Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు  ఓ సినిమా చూసినప్పుడు, కుటుంబసమేతంగా చూడగలిగేవారు. వినోదానికి వినోదం, మంచి సంగీతం, ముఖ్యంగా భాష.. హాయిగా ఉండేవి.   చివరలో ఓ “ నీతి “ కూడా ఉండేది… ఆరోజుల్లో, సినిమాలు చూడడం వలన , ఎవ్వరూ పాడైపోయారని మాత్రం వినలేదు,  అలాగని ఇప్పుడు పాడైపోతున్నారని కాదూ.. కానీ కొన్ని అనవసరపు ఆలోచనలు, అదీ యువతలో మొలకెత్తుతున్నాయనడం లో సందేహం లేదు.. ఆరోజుల్లో సినిమాలకి “ పెద్దలకి మాత్రమే “ అనే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు గుర్తులేదు. మహా అయితే, కొన్ని అభ్యంతరకరమైన దృశ్యాలు కట్ చేసేవారు, దానివలన కథాగమనానికి అడ్డం ఎప్పుడూ రాలేదు. ఎటువంటి “ హెచ్చరిక “ ప్రకటనలు కూడా ఉండేవి కావు.. ఏ సరుకైనా, సినిమా అయినా, మరోటేదైనా.. నేరాలేవీ జరక్కుండా, ఏదో “ రామరాజ్యం “ లా ఉండేదని కాదూ, జరిగేవి అరుదుగా మాత్రమే. ఈరోజుల్లోలాగ , నేరం కానీ, ప్రమాదం కానీ  జరగని రోజులే బహుతక్కువ…  ఈరోజుల్లో, ప్రసారమాధ్యమాల్లో, అంటే టీవీ, వార్తాపత్రికల లో , ఇవిలేని రోజులే తక్కువ. పైగా జనాలు ఎంతగా అలవాటు పడిపోయారంటే, ఏరోజైనా వీటిగురించి ఏ వార్తా చూడకపోయినా, చదవకపోయినా ఉంటే, ఏదో వెల్తిగా కనిపిస్తోంది. అంతగా  addict  అయిపోయారు.

ఇది వరకటి రోజుల్లోలాగ సినిమాలు థియేటర్ కే వెళ్ళిచూడాలని లేదుగా.. టెక్నాలజీ ధర్మమా అని 24 గంటలూ , ఇంట్లోనే, చేతిలో మొబైల్ లో కూడా చూడొచ్చు… సినిమాలనే ఏమిటీ, ఏదైనా చూసే సదుపాయం ఉంది.. అప్పుడెప్పుడో,  అదేదో రాష్ట్ర అసెంబ్లీ లో ఇద్దరు శాసనసభ్యులు ఏవో బ్లూఫిలింలు ,  చూస్తూన్న ఫొటోలు పేపర్లలో వచ్చాయి. పాలకులే అలా ఉంటే, ప్రజలకేముందీ?

ఉదాహరణకి ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది.. హెచ్చరిక (  Statutory Warning )  అనేది ఉండాలీ, మద్యపానం, పొగత్రాగడం వంటి విషయాలు తెరమీద చూపిస్తున్నప్పుడూ అని…  సినిమాల్లో విచ్చలవిడిగా ఇలాటివి చూపిస్తూ,పక్కనే కనిపించీ కనిపించని అక్షరాల్లో ఈ హెచ్చరిక చూపించేస్తే పనైపోతుందనుకుంటారు, మన సినీ నిర్మాత దర్శకులు. అసలు చూపించడమే మానేస్తే పనైపోతుందిగా.. అలా ఎప్పుడూ అనుకోరు, రేప్ సీనుండాలి, చుక్కేసుకోవడం ఉండాలి,  గుప్పుమని పొగతాగడం ఉండాలి, లేకపోతే వాళ్ళు తీసే సినిమాలకి డబ్బులు రావొద్దూ? ఈ హెచ్చరికలూ, నిషేధాలూ ఓ వేళాకోళంగా తయారయాయి.

అలాగే ఈరోజుల్లో సినిమాల్లో, విలన్ లాటివాదు, పోలీసుల్ని ఎడాపెడా వాయించేస్తూన్నట్టు చూపించడమొకటి, యూనిఫారం లో ఉండే అధికారిమీద చేయి చేసుకోవడం, చట్టవిరుధ్ధమని, అందరికీ తెలుసు, అయినా చూపిస్తారు. అంటే చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా ఏమైనా చేయొచ్చని,  ప్రజలకి సంకేతాలీయడమా? ఇంక స్కూలు కాలేజీల్లో విద్యార్ధులు వేసే వేషాలకైతే అంతే లేదు.ఇవన్నీ మన భావిభారత పౌరులకి నేర్పించడంకాక ఏమిటీ?

ఓ వైపున స్త్రీలమీద అత్యాచారాల విషయంలో చట్టాలు లెక్కలేనన్నున్నాయి.. అవి సరిపోవన్నట్టు అప్పుడెప్పుడో “ నిర్భయ్” అని ఓ కొత్త చట్టంకూడా తెచ్చారు. ఇప్పటిదాకా ఆ చట్టంపేరుచెప్పి అరెస్టులైతే చేసారు కానీ, ఒక్కడంటే ఒక్కడికి కూడా, చివరకి ఆ నేరం చేసిన దౌర్భాగ్యులకి కూడా శిక్షపడలేదు. సినిమాల్లో, స్త్రీలమీద అత్యాచారాలు ఎలాచేయొచ్చో మాత్రం నిరాటంకంగా చూపిస్తున్నారు. రాత్రనకా పగలనకా ఇలాటివన్నీ చూపిస్తూ, యువత మంచిమార్గంలో వెళ్ళాలీ అంటూ ప్రవచనాలు చెప్తే అయే పనేనా? ఇదిలా ఉండగా, మన చట్టసభల్లో ( పార్లమెంటు, శాసనసభ )  మన శాసన సభ్యులు బహిరంగంగా చేసే అల్లరి చూసికూడా , యువత బాగుపడుతుందనుకోవడం హాస్యాస్పదం.

నీతులు చెప్పాలనీ, చూపించాలనీ అంటే అర్ధం, ఏదో జ్ఞానబోధచేయమనీ,, గీతాసారం బోధించమనీ కాకపోయినా, కనీసం , ప్రమాదాలు నివారించడానికి తీసుకోవాల్సిన కొన్ని కొన్ని జాగ్రత్తలు – ఉదాహరణకి హెల్మెట్లు పెట్టుకోవాలనీ, ఎక్కువవేగంతో వాహనాలు నడపొద్దనీ –లాటివి చూపించొచ్చుగా…

సినిమాల్లో , నెగెటివ్ వి కాకుండా, అప్పుడప్పుడు పాజిటివ్ విషయాలు చూపిస్తే, బహుశా దేశ యువత బాగుపడే అవకాశం ఉందేమో?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sarasadarahasam