“ఓ స్త్రీ రేపు రా...!
“నాలెబా...!...హ్హ హ్హ హ్హ...” గట్టిగా నవ్వాడు విఘ్నేశ్. “నమ్మదగిన విషయమేనా...ఇది...? ఎవరో ఏవో పుకార్లు పుట్టిస్తే, దేశమంతా నమ్మేయడం... గడాగడా వణకిపోవడం... What is this...? How foolishness?? ఎంత చదువుకున్నా, ఇంకా మనలను వదలని మౌఢ్యాన్ని ఇది తెలియజేస్తుంది. ఇలాంటివి నేను నమ్మలేను.” తేలిగ్గా కొట్టిపారేశాడు.
బెంగుళూరు లోని రాజాజి నగర్ గ్రామం, చల్లటి వెన్నెలలో భరద్వాజ ఇంటి డాబాపై కూర్చుని మందుకొడుతూ... భరద్వాజ చెపుతున్న ఆ ఊరి విశేషాలు వింటున్నారు ఫ్రెండ్సంతా.
నిర్లక్ష్యంగా పెదవి విరుస్తున్న విఘ్నేశ్ వంక కాస్సేపు అలాగే చూస్తూండిపోయాడు భరద్వాజ.
కొంచెంసేపు తర్వాత నెమ్మదిగా చెప్పాడు. “ఏది నమ్మాలి. ఏది నమ్మకూడదు... అనేవి మనం తీసుకునే నిర్ణయాలైనా... ఒక్కోక్కప్పుడు అవి మన చేతుల్లో ఉండవు. ప్రగాఢంగా విశ్వసించిన చాలా అంశాలు అవాస్తవాలు అవడానికి ఎంత అవకాశం ఉందో... నమ్మకం కలగని చాలా అంశాలలో వాస్తవాలు ఉండడానికీ అంతే అవకాశం ఉంటుంది.”
“ఒరేయ్... దర్వాజా... నువ్వు చెప్పింది కరెక్టేరా...!” గ్లాస్ లోని ద్రవాన్ని గొంతులోకి ఒంపుకుంటూ ఒప్పుకున్నాడు రవీంద్ర. భరద్వాజను అలా పిలవడం రవీంద్రకు అలవాటు.
“ఊహూ...” విఘ్నేశ్ తల అడ్డంగా ఊపాడు. “నువ్వు పుట్టిపెరిగిన ఊరిలో జరిగిన సంఘటన కాబట్టి... నువ్వు నమ్మడంలో ఆశ్చర్యం లేదు. కానీ, మేమందరమూ నమ్మాలంటే... తిరిగి ఆ సంఘటన పునరావృతం కావలసిందే...! నీకు తెలుసుగా... చూస్తే తప్ప నేనేది నమ్మలేనని...” నవ్వుతూ మళ్ళీ అన్నాడు విగ్నేశ్.
“ఆ...ఆ...అప్పుడు... “ఓ స్త్రీ రేపురా”... అని కాదు, “ఓ స్త్రీ ఇప్పుడే రా” అని డోర్స్ మీద రాయించాలి...” నవ్వేశాడు వారి సంభాషణ వింటూ గ్లాసు ఖాళీ చేసే పనిలో ఉన్న జయకర్. అతని నవ్వుతో మిగిలిన ఫ్రెండ్సందరూ శ్రుతి కలిపారు. అప్పటివరకూ... క్రింద భరద్వాజ కుటుంబంతో, బంధువలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ప్రగతి, జాన్విలు పైన నుండి వినబడుతున్న నవ్వులు, కేరింతలూ వింటూ... “వీళ్ళు మారరు...” అనుకుంటూ... లేచి, పడుకోడానికి వారికోసం ఏర్పాటు చేసిన గదిలోనికి వెళ్ళిపోయారు. చాలాసేపు కబుర్ల తరువాత, డాబామీదే ఏర్పాటు చేసిన మంచాల్లో పడుకుని నిద్రపోయారు. భరద్వాజ, అతని మగ స్నేహితులు.
వీళ్ళంతా వివిధ రాష్ట్రాలనుండి వచ్చి, బెంగుళూరులో బిటెక్ చదువుకుంటున్న స్టూడెంట్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సెలవులలో ఇళ్ళళ్ళకు వెళ్ళకుండా... లోకల్ స్టూడెంట్ అయిన భరద్వాజ వాళ్ళ “గృహప్రవేశం” కోసం బెంగుళూరు లోని రాజాజినగర్ కి వచ్చారు.
