తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై జరుగుతోన్న రచ్చ సంగతి తెలిసిందే. ఫలితాల్లో దొర్లిన తప్పుల కారణంగా 16 మంది విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలించిన సంగతి అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ, విద్యార్ధులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షల్లో ఫెయిలైతే, ఆత్మహత్యలకు పాల్పడడం సబబు కాదనీ, ధైర్యంగా సమస్యపై పోరాడాలనీ సూచిస్తున్నారు. అయితే ఈ అంశంపై యంగ్ హీరో రామ్ ఇంకాస్త సీరియస్‌గా ఘాటుగా స్పందించాడు. 'ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకూ, చెల్లెళ్లకూ.. మీరు జీవితంలో అవ్వబోయేదానికీ, చేయబోయేదానికీ ఇది ఒక 'డాష్'తో సమానం. దయచేసి దీన్ని లైట్ తీసుకోండి.. ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని.. ఎట్ ఇంటర్ బోర్డ్ మర్దర్స్..' అని స్పందించాడు.
రామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒకింత చర్చనీయాంశం అయినప్పటికీ, ఆ వయసులో ఉన్న పిల్లలకు రామ్‌లా చెబితేనే అర్ధమవుతుంది. నిజాన్ని అంత గట్టిగా చెబితే కానీ అర్ధం కాదు. లోతుగా ఆలోచిస్తే రామ్‌ని సమర్ధిస్తున్నవాళ్లూ లేకపోలేదు. అంతేకాదు, తన స్టేట్‌మెంట్‌లో జాతి గర్వించదగ్గ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఇంటర్ పూర్తి చేయని విషయాన్ని రామ్ ప్రస్థావిస్తూ విద్యార్ధుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
|