ప్రముఖ నటుడు మోహన్‌బాబు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. తొమ్మిదేళ్ల క్రితంనాటి ఓ కేస్‌కు సంబంధించి తాజాగా హైద్రాబాద్ కోర్టు తుది తీర్పు వెలువరించడంతో, మోహన్‌బాబుకు ఏడాదిపాటు జైలు శిక్ష ఖరారైంది. 2010లో మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా రూపొందిన 'సలీం' సినిమా నాటి కథ ఇది. ఆ సినిమాకి దర్శకుడైన వై.వి.ఎస్ చౌదరికి సినిమా చిత్రీకరణకుగాను మోహన్‌బాబు 40.5 లక్షల రూపాయల చెక్‌ను అందించారు. ఆ చెక్ నగదుగా మారకపోవడంతో, వై.వి.ఎస్ చౌదరి కోర్టునాశ్రయించారు. ఈ కేస్ విషయమై దాదాపు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరిపిన హైద్రాబాద్ ఎర్రమంజిల్ కోర్టు, తాజాగా తుది తీర్పునిచ్చింది.
మోహన్‌బాబుకు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు, 41,75,000 రూపాయల జరిమానా విధించింది. ఇందులో ఎ1 నిందితులుగా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు 10 వేల రూపాయలు జరిమానా విధించగా, ఎ2గా ఉన్న మోహన్‌బాబుకు జైలుశిక్షతో పాటు, జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఈ జరిమానాను చెల్లించకపోతే మోహన్‌బాబు మరో మూడు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇదంతా తనపై జరుగుతున్న దుష్ప్రచారమనీ, రాజకీయాల్లోకి వచ్చినందుకు నాపై ఇలా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారనీ మోహన్‌బాబు గగ్గోలు పెడుతుండడం ఆశ్చర్యకరం. ఈ క్రమంలో మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
|