'సీత' కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి అంటుంటారు. ఆ టైటిల్ పెట్టుకున్నందుకు నిజంగానే మన 'సీత'కు కూడా సినిమా కష్టాలు తప్పలేదండోయ్. ఇంతకీ ఏ సీత గురించి మాట్లాడుకుంటున్నామనే కదా మీ అనుమానం. అదేనండీ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'సీత' సినిమా కోసమే మాట్లాడుకుంటున్నాం. అవునండీ ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 24న కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇంతవరకూ గ్లామర్ తారగా చూసిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపిస్తోంది. పేరుకే ఈమె పేరు సీత. కానీ తీరు మాత్రం పూర్తిగా వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే శూర్పణఖ తీరు అనుకోండి.
అంత కటువుగా ఉంటుందన్న మాట. ఆల్రెడీ విడుదలైన 'సీత' ట్రైలర్ చూశాక అందరికీ శాంపిల్‌గా ఓ ఐడియా వచ్చేసింది కాజల్ క్యారెక్టర్‌పై. నిజానికి ఈ సినిమాకి 'సావిత్రి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. అయితే కథకి తగ్గట్లు 'సీత' అయితే బాగుంటుందని భావించారట. టైటిల్ బజ్ అయితే బాగుంది. చందమామని అందంగా గ్లామరస్‌గా చూసిన అభిమానులు ఈ సరికొత్త క్యారెక్టర్‌లో ఫుల్ లెంగ్త్‌లో చూసేందుకు ఉత్సాహం కూడా బాగానే చూపిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మాస్ హీరోగా కనిపించిన బెల్లంకొండ రోల్ కూడా కొత్తగానే ఉంది ఈ సినిమాలో. మొత్తానికి 'సీత' సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే ఇదే ఇంట్రెస్ట్ రిలీజ్ తర్వాత కూడా ఉంచుకుంటుందో లేదో చూడాలంటే మే 24 వరకూ ఆగాల్సిందే.
|