'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో రొమాంటిక్ బోయ్‌లా ఆకట్టుకున్న హీరో కార్తికేయ త్వరలో 'హిప్పీ' సినిమాతో రాబోతున్నాడు. రాకింగ్‌గా 'హిప్పీ' అనే టైటిల్ పెట్టారు కదా. టీజర్ కూడా అలాగే కట్ చేశారు. టీజర్ నిండా ఇప్పుడుండాల్సిన కంటెన్ట్ అంతా ఉంది. అదేనండీ యూత్ కంటెన్ట్ అని పేరు పెట్టారు కదా. ముద్దులూ, మరిపాలూ. అయితే షరతులు వర్తిస్తాయండోయ్ వీటికి హద్దులసలే ఉండవ్.. అదీ మరి. ఇక ఈ టీజర్‌ని కూడా అదే కంటెన్ట్‌తో కట్ చేశారు. హీరోని ప్లేబోయ్‌లాగే చూపించారు. వెన్నెల కిషోర్, కార్తికేయ మధ్య సంభాషణలతో టీజర్ స్టార్ట్ చేసి, మధ్యలో కావల్సిన కంటెన్ట్‌ని బలవంతంగా ఇరికించారు.
'ముందో అమ్మాయిని పెట్టుకుని ఇంకోదాన్ని పట్టుకున్నారు.. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు.. అంటారన్న మాట..' అంటూ వెన్నెల కిషోర్‌తో హీరో క్యారెక్టర్ స్ట్రక్చర్‌ని పరిచయం చేసేశారు. ఆ తర్వాత ఇంకేముంది.. అమ్మాయిల గ్లామర్, లిప్‌లాక్స్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా యాడ్ చేశారండోయ్. 'ఆర్‌ఎక్స్ 100'లో ఒక్క హీరోయిన్‌తోనే బీభత్సమైన ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన కార్తికేయ ఈ సినిమాలో ఒక్కరు కాదు, ఇద్దరు ముద్దుగుమ్మలతో పండగ చేసుకోబోతున్నాడు. దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్ ఈ సినిమాలో కార్తికేయ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి.ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వి. క్రియేషన్స్ బ్యానర్‌లో 'హిప్పీ' రూపొందుతోంది.
|