భారీ అంచనాలతో తెరకెక్కిన యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. అయితే అనుకున్న టైంకి ఈ సినిమాని విడుదల చేయడంలో నిర్మాతలు ఫెయిలవడంతో సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చిత్రీకరణ పూర్తయ్యి, విడుదలకు దగ్గర పడిన తరుణంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్' నిఖిల్‌కి తీరని నష్టాన్ని కలిగించింది. సినిమాని వాయిదా వేసుకునేలా చేసింది. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది 'అర్జున్ సురవరం' టీమ్. అయితే 'అవెంజర్స్' సినిమాకి అనూహ్యంగా వచ్చిన హైప్‌తో దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లు భయపడిపోయి సినిమాని విడుదల చేయలేమని చేతులెత్తేశారు.
దాంతో ఆందోళన చెందిన నిఖిల్ చేసేది లేక ఫ్యాన్స్‌కి సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పాడు. మీలానే నేను కూడా ఓ మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నానంటూ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడు మే 17న 'అర్జున్ సురవరం' విడుదల కాబోతోందనీ ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్ ప్రకటన కాదది. అంటే 'అర్జున్ సురవరం' ఆ డేట్‌కైనా వస్తుందో లేదో ఇంకా తెలియని పరిస్థితి. ఈ సినిమాలో నిఖిల్ పవర్‌ఫుల్ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్ డైలాగులతో ఓ మంచి మెసేజ్‌తో కూడిన చిత్రమిది. లావణ్య త్రిపాఠి నిఖిల్‌కి జోడీగా నటిస్తోంది. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
|