Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

ఈ వారం ( 22/3- 28/3 ) మహానుభావులు

జయంతులు

మార్చ్ 23

 శ్రీ K.B,K.  మోహన్ రాజు : వీరు మార్చ్ 23, 1934 న విజయవాడ లో జన్మించారు.   వీరి పూర్తి పేరు  కొండా బాబూ కృష్ణ మోహన్ రాజు. ప్రముఖ నేపథ్య గాయకుడు. 1960-70 దశకంలో అనేక చిత్రాలలో పాటలు పాడారు.

మార్ఛ్ 26

 శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి :  వీరు మార్చ్ 26, 1872 న భీమవరం లో జన్మించారు. వీరూ, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారూ,  వీరిరువురూ, “ తిరుపతి వెంకటకవులు “  జంటకవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిధ్ధి చెందారు. వీరిద్దరుఇంచుమించువంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి..

 

2. శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు : వీరు మార్చ్ 26, 1912 న ఇంటూరు లో జన్మించారు. వీరు తొలితరం  సంపాదకులలో ప్రసిధ్ధి  చెందారు.  1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటువాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించాడు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతి చెందారు.

మార్చ్ 28

  1. శ్రీ చిత్తూరు  నాగయ్య  : వీరు మార్చ్ 28, 1904 న రేపల్లె లో జన్మించారు.  ప్రముఖ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత కర్త, దర్శకుడు , నిర్మాత.  వీరు నటించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి.

 

  1. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు  : వీరు, మార్ఛ్ 28, 1914 న, చెయ్యేడు లో జన్మించారు.  తెలుగు పదాలతో “ శివతాండవం “ ఆడించిన కవి. సంగీతం సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం వారిది.  నారాయణాచార్య విరచితమైన “ శివ తాండవ కావ్యం “  చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు. ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళుఫ్రెంచిపర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. ఆయనకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది.

 

వర్ధంతులు

మార్చ్ 22

  1. శ్రీ ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి. :  వీరు  U.G.గా ప్రసిధ్ధులు. సుప్రసిధ్ధ తత్వవేత్త. యు.జి. తత్త్వం ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు.  ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు.

   వీరు మార్చ్ 22,  2007 న స్వర్గస్థులయారు.

 

  1.  శ్రీ  తాడేపల్లి లక్ష్మీకాంతారావు  :  వీరు కాంతారావు గా ప్రసిధ్ధులు.  సుప్రసిధ్ధ తెలుగు సినిమా నటుడు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపదపౌరాణిక పాత్రలు ధరించారు. సుమారు 400 కి పైగా సినిమాల్లో నటించారు. అలనాటి ప్రముఖ నటులతో  సమానమైన గుర్తింపు పొందారు.

   వీరు మార్చ్ 22,  2009 న స్వర్గస్థులయారు.

మార్చ్ 26

 

 శ్రీ దుక్కిపాటి మధుసూధన రావు :  అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఎన్నో కుటుంబ కథా చిత్రాలు నిర్మించారు. వీరు ఎంతోమంది రచయితలకు, దర్శకులకు, నటీనటులకు ఎన్నో అవకాశాలిచ్చారు..  ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకుని, వారందరూ ఎంతో పేరుతెచ్చుకున్నారు.

వీరు మార్చ్ 26,  2006 న స్వర్గస్థులయారు.

మార్చ్ 27

శ్రీ గుత్తికొండ నరహరి :   రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేసిన చేయి.

వీరు మార్చ్ 27, 1985 న స్వర్గస్థులయారు.

మార్చ్ 28.

శ్రీ కోరాడ రామకృష్ణయ్య :  ప్రముఖ భాషావేత్త. తెలుగు, సంస్కృత భాషా నిపుణులు.   భాషా సాహిత్య వ్యాసాలు ఎన్నో రచించారు.

వీరు మార్చ్ 28, 1962 న స్వర్గస్థులయారు.

 

 

 

మరిన్ని శీర్షికలు
pratapabhavalu