Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

( 18 జనవరి—24 జనవరి )  మహానుభావులు

జయంతులు

జనవరి 18

శ్రీ నాళం కృష్ణారావు :  వీరు 1881, జనవరి 18 న  మండపేట గ్రామం లో జన్మించారు. వీరు  బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయంస్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. తొలి తెలుగు సచిత్ర మాసపత్రిక  “ మానవసేవ “ వీరి ఆధ్వర్యంలో వచ్చినదే.  వీరి గురువు, శ్రీ కందుకూరి వీరేశలింగం  పంతులు గారు..

 

జనవరి 20

 శ్రీ బందా కనకలింగేశ్వరరావు :   వీరు 1907, జనవరి 20 న, ఆటపాక గ్రామంలో జన్మించారు. వీరు సుప్రసిధ్ధ రంగస్థల, సినిమా నటుడు.. నాటక ప్రయోక్త, నాట్యకళాపోషకుడు. న్యాయవాది గా పనిచేసినా, తరవాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేపట్టారు., కూచిపూడి నాట్యకళకు ఎంతో సేవ చేసారు.

 

జనవరి 22

 శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు :   వీరు  1882, జనవరి 22 న  నందిగామ గ్రామంలో జన్మించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. ఆంధ్రరాష్ట్ర ప్రధమ శాసనసభకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాలతోపాటు, వీరు గ్రంధాల ప్రచురణలోనూ ఎంతో కృషి చేసారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. .

జనవరి 23

  1. శ్రీ వావికొలను సుబ్బారావు “  వీరు  1863, జనవరి 23 న  ప్రొద్దుటూరు లో జన్మించారు.  వీరు ప్రముఖ రచయిత, గ్రాంధికవాది, “ భక్తి సంజీవిని “ మాసపత్రిక సంపాదకులు. రామాయణమును ఆంధ్రీకరించి  “ ఆంధ్ర వాల్మీకి “ అనే బిరుదుపొందారు. గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఎంతో పాటు పడ్డారు.
  2.  

 శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ  :   వీరు 1893, జనవరి 23 న , రాళ్ళపల్లి గ్రామంలో జన్మించారు. ఏకసంతగ్రాహి.. అన్నమాచార్యులవారి అనేక వందల కృతులను స్వరపరచి, తెలుగువారికి అందచేసిన ఘనత వహించిన మహనీయుడు. రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశారు..

 

 

వర్ధంతులు.

జనవరి  18.

శ్రీ నాగు నాగనార్య :  వీరు  ప్రముఖ సాహితీవేత్త., సంస్కృతాంధ్రములంటే ఎంతో అభిమానం. సుమారు 70 గ్రంధాలను రచించారు. వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే  శక్తి ఉండేది. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర,  ముక్కుతిమ్మన రచించిన పారిజాతాపహరణము లను ఆంధ్రీకరించి పలువుర మెప్పు పొందారు.

వీరు జనవరి 18, 1973 న స్వర్గస్థులయారు.

జనవరి 19

శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు :

  వీరు  ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడు. “ప్రాచీన గ్రంధాలు చదివి  సంప్రదాయజ్ఞానంతో రచనలు చేసిన బహుకొద్దిమందిలో వీరొకరు “ అని విశ్వనాధసత్యనారాయణ గారి మెప్పుపొందారు.

వీరు జనవరి 19,  1995 న స్వర్గస్థులయారు.

 

జనవరి 24

1. శ్రీ ముదిగొండ లింగమూర్తి :  వీరు పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే వారు.   నాటకరంగంలోని అన్నిరకాల పాత్రలూ ధరించి, సినిమారంగంలోకి అడుగెట్టారు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టినట్టు చెప్పేవారు.

వీరు 1980, జనవరి 24 న స్వర్గస్థులయారు.

 

2. శ్రీమతి  కాంచనమాల : తొలి తరం గ్లామర్ క్వీన్ గా పేరొందిన ప్రముఖ నటి. వీరి రూపలావణ్యం , విశాలనేత్రాలు  వీరికి ఎంతో అందం తెచ్చాయి.. ఆరోజుల్లోనే కాంచనమాల పేరుతో చీరలు, గాజులూ కూడా  ప్రసిధ్ధిచెందడం ఓ విశేషం. ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు తండోపతండాలుగా వెళ్ళేవారు.

వీరు 1981, జనవరి 24 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
pratapabhavalu