హీరోగా 'ఒకటో నెంబర్ కుర్రాడు' అంటూ గ్రాండ్ తెరంగేట్రం చేసిన నందమూరి హీరో తారకరత్న. హీరోగా సత్తా చాటేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఈ మధ్య హీరో గిరీ వదిలేసి, విలన్ అవతారం కూడా ఎత్తేశాడు. అక్కడ కూడా ఈ యంగ్ హీరోకి కలిసి రాలేదు. దాంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా తన స్టామినా చాటుకునేందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి ఏదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తోనో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనో రావడం లేదు మనోడు. బయోపిక్‌తో వస్తున్నాడు. బెజవాడ నాటి రాజకీయ చరిత్రలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ.. ఈ రెండు పేర్లు ప్రముఖంగా వినిస్తుంటాయి.
వీరిలో వంగవీటి రంగా జీవిత చరిత్రతో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆల్రెడీ సినిమా తెరకెక్కించేశాడు. ఇక మిగిలిన దేవినేని బయోపిక్‌ని ఇప్పుడు తెర పైకి తీసుకురానున్నారు. దేవినేని పాత్రలో తారక రత్న నటిస్తున్నాడు. నర్రా శివ నాగేశ్వరరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'దేవినేని - బెజవాడ సింహం' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. మే 10 నుండి 'దేవినేని' రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. 1977లో సాగే కథాంశంగా ఈ స్క్రిప్టు ప్రిపేర్ చేశారట. దేవినేని చేసిన మంచి పనులను సినిమాలో చూపించే ప్రయత్నం చేయనున్నారట దర్శకుడు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్ అనీ తెలుస్తోంది.
|