Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope November 08 - November 14

ఈ సంచికలో >> శీర్షికలు >>

రోల్స్‌ రాయిస్‌కి రాజుగారి దెబ్బ - -

Lesson by Indian king to rolls royce

రోల్స్ రాయిస్ కారు గురించి వినని వారు బహుశా వుండరేమో. ప్రపంచంలోనే అతి గొప్ప కార్లలో అదొకటి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే సంపన్నులకు రోల్స్ రాయిస్ కారులో తిరగడం ఓ హోదా. ‘డబ్బు వుంటే సరిపోదు, ఆ కారుని కొనేందుకు స్టేటస్ కావాలి’ అంటారు రోల్స్ రాయిస్ గొప్పతనం గురించి తెలిసినవారు.

అందుకే రోల్స్ రాయిస్ సంస్థకీ కొంచెం బలుపు కూడా ఎక్కువ. భారతదేశానికి చెందిన జైసింగ్ అనే ఓ రాజుగారు లండన్ వెళ్ళారు ఓ పని మీద. బస చేసిన హోటల్ నుంచి సరదాగా వ్యాహ్యాళికి వెళుతూ, ఆ దారిలో వున్న రోల్స్ రాయిస్ షోరూంని సందర్శించారు జై సింగ్ . సాదా సీదా వస్త్ర ధారణలో వున్న రాజుగార్ని గుర్తుపట్టని షోరూం సిబ్బంది, ఆయన్ను అవమానపర్చారు, బయటకు గెంటేశారు కూడా. అంతే రాజుగారికి కోపమొచ్చింది. అక్కడాయన ఏమీ మాట్లాడలేదు.

అవమాన భారంతోనే తిరిగి హోటల్ కి వెళ్ళిపోయిన రాజుగారు, తన సిబ్బందితో రోల్స్ రాయిస్ సంస్థకు కబురు పెట్టారు, తనకు మంచి కారు ఒకటి కావాలని కోరుతూ. కబురు చేరగానే సంస్థ ప్రతినిథులు ఆయన్ను షోరూంకి ఆహ్వానించారు. ఈసారి మందీ మార్బలంతో షోరూం సందర్శనానికి ఆయన వెళితే, ఆక్కడాయనకు షోరూం సిబ్బంది రెడ్ కార్పెట్ పరిచి, స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేశారు. షోరూంలో వున్న మొత్తం కార్లన్నిటినీ డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన రాజుగారు, వాటిని స్వదేశానికి తెప్పించుకున్నారు.

ఇక్కడే రాజుగారు రోల్స్ రాయిస్ సంస్థపై ప్రతీకారం తీర్చుకున్నారు. అదెలాగంటే, తన రాజ్యంలో చెత్త పారవేయడానికి ఉపయోగించే తుక్కు వాహనాల స్థానే రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేశారు జై సింగ్ . రోల్స్ రాయిస్ కార్లు చెత్త ఏరుకోవడానికి ఉపయోగించబడ్తున్నాయన్న విషయం ప్రపంచమంతా పాకేసరికి, ఆ సంస్థకు చెందిన కార్లను ఉపయోగించడం స్టేటస్ కాదు, అవమానమని భావించారు ప్రపంచంలోని ఆ కార్ల వినియోగదారులు. ఫలితంగా అమ్మకాలూ పడిపోయాయి.

పరిస్థితి చెయ్యిదాటుతోందని గ్రహించిన సంస్థ నిర్వాహకులు, జై సింగ్ తో రాజీకొచ్చారు. ఆరు కార్లను ఉచితంగా జైసింగ్ కి సమర్పించుకుని, క్షమాపణలు చెప్పారు రోల్స్ రాయిస్ ప్రతినిథులు తమ యాజమాన్యం తరఫున. అక్కడితో జై సింగ్ శాంతించారు. రోల్స్ రాయిస్ కారుకి ఇండియన్ రాజుగారు కొట్టిన దెబ్బ ఎలా వుందో అర్థమయ్యింది కదా.

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu