'ఖైదీ నెంబర్ 150' సినిమాతో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినీ ప్రస్థానం మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెగా డాటర్ నిహారిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బిగ్‌బీ అమితాబ్ సహా, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివతో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. 'సైరా' షూటింగ్ పూర్తి కావడంతో, చిరంజీవి, కొరటాల సినిమా కోసం సంసిద్ధమవుతున్నారట. 'సైరా' కోసం పెద్దగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం రాలేదు చిరంజీవికి. అయితే కొరటాల సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా కోసం ఫిట్‌నెస్‌పై కాస్త దృష్టి పెట్టారట. చిన్న చిన్న వర్కవుట్స్ చేస్తూ, నిపుణుల పర్యవేక్షణలో చిరంజీవి బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారమ్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి, మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
|