******
“ఇది ఇప్పటి కథ కాదు... మా ఊరు, ఈ పక్కనే ఉన్న మాలేశం గ్రామాలు అప్పటికింకా అంతగా డెవలప్ అవలేదు. ఈ మూఢవిశ్వాసాలు ఇప్పటికన్నా... అప్పుడు బాగా ఎక్కువ. మా గ్రామాలలోనే ఇది మొదలైందని... మా అత్తయ్య, మామయ్యలు అంటూ ఉండేవారు.” గృహప్రవేశం కార్యక్రమం పూర్తయి భోజనాలు చేసిన బంధువులంతా వెళ్ళిపోయాక, ఖాళీగా కూర్చున్న సమయంలో భరద్వాజ స్నేహితులంతా అడగడంతో... చెప్పడం మొదలెట్టింది అతని తల్లి జయలక్ష్మి. ప్రగతి, జాన్విలతో సహా అందరూ ఆసక్తిగా వినసాగారు.
అప్పుడు, మేమెవరమూ పుట్టనేలేదు. ఈ ఊళ్ళు పల్లెటూర్లు కావడాన, అప్పట్లో విధ్యుత్ సౌకర్యం కూడా లేదు. గ్రామంలో ఏవో... ఒకటో రెండో తప్ప అన్నీ గడ్డి గుడిసెలే...! సాయంత్రం పొలం పనులనుండి ఇంటికి వచ్చి, వంటావార్పు చేసుకుని తిని, ఇళ్ళల్లో దీపాలు ఆర్పుకుని పడుకునే వారు. అలా గడచిపోతున్న వారి జీవితాల్లో ఓ రోజు భయంకరమైన కాళరాత్రిగా మారింది.
“టక్...టక్...” కనకదాస ఇంటి తలుపు శబ్ధమయ్యింది. “అయ్యా... తలుపు తీయ్...” బయటనుండి భార్య పిలుస్తోంది. నిద్రమత్తులో ఉన్న కనకదాస లేచి “ఇంత చలిలో బయటకెందుకు వెళ్లావే...” అంటూ తలుపు తీసాడు. అంతే...! ఒక భయంకరమైన స్త్రీ ఒక్కసారిగా అతడిపై దూకి అతడిని చంపేసింది. ఇది మొదలు... అలా ఆ స్త్రీ ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంటి తలుపు కొట్టడం... ఆ ఇంటి సభ్యులలాగే “తలుపు తీయ్యండంటూ” పిలవడం... తీసిన వారిని హతమార్చడం చేస్తోంది.
ఊరిలో అందరికీ పరిస్థితి అర్ధమయ్యింది. చీకటి పడకుండానే... పనులన్నీ ముగించుకుని, అందరూ ఇళ్ళుచేరుకునేవారు. గబగబా తినేసి, దీపాలు ఆర్పి, భయం భయంగా నిద్రపోయేవారు. ఎవ్వరు పిలచినా పలకకుండా, వెళ్ళి తలుపులు తీయకుండా కుటుంబ సభ్యులందరిపట్ల జాగ్రత్తలు తీసుకునేవారు.
ఒకరోజు... ఒక ఇంటి తలుపు శబ్ధం అవుతుంటే, ఆ ఇంటి గృహిణి మేలుకుంది. బయటనుండి “ఏమే... తలుపు తీయి...” అంటూ ఆమె భర్త పిలవడం వినబడింది. ఒక్కసారి కళ్ళు నులుముకుని పక్కకు చూసింది. ఆమె భర్త పక్కనే పడుకుని నిద్రపోతున్నాడు. కానీ, బయట అతని పిలుపు వినబడుతుంది. ఆమె గుండె జల్లుమంది. ఆ వచ్చింది దెయ్యమే అని అర్ధమైంది. భయం భయంగా “నాలెబా...!” అంది. దాంతో ఆ శబ్ధం ఆగిపోయింది. ఆ మరుసటిరోజూ అలాగే జరిగింది. ఆ ఇల్లాలు మళ్ళీ...“నాలెబా...!” అనడంతో బయటనుండి ఆ పిలుపులు ఆగిపోయాయి. తెల్లవారి ఆ విషయం అందరికీ పాకిపోయింది. ఆ రోజునుండి అందరి తలుపుల మీద “నాలెబా...!” అనే రాతలు ప్రత్యక్షమయ్యాయి. అప్పటినుండి ఊరిలో ఆ దెయ్యం వచ్చి తలుపు తట్టడాలు, పేరుపెట్టి బయటకు రమ్మని పిలవడాలు పూర్తిగా ఆగిపోయాయి.
