Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

దీవెన

మన సంప్రదాయంలో ఆశీర్వచనాలకు ఒక గొప్ప ప్రధాన్యత ఉంది. సృష్టికర్త దేవునికి సైతం గుడిలోకి వెళ్లంగానే భక్తుడు దణ్నం పెట్టాల్సిందే! దేశానికి రాజైనా కాషాయం ధరించిన రుషి ముందు తల వంచాల్సిందే! ఒకరి ముందు తల వం(దిం)చితే, మన అహాన్ని వారి పెద్దరికం ముందు వంచినట్టే. అప్పుడు గురు స్థానంలో ఉన్న పెద్దలు మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తారు. అదే కొండంత బలం. అనుకున్న కార్యానికి సంకల్ప బలాన్నిస్తుంది. పనిని సానుకులం చేస్తుంది.

మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్దలు కనిపిస్తే ముందుగా ఒంగి వాళ్ల పాద పద్మాలకు నమస్కరిస్తారు. వాళ్లప్పడు వంగిన వారి తల మీద చేతులతో స్పృశిస్తూ దీవిస్తారు. మనోకజ్ఞంగా కనిపించే ఆ దృశ్యంలో ఎంతో అర్థం ఉంది.

ఆశీర్వచనానికి వ్యతిరేకం దిష్టి(దృష్టి). నరుడి దృష్టి తగిలితే నల్లరాయి బద్దలవుతుంది అనే నానుడి నిజమైతే ఆశీర్వచనానికి ఆయుషును, ఆరోగ్యాన్ని, కార్య సాఫల్యాన్ని ప్రసాదించే శక్తి ఉందని అంగీకరించాల్సిందే. మనసు చాలా శక్తిమంతమైంది. తిట్టినా, మెచ్చుకున్నా మనస్ఫూర్తిగా చేస్తే జరిగితీరుతుంది. పూర్వకలంలో మహర్షులు పెట్టె శాపాలు ఆ కోవలోకే వస్తాయి.

ఇది తెలిసే మనవాళ్లు ఇళ్లు కట్టినా, పెళ్లి చేసినా పదిమందిని పిలిచి బట్టలు పెట్టి, కడుపునిండా భోజనం పెట్టి వాళ్ల మనసులను సంతుష్టి పరుస్తారు. హృదయపూర్వక దీవెనలు పొందుతారు.

సంప్రదాయం, సంస్కృతీ అంటే ఆషామాషీకాదు. అది తరతరాల అనుభవజ్ఞానం. సంపద. దాన్ని భద్రపరచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ.ఇక్కడే పుట్టి పెరిగినతనికి, ఇక్కడ పుట్టి అమెరికాలాంటి దేశాల్లో పెరిగే వాళ్లకూ చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మన సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లే చోట ఉంటే ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుంది. అక్కడ పాశ్చాత్య సంస్కృతిలో ఉత్త పెరుగుదలే! మొక్కలు సైతం అనుకూల వాతావరణంలోనే పెరుగుతాయి. ఒకవేళ అననుకూల ప్రదేశంలో నాటినా, ఎదుగుబొదుగూలేక కుక్కమూతిపిందెలనిస్తాయి.

తల్లీ, దండ్రీ, గురువు, దైవం గౌరవనీయస్థానంలో ఉండేవారు. మొక్కదగినవారూ.  గురువు అంటే చదువు చెప్పేవాళ్లు మాత్రమే కాదు. జీవితంలోని ప్రతి పార్శ్వంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మార్గదర్శులు. జీవిత నౌక సాఫీగా సాగాలంటే ఎంతోమంది సహకారం అవసరం. దాన్నే ఒక  సైంటిస్ట్ మానవుడు సంఘజీవి అని క్లుప్తంగా చెప్పింది. సంఘజీవనంలో అందరి సహకారం అత్యవసరం. అహంకారాన్ని వదిలి ఎదుటి వాళ్లని నిండైన మనసుతో పలకరిస్తే కోరికలు ఈడేరతాయి.

ఈనాటి యువత అన్నింట్లో తాము ముందంజలో ఉన్నామని, తమకెవ్వరూ సాటిలేరని పెద్దరికానికి అసలు విలువివ్వడం లేదు. చదువుకునేప్పుడు ఆచార్యులను, ఉద్యోగంలో పై అధికారులను గౌరవించడం మృగ్యమవుతోంది. పెద్దా చిన్నా తారతమ్యం లేదు. అందరూ సమానమే అంటున్నారు. ఏమన్నాఅంటే M N C సంస్కృతి అంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు.

అవసరార్థం ఇతర చోట్లకి వెళ్లడం తప్పుకాదు, మన పద్ధతులని, సంప్రదాయాలని వదిలేయడం తప్పు.

చెప్పకపోతే చెడిపోయారంటారు. మరోసారి..మరోసారి వినేదాక చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే మన యువతని మనం కాపాడుకోకపోతే భవిత అగమ్యగోచరమవుతుంది.

*****

 

 

మరిన్ని శీర్షికలు
stories competetion