అమ్మ మీద ప్రేమే" ఈ "అమ్మ పేరే.. నా కవిత్వం.."
చక్కని చిత్రాలతో అందరిని అలరిస్తూ కుంచె కలం పేరుగా చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కుంచె చింతా లక్ష్మీనారాయణ. తన భావాలను అందమైన గీతలలో చూపించడమే కాకుండా అద్భుతమైన భావాలను అలవోకగా రాయగల నేర్పు కుంచె చింతా లక్ష్మీనారాయణది. కథలు, కవితలు, బాల సాహిత్యం ఇలా అన్నింటిలో అందె వేసిన చేయి వీరిది." అమ్మ పేరే... నా కవిత్వం " అంటూ అందరి మనసుల్లోని అమ్మను, అమ్మ ప్రేమను అద్భుతంగా అక్షరాల్లో అందించారు.
అమ్మతో నేనంటూ అమ్మ కడుపులో జీవం పోసుకున్న వైనాన్ని, తొమ్మిది నెలల ప్రయాణంలో అమ్మతో పంచుకున్న పేగు బంధాన్ని, పురిటి బిడ్డగా లోకాన్ని చూసిన తీరును ఇలా ప్రతి క్షణాన్ని కనుల ముందు నిలిపారు. మాయమ్మ కవితలో ఈ ప్రపంచంలోనికి వచ్చిన మొదటి క్షణాల నుండి అమ్మతో పంచుకున్న అనుభూతిని, అమ్మ తనను గుండెలకత్తుకున్న క్షణాల దగ్గర నుండి అమ్మ స్పర్శలో ఆనందాన్ని, లాల పోసినా, జోల పాడినా, ఉగ్గుపాల మురిపాలు ఇలా అన్నింటిని మనం అనుభూతించేటట్లు చేసారు. అమ్మ ముద్దులతో తడిచిన తన పాలబుగ్గల చెమ్మను అమ్మ ప్రేమలో చూపిస్తూ అమ్మ మనసును తనకు పేరు పెట్టడం దగ్గర నుండి తన కొడుకు అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్న తపన తల్లి మనసుదని చెప్తూ క్రమశిక్షణ నేర్పిన గురువుగా వర్ణిస్తారు.
తన రాక కోసం ఎదురుచూపులను, గోరుముద్దల ఆకలి, నిదుర నవ్వుల కథల నక్షత్రాల ఆకాశాన్ని అమ్మ పక్కన పడుకుని అనుభూతించడాన్ని హృద్యంగా చెప్తారు. నా.. బాల్యంలో స్కూలుకి పోయే సందడి అల్లరిని, చిరిగిన చొక్కాలో చీరుకున్న రేగు, కంప చెట్ల జ్ఞాపకాలు, అమ్మ కొత్త చొక్కాలా చేయడము, వంకల్లో వాగుల్లో వాన వచ్చినప్పుడు చేసి వదిలిన కాగితపు పడవల జ్ఞాపకాలు గుట్లోంక కవితలో, గోనుపట్ట కొప్పిరి కవితలో జీతగాడు రాకపోతే చేసిన పనిని, నా..యవ్వనం కవితలో కొత్తగా వచ్చిన కౌమార్యం, లుంగీ తిప్పలు, బయట తిండితో వచ్చిన తిప్పలు, అమ్మ చేసిన సపర్యలు సరదాగా చెప్తారు. పండగొస్తే చేసే హడావిడి, వంటల్లో అమ్మకు చేసిన సాయం, చిన్నప్పుడు పక్కవాళ్ళని చూసి మారాం చేస్తే అమ్మ చేసిచ్చిన కొబ్బరాకు వాచ్చిని, నా..తొలి-విజయం కవితలో తొలి గురువు, దైవమై అమ్మ నేర్పిన ఆట పాటలు, విద్యాబుద్ధులు, బూగంప, మాగాణి, జమ్మిచెట్టు నీడలో వంటి కవితల్లో పొలంలో చేను గట్టు చెట్టు కింద అమ్మ పెట్టిన పప్పు ముద్దలు, బోరు కింద తలా స్నానాలు, పైరు అందాలు, అవ్వ విసిరిన విసనకర్ర గాలిని గుర్తు చేసుకున్నారు. మనకు ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు అనడంలో సందేహం లేదు.