“నాలెబా...! అంటే... తెలుగులో ఓ స్త్రీ రేపు రా... అని అర్ధం” చెప్పింది జయలక్ష్మి.
“ఇది అప్పట్లో యవద్భారతదేశాన్నే... అట్టుడికిపోయేలా చేసింది. 1990 లో “స్త్రీ” అనే హింది సినిమాకూడా రిలీజై... భోలెడు కలెక్షన్లు సంపాదించింది. అంతేకాదు. అన్ని ఇళ్ళముందు తలుపులకు “ఓ స్త్రీ రేపు రా...” అని రాయబడ్డాయి. అంత భయపెట్టిందీ సంఘటన. ఇప్పుడు అలాంటివి లేవనుకోండి...” పూర్తి చేసాడు భరద్వాజ తండ్రి.
ఇదంతా విని అందరూ ఏమీ మాట్లాడలేక కాస్సేపు మౌనంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్ధాన్ని చీలుస్తూ...
“హ్హ..హ్హ....హ్హహ్హ....హ్హాహ్హ....బిగ్ ఫన్ స్టోరీ....” బిగ్గరగా, వెటకారంగా నవ్వసాగాడు విఘ్నేశ్...
ఫ్రెండ్సందరూ అతనివంక చిరాగ్గా చూసారు.
“ఇదంతా అందరూ అంత తెలివితక్కువగా ఎలా నమ్మేస్తారంకుల్...? పల్లెటూరి జనాలే అంటే... పట్నంలో చదువుకున్నవాళ్ళు కూడా ఈ కథను నమ్మేసారు. మనం ఏ కాలంలో ఉన్నాము...? హహ్హ్హహ్హా... వెరీ... హిల్లారియస్...” నవ్వునాపుకోలేక తెరలు తెరలుగా నవ్వుతూ అన్నాడు విఘ్నేశ్.
జయలక్ష్మి అతనికేసి చురుగ్గా చూసింది. “భయానికి పల్లెటూరు, పట్నం అని తేడాలుండవయ్యా...! మనిషి మనోధైర్యాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి ఈ కథ... కట్టుకథే అయి ఉండొచ్చు. కానీ, అప్పుడలా సృష్టించబడటానికి, ప్రజలంతా భయపడడానికి ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా...! ఆ కారణాలను బట్టి, అప్పటి ప్రజల అమాయకత్వాన్ని బట్టి, ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఇది ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. దాన్ని కాదనడానికి గానీ, తిరిగి మార్చడానికి గాని మనకెంతవరకు సాధ్యమౌతుంది...? తెలిసిన కథలు ఏదో ఇలా చెప్పుకోడానికి తప్ప...!” నవ్వుతూనే చెప్పింది.
“అంటే... ఆ కథను ఇలా ప్రచారం చేయడంలో దెయ్యాలున్నాయని నమ్ముతున్నట్లేగా ఆంటీ...? ఆ కట్టుకథ నిజమని ఒప్పుకుంటున్నట్లే కదా... ప్రజలందరినీ మభ్యపెడుతున్నట్లే కదా...” రెట్టించాడు విఘ్నేశ్.
వెంటనే... భరద్వాజ తండ్రి కల్పించుకున్నాడు.
“నమ్మకమనేది... ఎవరి మనస్థితిని బట్టి వారికి ఉంటుంది. అయినా... మన కంటికి కనబడని ఏదో శక్తి మనలను నడిపిస్తుందని ఈనాటి సైన్సూ అంగీకరిస్తుంది. దాన్నే సాధారణ మానవుడు దేవుడని పిలుచుకుంటున్నాడు. మరి... దేవుడున్నాడని అంతా నమ్ముతున్నపుడూ... దెయ్యమూ ఉందని నమ్మడంలో తప్పేముంది...? ఇది ప్రచారం కాదు. మీ ఊరిలో ఇలా జరిగిందట కదా... అని మీరు అడిగారు కాబట్టి చెప్పామంతే...!” చెప్పాడు. అతని గొంతులో సౌమ్యత లోపించడం అక్కడున్న అందరికీ అర్ధమైంది.
ఇదేమీ గమనించని విఘ్నేశ్ ఇంకేదో మాట్లాడబోతుండగా... జాన్వి అడ్డుకుంటూ చెప్పింది. “ఓకే... ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. భరద్వాజా... ఊరి చివర టెంపుల్ కి తీసుకెళతానన్నావుగా... పద వెళదాం...!” పైకి లేచింది.
అందరూ లేచి... బయటకు నడిచారు.
*******
“నీకేమైనా బుర్ర పనిచేస్తోందిరా...? పల్లెలు అంటే రక రకాల విశ్వాసాలు ఉంటాయి. అవన్నీ కాదనడానికి నీకేం అధికారం ఉంది. వాళ్ల నమ్మకాలను తప్పు పట్టడానికి నువ్వేమైనా... పైనుండి దిగి వచ్చావా...? నువ్వలా పెద్దవాళ్లతో ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు విఘ్నేశ్...” బయటకు రాగానే అన్నాడు జయకర్.
విఘ్నేశ్ ముఖం వాడిపోయింది. సైలెంట్ గా నడవసాగాడు.
“అవునురా... విఘ్నేశ్ కరెక్ట్ కాదు.” జయకర్ ని సపోర్టు చేసాడు రవీంద్ర.
“సారీ భరద్వాజా... వాడి తరఫున మేము సారీ చెపుతున్నాము.” నొచ్చుకుంటూ అంది ప్రగతి.
“హే... నో...నో... నేనేం ఫీలవడం లేదు. వాడి అభిప్రాయం వాడు చెప్పాడు. అమ్మా, నాన్న కూడా ఏమీ అనుకోరు. వాళ్ళు కూడా ఈ కథను బలంగా ఏమీ నమ్మడం లేదు. గతంలో జరిగిన కథ కాబట్టి చెప్పారంతే...!” లైట్ గా తీసుకుంటూ చెప్పాడు భరద్వాజ.
అప్పుడు చెప్పాడు జయకర్. “ఈ వాస్తవ సంఘటన ఎక్కడ జరిగిందో ఎవరికీ ఆధారాలు లేవు. కానీ, గూగుల్ సెర్చ్ చేస్తే... ఈ సంఘటనకు సంబంధించి, చాలా కథలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నాయి. 1940 ప్రాంతంలో ఇది సృష్టించబడినట్లు చెపుతున్నాయి. ఆ సమయంలో కర్ణాటక, తెలంగాణా సరిహద్దు ప్రాంతంలోని ఓ పల్లెలో సరోజిని అనే ఒక యువతికి పురిటినొప్పులు రాసాగాయి. గ్రామంలోని ఆడవాళ్ళు ఓ మంత్రసానిని తీసుకొచ్చి, ఆమెకు పురుడు పోయించారు. ఆమెకు పుట్టిన బిడ్డ తెల్లని చర్మం, బంగారు వర్ణం వెంట్రుకలతో ఉండడంతో... ఆ బిడ్డ ఆంగ్లేయుడికి, సరోజినికి పుట్టిన అక్రమ సంతానం అని అనుమానించి, సరోజినిని పాపతో సహా, ఊరినుండి బయటకు తరిమేసారు. ఆమె ఉన్న ఇంటిని తగులబెట్టారు.
సరోజినికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఊరి అవతల ఓ చెట్టుక్రింద పసిబిడ్డతో కూర్చుని, ఏడ్చి... ఏడ్చి అలాగే నిద్రలోకి జారుకున్న సరోజిని తెల్లవారి కళ్ళు తెరిచేసరికి ఒడిలోని బిడ్డ మాయమయ్యే సరికి, ఊరంతా బిడ్డను వెతుకుతూ...తిరిగీ తిరిగీ కొన్నాళ్ళకు చచ్చిపోయింది. తమ వల్లే ఆమె ఇలా మరణించింది అని బాధపడిన ఆ ఊరి ప్రజలంతా సరోజినికి అంత్యక్రియలు జరిపారు. అప్పటినుండి... అసలు కథ ప్రారంభమయ్యింది. ఆ రాత్రి... ప్రతి ఇంటి తలుపు కొట్టి, నా బిడ్డ... నా బిడ్డ.... అంటూ లోపలివాళ్ళను బయటకి పిలవడం ప్రారంభించింది ఆమె ఆత్మ. దాంతో గ్రామస్థులంతా ఆమెకు భయపడి, ఇంటి తలుపులపై “ఓ స్త్రీ రేపు రా...” అని రాసుకున్నారట. ఇదీ సంగతి. ఇలాంటివే మరో నాలుగైదు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రచారమై... రకరకాల పుకార్లు గా దేశమంతా షికార్లు కొట్టాయి.
ఏది ఏమైనా... దేశం యావత్తూ ఈ కథకు భయపడటం మాత్రం నిజం. అది దయ్యమే అని భావించిన చాలా ప్రాంతాలలో, “ఓ స్త్రీ రేపు రా...” అని తలుపులపై రాసుకోవడం సత్యం.”
అందరూ గుడి దగ్గరకు చేరుకున్నారు. పన్నెండు వందల సంవత్సరాలనాటి పురాతన దేవాలయమది. చుట్టూ తిరిగి చూసి, ఫోటోలు తీసుకుని వచ్చి మెట్లమీద కూర్చున్నారు.
విఘ్నేశ్... జయకర్ చెప్పినదానిని తిరిగీ కంటిన్యూ చేస్తూ...”నేనేం తప్పు చెప్పాను ? ఇదంతా ఒక మూఢ విశ్వాసం ఇవన్నీ కట్టుకథలు అనేగా చెప్పాను...! ఒక అంధ: విశ్వాసానికి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది తప్పు అనేగా చెప్పడానికి ప్రయత్నించాను.” పౌరుషపడ్డాడు.
“నో... నో... నీ ఆలోచన కరెక్టే... కానీ, దాన్ని బయటకి ప్రకటించిన తీరు సరిగ్గా లేదు. చెప్పవలసిన సమయమూ ఇది కాదు. వాళ్ళందరూ ఎప్పటినుండో వాస్తవమని నమ్మిన ఈ కథను, ’మీరంతా అప్పుడు మూర్ఖులై నమ్మారు’ అంటూ... ఇప్పుడొచ్చి నువ్వు వాళ్లతో చెప్పడం కరెక్ట్ కాదు. ఇది చెప్పడం వలన ప్రయోజనమూ లేదు. గతంలో ఏం జరిగిందో... మనకు తెలియదు. వాస్తవమో, అవాస్తవమో పూర్తిగా నిర్ధారించలేని నువ్వు, ప్రస్తుతం దానిని గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించడం అనవసరం కదా...!” జయకర్ అన్నాడు.
“అంటే... వాళ్ళు చెప్పినదంతా విని, అవునవునూ అంటూ గొర్రెలా తలలూపాలా...? ఇది సరికాదు అని ఎందుకు చెప్పకూడదు...? వాళ్ళలో పేరుకుపోయిన ఆ మూఢనమ్మకాన్ని ఎందుకు తొలగించకూడదు..??” దాదాపూ అరచినట్లుగా చెప్పాడు విఘ్నేశ్.
“అది మూఢనమ్మకమని నువ్వెలా చెప్పగలవు... అది పచ్చి వాస్తవం...!” వెనుకనుండి కంచులా మ్రోగింది ఎవరిదో కంఠం.
అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసారు. ఎవరో సాధువు... చాలా ఏళ్ళుగా జడలు కట్టిన జుత్తుతో, బూడిద రాసుకున్న శరీరంతో... దుమ్ము, ధూళితో ఉన్న దుస్తులతో, భీతిగొలిపేలా ఉన్నాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. “నీకు తెలుసా...? ఈ గ్రామంలో కొన్ని ఇళ్ళముందు తలుపులు ఇప్పటికీ... చప్పుడవుతూ ఉంటాయి. ఎవరైతే తలుపు తీస్తారో... వాళ్ళు తప్పక శవమై పోతారు.” చెప్పాడతను.
