Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
humarasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఈ మధ్యన  జరిగిన 10/12 వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయిన తరువాత, ఓ అరడజను మంది, విద్యార్ధీ, విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకున్నారని చదివి, చాలా బాధ వేసింది… దీనికి ముఖ్యకారణం తల్లితండ్రులా, లేక వారు చదువుకున్న కార్పొరేట్ స్కూళ్ళా? ఎవరైతేనే, మొత్తానికి నష్టపోయింది మాత్రం పసిప్రాణాలు…ఈ ఆత్మహత్యలు చేసుకున్నవారు, ఎంతో ఒత్తిడికి లోనయి, అటు తల్లితండ్రుల expectations  తీర్చలేకపోయామని, నిరుత్సాహపడి ప్రాణాలు తీసుకున్నట్టనిపిస్తోంది… కొంతమంది, అంటే ఏసంబంధమూ లేని బయటివారు అనొచ్చు—మరీ అంత ఒత్తిడి తెస్తే ఎలాగండీ పిల్లలమీదా..? అని. విమర్శించడం సులభమేగా.. ఈరోజుల్లో ఈ కార్పొరేఱ్ స్కూళ్ళలో చేర్పించి, చదివించాలంటే , ఖర్చు వేలల్లోనూ, లక్షల్లోనూ అవుతోంది…

పోనీ అంత ఖర్చుపెట్టి చదివించలేక, ఏ ప్రభుత్వ  పాఠశాల లోనో చేర్పిద్దామంటే, అటు ఆ పిల్లాడికీ, ఇటు తల్లితండ్రులకీ కూడా నచ్చదు. అదేదో  peer pressure  అంటారే  అదన్నమాట. తన సాటి కొలీగ్ లు వేళాకోళం చేస్తారేమో , అని తండ్రీ,  తన తోటివారంతా ఏమైనా ఆటపట్టిస్తారేమో అని, ఆ పిల్ల/ పిల్లాడూ ఒత్తిడికి లోనవుతారు. చివరకి తలతాకట్టు పెట్టైనా,  ఏదో ఒక కార్పొరేట్ స్కూల్లోనే చేర్పించడం… అంతంత ఫీజులు కట్టి, పిల్ల/పిల్లాడి మీద ఆమాత్రం  expectations  పెట్టుకుంటే తప్పేమిటీ, అని ఎవరూ ఆలోచించరు.

ఇంక ఆ స్కూలు యాజమాన్యాల ఒత్తిడి మరో రకం-వాళ్ళు పిల్లలదగ్గరనుండి ఆశించేదానికి అసలు ఓ లిమిట్ ఉండదు. నూటికి నూరు శాతమూ,  విద్యార్ధులు , కనీసం 90 % మార్కులతో పాసైతే సరిపోదు, రాష్ట్రస్థాయిలో గొప్ప గొప్ప రాంకులుకూడా రావాలి.. లేకపోతే, రేపు రిజల్ట్స్ వచ్చిన తరువాత, పేపర్లలోనూ, టీవీ ల్లోనూ, ప్రకటనలు వేసుకోవద్దూ ? ఈ స్థాయిలో ఫలితాలు తెచ్చుకోవాలంటే, విద్యార్ధులు ఎన్ని తిప్పలు పడాలో మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఇటు తల్లితండ్రుల ఆశలకూ, అటు స్కూలు యాజమాన్యాల కోరికలకూ మధ్య, పిల్లలు నలిగిపోతున్నారన్నది మాత్రం నిజం. ఒక విషయం అర్ధమవదు, పరీక్షాఫలితాలు ప్రకటించగానే, ఈ కార్పొరేట్ స్కూళ్ళ ప్రకటనల్లో, ఎవరికి వారే,  రాష్ట్రస్థాయి రాంకుల్లో, మొదటి 10 స్థానాలూ తమవేనంటారు. మరొక స్కూలు వాడు, మొదటి పాతిక స్థానాలూ తమ విద్యార్ధులవే అంటాడు. ఎవరిని నమ్మేదీ? అసలు విద్యని వ్యాపారంగా మార్చడమే ఓ  ఘోరమైన తప్పు. మన రాష్త్రాల్లోని రాజకీయనాయకుల్లో చాలామందికి, ఈ వ్యాపారంలో భాగస్వామ్యం ఉంది. దరిద్రం ఏమిటంటే, ఆ రాజకీయనాయకులే మనకి పాలకులు కూడా... ప్రజలనుండి వసూలు చేసే పన్నులతోనే కదా, మన ప్రభుత్వపాఠశాలలు నడిపేదీ?    These politicians, who run Corporate Schools, and also part of The Government, ensure that Government Schools are neglected. దీనితో జరుగుతున్నదేమిటీ, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకూ పనికి రావనే భావన.

పైన చెప్పిన విషయాలు ఓ ఎత్తైతే, పరీక్షావిభాగం వారు చేసే నిర్వాకాలు మరో ఎత్తు. ఈమధ్యన వచ్చిన పరీక్షా ఫలితాలలో, ఎన్నో అవకతవకలు జరిగాయని విన్నాము. వాటిని సరిచేసే సమయమూ, ఓపికా ఎవరికీ లేవు. ఏదో ఫలానాతేదీకి ఫలితాలు ఏ మంత్రిచేతిమీదుగానో, ప్రకటించేస్తే పనైపోతుందనుకుంటారు. అవన్నీ సరీగ్గా ఉన్నాయాలేదా అని చెక్ చేసే నాధుడేలేడు. పైగా మరో చిత్రం ఏమిటంటే, మొదటిసారి ఫెయిల్ అయితేనేమిటండీ, మరో ఛాన్సుందిగా అనడం. శ్రధ్ధగా చదివిన విద్యార్ధి అసలు ఎందుకు  గత  అయ్యాడో, అడిగినా సమాధానం ఉండదు. పోనీ లక్షలు వసూలుచేస్తూన్న ఆ కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాలైనా ప్రయత్నించొచ్చుగా, అబ్బే అలాటిదేమీ ఉండదు. వాళ్ళకి డబ్బుసంపాదనే లక్ష్యం. ఒకడుపోతే మరోడూ...

ఇన్ని గొడవలమధ్య, విద్యార్ధులు నలిగిపోతున్నారు.  ప్రతీ ఏడాదీ, పరిక్షా ఫలితాలు ప్రకటించగానే, మన పత్రికల్లో చూసేవి ఏమిటయ్యా అంటే, పేద్దపెద్ద స్కూలుయాజమాన్యాల ప్రకటనలూ, లోపలి పేజీల్లో ఏదో ఓ మూల, పరిక్షల్లో పైలయిన విద్యార్ధుల ఆత్మహత్యల వార్తలూ… దీనితో అర్ధమవడంలేదూ? దేనికి ప్రాధాన్యమిస్తున్నాయో మన ప్రభుత్వాలూ?

ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నంతవరకూ వాతావరణంలో మార్పుండదు.

సర్వేజనాసుఖినోభవంతూ.

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu