చిత్రం: మజిలీ
తారాగణం: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: గోపీ సుందర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: తమన్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాణం: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 5 ఏప్రియల్ 2019
కుప్లంగా చెప్పాలంటే..
మంచి క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యంతో వుంటాడు పూర్ణ (నాగచైతన్య). అనుకోకుండా అతని జీవితంలోకి అన్షు (దివ్యాన్ష) వస్తుంది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టి, పెరిగి, పెద్దదవుతుంది. కానీ, పెద్దలు ఒప్పుకోని కారణంగా వారి ప్రేమ విఫలమవుతుంది. అన్షుకి వేరే వ్యక్తితో పెళ్ళయిపోతుంది. పూర్ణకి శ్రావణి (సమంత)తో పెజళ్ళవుతుందిగానీ, అన్షుని మర్చిపోలేకపోతాడు. అలా భార్య శ్రావణిని దూరం పెడ్తాడు పూర్ణ. కొన్నాళ్ళ తర్వాత అన్షు వల్లనే పూర్ణ, శ్రావణి ఒకరికొకరు దగ్గరవుతారు. వీరి జీవితంలోకి ఓ పాప వస్తుంది. ఆ పాప ఎవరు? క్రికెటర్ అవ్వాలనుకున్న పూర్ణ కల ఏమయ్యింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
నటుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు నాగ చైతన్య పలు సినిమాలతో. ఈసారి నటుడిగా ఇంకో మెట్టు పైకెక్కాడు. జీవితంలోని భిన్నమైన స్టేజ్‌లను ప్రతిబింబించేలా ఆయా సన్నివేశాలకు తగ్గట్టు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటుడిగా నాగచైతన్యకి వంకలు పెట్టలేం అన్నంతగా సాగింది ఈ సినిమాలో అతని నటన.
హీరోయిన్ సమంత ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్. తన నటనతో మామూలు సన్నివేశాల్ని కూడా బాగా ఎలివేట్ చేయగలిగింది. నిజానికి ఈ సినిమా అంతా సమంత చుట్టూనే తిరుగుతుంటుంది. ఆమె పాత్ర ఎంటర్ అయ్యాక సినిమా తీరు తెన్నులే ఇంకో లెవల్‌కి వెళ్ళిపోతాయనడం అతిశయోక్తి కాదేమో.
కొత్తమ్మాయి దివాన్ష కౌశిక్ బాగానే చేసింది. నాగచైతన్య తండ్రి పాత్రలో రావు రమేష్ పాత్ర సూపర్బ్. తన నటనతో ఆ పాత్రని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాడాయన. సుబ్బరాజు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సుహాస్, సుదర్శన్ బాగా చేశారు. హీరోయిన్ తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి పాత్రకూ మంచి మార్కులు పడతాయి.
కథ పరంగా చూస్తే కొత్తదేమీ కాదు. కథనం పరంగానూ కొంత 'స్లో' పేస్ కనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం అన్నట్లుగా అనిపిస్తుంటుంది చాలా సన్నివేశాల్లో. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు ఫర్వాలేదు. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి.
దర్శకుడు శివ నిర్వాణ గతంలో తెరకెక్కించిన 'నిన్ను కోరి' తరహాలోనే ఈ సినిమానీ ఎమోషనల్‌గా 'డ్రైవ్' చేయాలనుకున్నాడు. నాగచైతన్య, సమంత, రావు రమేష్ తదితురుల కారణంగా డ్రైవింగ్ కొంతవరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాఫీగా సాగిపోతుంది. కానీ, కొన్ని సన్నివేశాలు సాగతీతకు గురయ్యాయి. సెకెండాఫ్‌లో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైపోవడం కూడా కొంత మేర మైనస్ అనిపిస్తుంది. ఓవరాల్‌గా భావోద్వేగాల పరంగా ఓ మంచి అనుభూతిని మిగిల్చే సినిమానే అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి. ఇంకాస్త వేగం వుంటే, సినిమా నెక్స్‌ట్ లెవల్ విజయాన్ని అందుకోవడానికి అవకాశం వుండేది.
అంకెల్లో చెప్పాలంటే..
2.75/5
ఒక్క మాటలో చెప్పాలంటే
మజిలీ - ఓ మంచి అనూభూతి
|