ్వు సంక్షిప్తమయ్యావు

నవ్వులను దోసిళ్లతో పట్టి తాగించావు.
దుఃఖం నా దరి చేరకుండా గోడలా నిలిచావు

నా ద్వారా
నా విజయాల ద్వారా
నువ్వు బహిర్గతమవుతుంటావు

నా ప్రతిభ లో
నా సాధనలో
నీవు అంతర్లీనంగా దాగుంటావు

దేవుడు అసలు ఎలా ఉంటాడో
అన్న ప్రశ్న నాలో తలెత్తకుండా
నీ రూపంలో చూపించావు

ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీరదని తెలిసి
తరువాతి జన్మలోనైనా నీకు
 అమ్మని అవ్వాలనుకుంటున్నాను.


అమ్మా...నా కడుపులో
బిడ్డగా నువ్వు పుట్టమ్మా..
నాకు నీ ఋణం తీర్చుకునే
అవకాశం దయచేసి ఇవ్వమ్మా..

****************************

నువ్వెప్పుడు జన్మించావ్

నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మించావు?

నీ తల్లిదండ్రులు
నీకు ఊపిరి పోసిన
నిమిషం లోనా....

లేదా
నీ మానవజన్మకు
అర్థం, పరమార్థం
వుందని తెలుసుకున్న
మరుక్షణంలో నా ....

రత్నాకరుడు
వాల్మీకిగా,

గౌతముడు
బుద్ధుడుగా,

నరేంద్రుడు
వివేకానందుడుగా,

మోహనుడు
మహాత్ముడుగా,

ఠాగూర్
కవీంద్రుడుగా,

అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాతగా

సావిత్రి భాయి
తొలి ఉపాధ్యాయినిగా

థెరెసా
విశ్వమాతగా,

ఇలా ఎందరెందరో...
పునః జన్మించడానికి

సంవత్సరాల కాలం
యుగాంతాల త్యాగం
జన్మాంతరాల
మేథో మధనం
వెరసి
వారి జన్మ సాఫల్యం

మరి
నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మిస్తావు?

********************

మా పాఠశాల
ఒక తీయని జ్ఞాపకం


 ఆనంద సమీరాలలో విహరించిన క్షణాలవి
మా పాఠశాలలో దాగున్నవి
మా జ్ఞాపకాల పెన్నిధులవి

అరమరకులు ఎరుగని పసి హృదయాలకు
తల్లిదండ్రుల తరువాత మమతను
ఖచ్చితంగా పంచగలిగే భరోసాలవి

ఎటువంటి వివక్షతలూ ఆపదించలేని రోజులవి
పొద్దెరుగని ఆటపాటలకు
కాసేపు చదువుకే ఎదురయ్యే అలసటలవి
ఒక లంచ్ బాక్స్ లో చొరబడే
నాలుగైదు చేతులవి

చిన్నమాటకే తట్టుకోలేక
జలజలా కారే కన్నీళ్ళ స్రవంతులవి
మరు గడియకే మరిచిపోయి
గలగలా సాగే నవ్వుల ప్రవాహాలవి


అల్లరెంత చేసినా అలరించే మార్కులవి
బడిలో ఏదైనా వేడుక అనగానే
రూపాంతరం చెందే సీతాకోకచిలుకలవి

రేపటి శిల్పాలుగా మారడానికి
నేడు శ్రమిస్తున్న శిలారూపాలవి
పేదరిక నిర్మూలనకు
నిజమైన ఆయుధాలవి

ఈ చైతన్య దీపాలను వెలిగిస్తున్న గురువులు అందరూ
గుడిలో దేవునికి చక్కని ప్రతిరూపాలు
 
విజ్ఞానం అందించే పాఠాలూ
జ్ఞానాన్ని పెంపెందించే అనుభవాలూ
నీతి కథలూ..
ఆరోగ్య సూత్రాలు
దైవ ప్రార్థనలూ
ప్రకృతి ఆరాధనలూ
మొక్కల పెంపకాలు
నీటి పొదుపులూ
డిజిటల్ క్లాసులూ
సైన్స్ లాబులూ
క్రీడామైదానాలు
విజ్ఞాన విహార యాత్రలు చేయిస్తూ
కంప్యూటర్ శిక్షణతో పాటు
యోగ, కరాటె, కూచిపూడి నాట్యం
అన్నింటినీ బోధిస్తూ..
సమాజానికి మంచి పౌరులను
అందించాలని ఆశిస్తూ..

ఉచిత పుస్తకాలు
ఉచిత దుస్తులు
మధ్యాహ్న భోజన సదుపాయాలు
వారానికి మూడు గుడ్లు
అమ్మాయిలకు
అబ్బాయిలకు బస్సు పాసులు
పదో తరగతి అక్కలకు
సైకిళ్లు..
పేదవారికి స్కాలర్‌షిప్పులూ
హాస్టల్ వసతులూ అందిస్తూ

అమ్మ ఒడిలా కనిపించే
విజ్ఞాన సాగుబడి నందించే
సంస్కార ఒరవడి నేర్పించే

మా పాఠశాల లోని
మధుర జ్ఞాపకాలు
తలిచిన కొద్దీ .‌‌..
ఆ ఆనందాన్ని పంచిన కొద్దీ

ప్రతి ఒక్కరూ
మళ్ళీ బాల్యం లోనికి ప్రయాణిస్తారూ
ఎన్నెన్నో మణిమాణిక్యాలను మోసుకొస్తారూ

ఇది మా ప్రభుత్వ పాఠశాల...
 మా ప్రతిభను ప్రతిబింబించే
 నిలువెత్తు ప్రదర్శనశాల

*****************************

మరిన్ని శీర్షికలు
sira chukkalu