Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మహర్షి చిత్రసమీక్ష

maharshi movie review

చిత్రం: మహర్షి 
నటీనటులు: మహేష్‌, పూజా హెగ్దే, అల్లరి నరేష్‌, జగపతిబాబు, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి తదితరులు. 
సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌ 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌ 
రచన: వంశీ పైడిపల్లి, హరి, సోలమన్‌ 
దర్శకత్వం: వంశీ పైడిపల్లి 
నిర్మాణం: వైజయంతీ మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా 
నిర్మాతలు: అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పరమ్‌ వి పొట్లూరి, పర్ల్‌ వి పొట్లూరి, కెవిన్‌ అన్నే 
విడుదల తేదీ: మే 9, 2019 

క్లుప్తంగా చెప్పాలంటే 
రిషి, ప్రపంచంలోనే అతి గొప్ప కంపెనీల్లో ఒకటయిన ఆరిజిన్‌కి సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. తండ్రి మరణానంతరం స్వదేశానికి వస్తాడు రిషి. అలా తన గతంలోకి వెళతాడు రిషి (మహేష్‌బాబు). కాలేజీలో చదువుతున్న సమయంలో రిషికి ఇద్దరు స్నేహితులు రవి (అల్లరి నరేష్‌), పూజ (పూజా హెగ్దే) వుంటారు. ముగ్గురూ మంచి స్నేహితులు. కాలేజీ చదువులు పూర్తయ్యాక ప్రపంచాన్ని గెలవాలన్న పెద్ద పెద్ద ఆశలతో రిషి, అమెరికా వెల్ళిపోతాడు. అయితే, స్వదేశానికి తిరిగొచ్చిన రిషికి, రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేంటి? రవి గురించి తెలుసుకున్న రిషి ఆ తర్వాత తన ప్రయాణాన్ని ఎలా మలచుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్‌కి వెళ్ళాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మంచి నటుడు, చాలా మంచి నటుడు అని చాలా చాలా సినిమాల విషయంలో చెప్పుకున్నాం. ఈ సినిమాలో మరింత ఈజ్‌తో కనిపిస్తాడు మహేష్‌. కాలేజీ కుర్రాడి పాత్రలో అయితే మహేష్‌ ఎనర్జీకి ఎవరైనా హేట్సాఫ్‌ అనాల్సిందే. విభిన్న షేడ్స్‌ వున్న రిషి పాత్రలో మహేష్‌ ఒదిగిపోయాడు. వన్‌ మ్యాన్‌ షో అనదగ్గ స్థాయిలో మహేష్‌ ఈ సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరించాడనడం అతిశయోక్తి కాదేమో.

పూజా హెగ్దే అందంగా కనిపించింది, అభినయానికి అవకాశమున్న పాత్రలో మెప్పించింది. ఆమె బ్యూటీ ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ. అల్లరి నరేష్‌కి విలక్షణ పాత్రలు కొత్తేమీ కాదు, కాకపోతే అతను చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి చేస్తుంటాడు. తన నటనతో మరోమారు మెప్పించాడు అల్లరి నరేష్‌. అత్యంత కీలకమైన పాత్రకి తనవంతు న్యాయం చేశాడు. నటుడిగా ఇది అతనికి ఓ ప్రత్యేకమైన సినిమా అవుతుంది. మిగతా పాత్రధారుల్లో రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ తదితరులంతా తమ తమ పాత్రల మేర బాగానే చేశారు. 
కథ మరీ కొత్తదేమీ కాదు. కథనం పరంగా దర్శకుడు తన మార్క్‌ చూపేందుకు ప్రయత్నించినా, సెకెండాఫ్‌లో నెరేషన్‌ బాగా స్లో అయిపోయింది. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు వినడానికీ, చూడటానికీ బాగున్నాయి. స్టంట్‌ కొరియోగ్రఫీ బావుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ విభాగాలు సినిమాకి తమవంతు సహకారం అందించాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ ఎంతో అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. 
మెసేజ్‌తో కూడిన కమర్షియల్‌ సినిమా తెరకెక్కించాలంటే అది ఆషామాషీ విషయం కాదు. వంశీ పైడిపల్లి గతంలో 'ఎవడు' సినిమాతోనూ, 'ఊపిరి' సినిమాతోనూ మంచి మెసేజ్‌ అయితే ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఈసారి ఆ మెసేజ్‌ ఇంకా పెద్దది కావడం విశేషం. మెసేజ్‌ని కమర్షియల్‌గా చెప్పే క్రమంలో, సినిమాటిక్‌ లిబర్టీ కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. అదే సమయంలో, నెరేషన్‌ చాలా వేగంగా వుండాల్సింది పోయి, సెకెండాఫ్‌లో నెమ్మదించేసింది. కాలేజీ కుర్రాడిగా మహేష్‌లో ఎనర్జీని, ఇతర నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్‌నీ రాబట్టిన దర్శకుడు, సెకెండాఫ్‌లో తడబడ్డాడు. అనవసరమైన సీన్స్‌ ఎక్కువగా వచ్చేసి, మంచి సీన్స్‌ని డామినేట్‌ చేశాయి. లెంగ్త్‌ ఎక్కువ కావడం సినిమాకి మరో మైనస్‌ పాయింట్‌. ఓవరాల్‌గా మంచి కాన్సెప్ట్‌ ఎంచుకున్నా, అవసరమైన కమర్షియల్‌ హంగులు అద్దినా, రిషితో జర్నీని కదుపులతో నింపేశాడు దర్శకుడు. భారీ స్థాయిలో నిర్మాణం, మహేష్‌బాబు ఔట్‌ అండ్‌ ఔట్‌ సూపర్‌ పెర్ఫామెన్స్‌ ఇవన్నీ సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌. సమ్మర్‌ సీజన్‌ని క్యాష్‌ చేసుకోగలుగుతాడా ఈ మహర్షి? అన్నది ముందు ముందు తేలుతుంది.

అంకెల్లో చెప్పాలంటే 
2.75/5

మాటల్లో చెప్పాలంటే 
'మహర్షి' - సెకెండాఫ్‌లో ప్రయాణం సుదీర్ఘం!  

మరిన్ని సినిమా కబుర్లు
churaka