ప్రతాపభావాలు!
వేలంవెర్రి
మన తెలుగులో వేలంవెర్రి అనే ఓ పదం ఉంది, అంటే ముందు వెనకలు ఆలోచించకుండా, ఒకదాని వెనకాల పిచ్చిగాపడిపోవడం.
మనిషికి వెర్రి ఉంటుంది. కాకపోతే అది ఆవగింజంతా? గుమ్మడికాయంతా? అనేదే ప్రశ్న. గుమ్మడికాయంత ఉంటే అది వేలంవెర్రి అనుకోవచ్చు.
ఒకప్పుడు ఫ్యాషన్ లను వేలంవెర్రిగా అనుసరించేవారు. ఎక్కడన్నా ఎవరిదన్నా డ్రస్సో, హెయిర్ స్టైలో, మేకప్పో నచ్చిందనుకోండి అహ అందరు దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయేవాళ్లు. అలాగే సినిమాల్లో నటించే తారల చీరలు. ఆయా సినిమాలు, తారల పేర్ల మీద చీరలు క్షణాల్లో అమ్ముడుపోయి, నో స్టాక్ బోర్డ్ లు పెట్టెవాళ్లు.
క్రికెట్! క్రికెట్ గురించి ఇహ చెప్పనక్కరలేదు. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లు, అత్యవసర పనులు మానుకుని మరీ టీవీ లకు, రేడియోలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం మనకి నిత్య దృశ్యం. ఎవరన్నా కనిపిస్తే ఎలా ఉన్నారని? అడగాల్సింది పోయి స్కోరెంత? అని అనడం. ఇంతకన్న వెర్రికి నిదర్శనం ఉంటుందా?
వేలంవెర్రికి ఇంకో ఉదాహరణ సెల్ఫోన్లు. మార్కెట్లో కొత్త ఫీచర్లతో ఖరీదయిన ఫోన్ వచ్చిందంటే, తమ ఫోన్ ఎంత బాగా పనిచేస్తున్నా, దాన్ని వదిలించుకుని బోలెడంత ఖరీదు పెట్టి, అప్పులు చేసి, లేదా భరించలేని ఈ ఎం ఐ లను కట్టుకోడానికి సిద్ధపడైనా దాన్ని సొంతం చేసుకోవాల్సిందే!
కొన్ని పుస్తకాలు, సినిమాల కోసం చాంతాడంత క్యూలు కట్టి, అవి దొరక్కపోతే ఇహ ఆ బాధ వర్ణనాతీతం.
నాకేమనిపిస్తుందంటే ఈ వేలంవెర్రి కూడా ఒకరకమైన మనసిక బలహీనతే. అది మనడబ్బును, మనశ్శాంతినీ హరించేస్తుంది.
ఈ జాఢ్యాన్ని వదిలించుకోపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు. పైవాటిలో ఏది లేకపోయినా మన ప్రాణం పోదు. అత్యవసరమైనవీ, నిత్యావసరమైనవీ కావు. అయినా ఆ పిచ్చ ఎందుకో.
మనిషన్నాక కాస్త కళాపోషణ, సరదా ఉండాలి. లేకపోతే జీవితం యాంత్రికమవుతుంది. అయితే సరదా వేరు, వేలంవెర్రి వేరు. సరదాకోసం సినిమాకెళితే టికెట్ దొరికితే చూస్తాం లేదంటే లేదు. అదే వేలం వెర్రి అయితే, టికెట్ కోసం సర్వ విధాలా ప్రయత్నించడం, బోలెడంత డబ్బు పెట్టి భ్లాక్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించడం, దొరక్కపోతే తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవడం మాత్రం వేలంవెర్రి పర్యవసానమే!
వేలంవెర్రి అనేది మనిషి జీవితంలోని కొంత కాలాన్ని కబళించి వేస్తుంది. ఒక్కసారి వదుల్చుకుని చూడండి. జీవితం ఎంత మధురంగా ఉంటుందో!
|