Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

యాత్ర చిత్రసమీక్ష

yatra movie review

చిత్రం: యాత్ర 
తారాగణం: మమ్ముట్టి, ఆశ్రిత, జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్‌, అనసూయ, సచిన్‌ ఖేడేకర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు. 
సంగీతం: కె 
సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌ 
నిర్మాతలు: శశి దేవిరెడ్డి, విజయ్‌ చిల్లా 
దర్శకత్వం: వెంకీ అట్లూరి 
నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 9 ఫిబ్రవరి 2019

కుప్లంగా చెప్పాలంటే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రజా ప్రస్థానమంటూ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు సంబంధించిన విశేషాల సమాహారమే ఈ చిత్రం. పాదయాత్ర మొదలు పెట్టడానికి కారణమేంటి? ఈ సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలుసుకున్న విషయాలు, ఎదుర్కొన్న సంఘటనలు, ప్రజలు ఆయన్ని ఆదరించిన వైనం, ప్రజల్ని ఆయన పరామర్శించిన వైనం, ఈ పాదయాత్ర ద్వారా ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ తదితర పథకాలకు ఎలా ఆయన రూపకల్పన చేయగలిగారు? కాంగ్రెస్‌ అనే మహాసముద్రంలో ఓ నీటిబొట్టులాంటి ఓ నాయకుడు, పార్టీని ఎలా మెప్పించి, పార్టీపై తనదైన ముద్ర ఎలా వేయగలిగారు? వంటి విషయాల సమాహారంగా ఈ సినిమా కథ రూపుదిద్దుకుంది.

మొత్తంగా చెప్పాలంటే..

మమ్ముట్టి గొప్ప నటుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఎక్కడా వైఎస్‌ని అనుకరించలేదాయన. అయినాగానీ తెరపై మమ్ముట్టిని చూస్తోంటే, రాజశేఖర్‌రెడ్డిని చూసినట్లే అనుభూతికి లోనవుతాం. వైఎస్‌ ఆత్మ, మమ్ముట్టిలో ప్రవేశించినట్లుంటుంది. పాత్రని అంతలా అర్థం చేసుకోవడం వల్లేనేమో మమ్ముట్టి ఇంత గొప్ప నటుడిగా కీర్తి ప్రతిష్టలందుకుంటున్నారు.

వైఎస్‌ 'ఆత్మ' కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్‌, వైఎస్‌ సతీమణి విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అద్భుతంగా నటించారు. వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కన్పించారు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 
కథ గురించి చెప్పాలంటే ఇది కథ కాదు, జరిగిన విషయం. తీసుకున్న పాయింట్‌ చుట్టూ కథ బాగానే అల్లుకున్నారు. స్క్రీన్‌ ప్లే విషయం అక్కడక్కడా కొంత గందరగోళం కన్పిస్తుంది. మాటలు బాగున్నాయి. మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి.

ఇది రాజకీయ నేపథ్యమున్న సినిమా కాదని దర్శకుడు పదే పదే చెప్పాడుగానీ, రాజకీయ నాయకుడి జీవితంలోని ముఖ్యఘట్టాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు అందులో రాజకీయం ఎందుకు వుండదు? అయితే కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీలా అనిపించడం ఇబ్బందికరంగా అన్పిస్తుంది. మహానాయకుడి జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తెరపై కన్పిస్తోంటే, ఆయన అభిమానులకు గూస్‌బంప్స్‌ రావడం సహజమే. అలాంటి సన్నివేశాలు సినిమాలో కొన్ని వున్నాయి. అవన్నీ పక్కన పెడితే, తెరపై మమ్ముట్టిని చూస్తున్నంతసేపూ, రాజశేఖర్‌రెడ్డి అలా కళ్ళముందు మెదలాడుతారు. ఓవరాల్‌గా ఇది రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్ని అలరిస్తుంది. సినిమాగా చెప్పాలంటే, అంతగా ఆకట్టుకోవడం కష్టమే.

అంకెల్లో చెప్పాలంటే..

2.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే

వైఎస్సార్‌ అభిమానులకోసం మాత్రమే.

మరిన్ని సినిమా కబుర్లు
churaka