అందరి గుండెలూ జల్లుమన్నాయి. అతని మాటలు నమ్మలేనట్లుగా చూసాడు భరద్వాజ. తను పుట్టిన దగ్గరనుండీ తనకీ విషయం తెలియదు. తన తల్లిదండ్రులతో సహా... ఎవరూ తనతో అనలేదు కూడా...!
“అవునా...?” అనుమానంగా అడిగాడు భరద్వాజ.
“రా... చూపిస్తాను...” భీకరంగా గర్జించి, విసురుగా ముందుకు కదిలాడా సాధువు. అతడిని అనుసరించారంతా... అక్కడికి పదడుగుల దూరంలో కనబడ్డాయా ఇళ్ళు. నోరు తెరచి వాటినే చూస్తుండిపోయాడు భరద్వాజ. ఇదివరకు ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాడు తను. అప్పుడు ఇక్కడ ఈ ఇళ్ళు లేవు. ఇప్పుడు ఎలా వచ్చాయి...? అక్కడొకటి... ఇక్కడొకటి అన్నట్లుగా ఓ ఏడెనిమిది ఇళ్ళు ఉంటాయి. పాడుబడి, శిధిలమై ఉన్నా... ఆ ఇళ్ళల్లో మిణుకు మిణుకుమంటూ గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి.
ఫ్రెండ్సంతా... వాటిని అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నారు. కానీ, భరద్వాజ... మనసు అంగీకరించలేకపోతోంది. తను పుట్టి పెరిగిన ఈ ప్రదేశంలో తనకు తెలియకుండా రహస్య ఆవాసాలా...? ఇది నిజమా, కలా...? తండ్రికి ఫోన్ చేద్దామని చేతిలోని మొబైల్ వంక చూసాడు. మొబైల్ సిగ్నల్ లేదు.
అతని ఆలోచనలను పసిగట్టినట్లు... ఆ సాధువు వెంటనే పలికాడు. “ఇదే ఒకప్పటి పురాతన గ్రామం. నాలెబా సంఘటనతో వీటిని ఖాళీ చేసి, ముందుకు వెళ్ళి అందరూ కొత్త ఇళ్ళు నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. ఈ రాత్రి ఈ పురాతన గ్రామంలోని ఏ ఇంటిలోనైనా విశ్రమించండి. ఆ స్త్రీ... మీరున్న ఇంటి తలుపు తట్టకపోతే, అప్పుడు చెప్పండి. మూఢ విశ్వాసమని...!”
“ఖాళీ చేయబడిన ఇళ్ళలో దీపాలు ఎవరు వెలిగించారు...? భరద్వాజకు ఒక్కడికే ఈ అనుమానం వచ్చింది. అది వ్యక్తం చేసేలోపే... “నేనుంటాను.” చెప్పాడు విఘ్నేశ్. “ఇదంతా నిజం కాదని నేను నిరూపిస్తాను. కట్టుకథలు నమ్మొద్దని ఈ ప్రజలకు నేను చాటి చెపుతాను.” ఆవేశంగా అన్నాడు.
సాధువు ముఖం వికసించింది. అది భరద్వాజ దృష్టిని దాటిపోలేదు. ఎక్కడో మనసు కీడును శంకిస్తుంటే ఫ్రెండ్స్ ని ఉద్దేశించి అన్నాడు “నో.... అక్కరలేదు. ఇప్పుడంత రిస్క్ తీసుకోవడం అనవసరం. పదండి చీకటి పడిపోయింది... వెళ్ళిపోదాం.” వెనక్కి తిరిగాడు.
“లేదు... మీరంతా వెళ్ళండి... నేనిక్కడే ఉంటాను. ఈ రాత్రి వీటిల్లో ఏదో ఒక ఇంటిలో నిద్రించి, రేపు ఉదయం తిరిగి వస్తాను” పట్టుదలగా చెప్పాడు విఘ్నేశ్.
మిగిలిన వాళ్ళు కూడా అన్నారు. “వద్దు విఘ్నేశ్... ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే, ఆంటీ అంకుల్ కంగారు పడతారు. పదా... వెళ్ళిపోదాం.” విఘ్నేశ్ ససేమిరా ఒప్పుకోలేదు. అతని నిర్ణయం మార్చడం కష్టమని అందరికీ అర్ధమైంది. దాంతో... ఎవరికీ ఏం చేయాలో పాలుపోలేదు.
చివరికి “ఓకే... నీతో పాటు మేమూ ఉంటాము. పద...” అంటూ అందరూ కలిసి, ఒక ఇంటి తలుపులు తెరిచారు. అప్పటివరకూ అక్కడున్న సాధువు... వికృతమైన ఓ నిశ్శబ్ధపు చిరునవ్వు నవ్వి, అక్కడినుండి గుడి వరకూ నడుచుకుంటూ పోయి, అదృశ్యమైపోయాడు.
తలుపు తెరచి చూసిన స్నేహితులందరూ ఆశ్చర్యంతో ఒక్కసారే... నోళ్ళు తెరచి చూస్తూండిపోయారు. బయటకు శిధిలావస్థలో కనిపిస్తున్నా... ఇల్లంతా ఎవరో ఇష్టంగా తీర్చి దిద్దినట్లు చక్కగా సర్ధి ఉంది. ఎవరు ఇదంతా నీట్ గా ఉంచారు. విస్తుపోతూనే... ఇంట్లోకి అడుగుపెట్టారు. బాగా పురాతనమైన గ్రామీణ అలంకరణ. చూడటానికి అందంగా ఉన్నా... గుండెల్లో ఏదో... గుబులు, భయం. అందరూ... ఇంటి మధ్య ఉన్న మొగరం(గుంజ)కు ఆనుకుని నేలపై కూర్చుండిపోయారు.
సమయం అర్ధరాత్రి వైపు పరుగులు తీస్తోంది. గంటల తరబడి అలా కూర్చుని ఉన్నారే గానీ, ఎవరూ ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. ఒకరివైపు ఒకరు చూసుకోవడం లేదు. ఆకలి మరచిపోయారు. నిద్రను రానీయకుండా... కళ్ళు విప్పార్చుకుని కూర్చున్నారు. ఒక్కొక్కరి ముఖాల్లో ప్రేతకళ తాండవిస్తోంది. అందరికీ... తామేదో భయంకరమైన ఆపదలో చిక్కుకు పోబోతున్నామేమో అనిపించసాగింది. విఘ్నేశ్ ఒక్కడే ధైర్యంగా ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఆడపిల్లల పరిస్థితి సరే సరి...! ఒకరి చేతులను ఒకరు గట్టిగా పట్టుకుని దగ్గరగా ఆనుకుని ఉన్నారు. అలా ఎంతసేపు కూర్చుండిపోయారో... ఒక్కొక్కరూ క్రమంగా నిద్రలోకి జారిపోయారు.
సరిగ్గా... 12 గంటలు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఏదో గాలి కలకలం... ఎవరో గజ్జెలతో నడుస్తున్నట్లు చప్పుడు. విఘ్నేశ్ కి మెలకువ వచ్చింది. పక్కన చూసాడు. స్నేహితులంతా ఒకరినొకరు పట్టుకుని నిద్రపోతున్నారు.
అప్పుడు వినిపించింది... “టక్...టక్... టక్...టక్...” ఒక్క క్షణం జాగ్రత్తగా విన్నాడు. “భరద్వాజా... ఒరేయ్... ఇంటికి రాకుండా... ఈ ఇంట్లో...ఏం చేస్తున్నారురా...?” భరద్వాజ తండ్రి బయటనుండి పిలుస్తున్నాడు. విఘ్నేశ్ కి అర్ధమైంది. ఒకటి, తాము ఇక్కడున్నామని తెలిసి, అతడి తండ్రి వచ్చి పిలవడమైనా అయి ఉంటుంది. లేదా... ఇది ఆ సాధువు పనే అయినా అయి ఉంటుంది. తను చెప్పిన మాట నిజమని తనను నమ్మించడం కోసం... ఈ అర్ధరాత్రి... వచ్చి, ఆ కథలోలా తలుపు తడుతున్నాడు. దిగ్గున లేచి నిల్చున్నాడు విఘ్నేశ్. వీళ్ళెవరినీ నిద్ర లేపినా... తనను వెళ్ళి తలుపు తీయనివ్వరు. కాబట్టి, తను ఒక్కడే వెళ్ళాలని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ... తలుపు దగ్గరకు వెళ్ళాడు.
భరద్వాజ తండ్రి మరోసారి తలుపు తడుతూ... పిలుస్తున్నాడు. ఠక్కున తలుపు తెరిచాడు విఘ్నేశ్...