అమ్మతో తిరునాళ్లకు వెళ్లిన జ్ఞాపకాలు, అమ్మ కొంగు చాటున దాగున్న గురుతులను, అమ్మ ఒడి తోడుగా కావాలని చెప్పడం, అమ్మ పలుకు విని నిదుర లేవడంతో మొదలై అమ్మ చేతి ముద్దతో తనకున్న అనుబంధాన్ని చెప్తూ, తనకు పెట్టందే ముద్ద ముట్టని అమ్మను , అమ్మ బాధను చూడలేని బిడ్డగా ఆ.. క్షణాలను అక్షరీకరించారు ఆర్తిగా. అమ్మ జోలపాట ఓంకారనాదమంటూ, అమ్మ పడిన జాబిల్లి పాటను మనందరికీ మరోసారి గుర్తు చేస్తూ, నా..దారి మా అమ్మ అని చెప్పడం చాలా బావుంది. అమ్మ పేరే...న కవిత్వం అంటూ చంటి పిల్లాడి ఏడుపు నుండి చివరి వరకు ప్రతి శబ్దంలోనూ వినిపించే స్వరం అమ్మ అని అంటూ గుండె కొట్టుకునేది 72 సార్లు అయితే నిమిషానికి 100 సార్లు అమ్మ తల్చుకునేది బిడ్డనని ఎంత బాగా చెప్పారంటే ఈ కవితా సంపుటికి " అమ్మ పేరే..నా కవిత్వం " అని సరిగ్గా సరిపోయేంతగా. జీవిత ప్రయాణం మొదలైనప్పటి నుండి దారి పొడవునా అమ్మ జ్ఞాపకాలతో, ఎదురుచూపులా అమ్మ ప్రేమనీడలో, మాది మమతల కోవెలలో అమ్మా అని పిలిచినా ప్రతిసారి నిజమైన నేస్తం అమ్మ అని, మా నానా మీద ప్రేమ, వాళ్ళ నాన్న మీద ప్రేమ కలిపి నామీద కురిపించే అమ్మ ప్రేమ పిచ్చిదని, నేను బయటకు వెళుతుంటే ఆరోగ్యం బాలేని అమ్మ ముఖంలో మార్పు,పక్షవాతంతో అలిగిన అమ్మ చేయి, ఆ చేయి పెట్టిన గోరుముద్దలు, అమ్మ అవస్థను అర్ధం చేసుకోలేక విసుక్కున్న తన తెలిసి తెలియని స్థితిని నిందించుకున్న తీరు తప్పు చేశానమ్మా కవితలో కనిపిస్తుంది.
అమ్మను పసిపాపగా చూసుకునే భాగ్యందక్కడం తనకు ఈ జన్మలో దక్కిన వరమని తానూ ఓ పసిపిల్లాడిలా సంబరపడటం అమ్మ ఋణం కవితలో మనం చూడొచ్చు. ఉగాది పండుగ సంబరాలకు దూరమైన అమ్మా కొడుకుల ఆంతర్యాలను ఎన్ని రోజులైందో కవితలో మనకు గుర్తు చేస్తారు. అమ్మకు చేసిన సేవలను అమ్మకు తలంటు స్నానం, నా...జన్మ ద్వారం కవితల్లో చదువుతుంటే అమ్మకు అమ్మైన ఓ బిడ్డ కనిపించాడు. నాకనిపించింది భావాన్ని చెప్పడానికి మాటలు కూడా దొరకని స్థితి. చిన్నవారైనా ఇంత బాగా రాసిన మీకు నా ఆశీస్సులు. నిశ్చలమైన తల్లి కవితలో ఒక జీవికి జీవితాన్నివ్వడానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టె తల్లి ఈ భూమిపై జీవానికి నిజంగా సంతానతల్లే అని చాలా బాగా చెప్పారు. నేను ఔనన్నా కాదన్నా నన్ను రోజు తాకే చల్లని పైరగాలిలో భౌతికంగా దూరమైన అమ్మ, నాన్న కలిసి తాకుతున్న అమ్మానాన్నల ప్రేమే ఉంటుందని నా..తో...కవితలో చెప్తూ తనని తాను సముదాయించుకుంటారు.
జాలి, దయకు,ప్రేమాప్యాయతలకు నిలువెత్తు సాక్ష్యం అమ్మంటారు. ఙివిత సాగరంలో సునామీలకు ఎదురొడ్డి గమ్యాన్ని చేర్చేది అమ్మని చెప్తారు. కలుషితం లేని అమ్మ ప్రేమ గొడుగై నిలుస్తుందని, ంఒరొ వరంగా మళ్ళీ ఆ అమ్మకే పుట్టాలని కోరుకుంటూ, అమ్మంటే ఏమిటో చెప్తూ, రెండక్షరాల ప్రేమ అమ్మానాన్నల ప్రేమంటూ, నాన్నంటే ఓ భయం,ధర్యం, నిజం అని చెప్తూ, నాన్న నేర్పిన సంస్కారాన్ని గుర్తు చేసుకుంటూ, నాన్న మందలింపు మాటున దాగిన ప్రేమని తెలుసుకుంటారు. నాన్నని గుర్తు చేసుకుంటూ, విశ్వమంత ఎత్తులో చూసుకుంటూ, తన ఎదుగుదలకు కారణమైన నాన్నకే మళ్ళి కొడుకుగా పుట్టాలనుకోవడం బావుంది. తన జీవితాన్ని పల్లె నుండి బయటకు వచ్చిన విధానాన్ని నా... కుటుంబం కవితలో చెప్తారు. నాన్న దూరమైనా క్షణాలకు అక్షరాల్లో జీవం పోశారు. అమ్మే అక్షరమై తనలో నిలిచిపోయిందని, అదే తన శ్వాసని నాతోనే...నిర్జీవమైపోవాలి అన్న కవితలో మాతృభాషపై మమకారాన్ని చూపిస్తారు. అమ్మ కష్టాన్ని అక్షరాల్లో చూపిస్తూ లిఖించని చరిత అమ్మదని చెప్తూ అమ్మకు తన అక్షరాభావాలతో పాదాభివందనం చేస్తూ అమ్మానాన్నల ఋణం తీర్చుకున్న కుంచె చింతా లక్ష్మీనారాయణ ధన్యులు.
ఇంత గొప్పగా అమ్మను అక్షరాల్లో చూపిన బిడ్డ, పరాయి స్త్రీలో తల్లిని చూసే మంచి మనసున్న మనిషిగా మరిన్ని రచనలు చేయాలనీ కోరుకుంటూ... హృదయపూర్వక అభినందన అక్షర చందనాలు.
|