తన ఎదుట కనబడిన దృశ్యం... ఒక్కసారిగా వెన్నులోంచి వణుకును పుట్టించింది. “భగవాన్.......అతని పిలుపు అతని గొంతులోనే ఉంది... కళ్ళు శాశ్వతంగా నిలబడిపోయాయి.
*******
ముఖం మీద ఎండ పడుతుండటంతో... ముందుగా ప్రగతికి మెలకువ వచ్చింది. లేచి చుట్టూ చూసింది. తామంతా అడవిలో ఓ చెట్టు మొదలులో పడి నిద్రపోతున్నారు. అసలు మేమంతా ఇక్కడికి ఎలా వచ్చాం...? కొద్ది క్షణాలకు గుర్తొచ్చింది. నిన్న చీకటివేళ వరకూ గుడిలో ఉండడం... సాధువు కనిపించడం ... గుడిసెలో తామందరూ నిద్రించడం... విఘ్నేశ్... విఘ్నేశ్.... అవునూ విఘ్నేశ్ ఎక్కడా...? కంగారుగా చుట్టూ చూసింది. అతడు కనిపించలేదు.
“భరద్వాజా... భరద్వాజా...” భయంగా అరచింది. ఆమె కేకలకు భరద్వాజ, జయకర్, జాన్వి ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. తాము ఉన్న ప్రదేశాన్ని చూసి, నివ్వేరపోయారు. రాత్రి కనిపించిన గుడిసెల స్థానంలో అడవి చెట్లు మాత్రమే ఉన్నాయి. అసలేం జరిగిందో... చాలాసేపటివరకూ అర్ధం కాలేదు వాళ్లకి.
“విఘ్నేశ్ కనబడటం లేదు,” అరచి చెప్పింది ప్రగతి. అందరూ ఒక్క ఉదుటున... పైకి లేచి నిలబడ్డారు.
“రవీంద్ర కూడా లేడు...!” జాన్వి చెప్పింది కంగారుగా...
గాబరా పడుతూ వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ... ముందుకు కదిలారు. అక్కడికి కొంత దూరంలో... ఓ చెట్టు క్రింద కనిపించాడు రవీంద్ర. ఆకాశంలోకి పిచ్చి చూపులు చూస్తూ... మధ్య మధ్యలో వెకిలిగా తనలో తానే నవ్వుతూ... అతడిని చూసి, ఆశ్చర్యపోయారంతా... ఒక్కసారిగా అతడి చుట్టూ చేరి, “రవీంద్ర... రవీంద్రా ఏమైంది... విఘ్నేశ్ ఎక్కడున్నాడు...?” అడగసాగారు. వాళ్లని గుర్తుపట్టే పరిస్థితిలో లేడతను. ఏవేవో... మాట్లాడుకుంటూ.. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి నవ్వుతూ... పిచ్చి పట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడు
అతడిని చూసి ఆడపిల్లలిద్దరూ గట్టిగా ఏడవడం మొదలెట్టారు.
అతనికి కొద్ది దూరంలో... విఘ్నేశ్ నేలమీద పడిఉన్నాడు. అంతా లేచి అటువైపు పరుగెత్తారు. అతడిని దగ్గరనుండి చూసిన స్నేహితులందరికీ... ఒక్కసారిగా గుండెలు ఆగిపోయాయి.
విఘ్నేశ్... ప్రాణాలతో లేడు.
రాత్రంతా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వాళ్ళను వెతుకుతూ ఆ పక్కకు వచ్చిన భరద్వాజ తండ్రి, ఊరిలోని మరికొందరు అక్కడి దృశ్యం చూసి, బాధపడ్డారు.
క్రితం రాత్రి....
విఘ్నేశ్ తో పాటూ... రవీంద్రకు కూడా మెలకువ వచ్చింది. కానీ, భయం వలన... అతడు ఉన్న చోటునుండీ కదల్లేదు. విఘ్నేశ్ లేచి, తలుపు తీసిన కొద్ది క్షణాలలోనే నిలువునా కుప్పకూలిపోవడం చూసి, లేచి అతని దగ్గరకు వెళ్ళిన రవీంద్ర... మరణించి ఉన్న విఘ్నేశ్ ని చూసి భయంతో, షాక్ తో నిలువునా కొయ్యబారిపోయాడు.
|