Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఎప్పుడో కొన్ని యుగాలపూర్వం కాదు, 80, 90 ల వరకూ, వివాహవ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసేసుకుని, హాయిగా సంసారం చేసుకునేవారు. అలాగని  భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు లేవని కాదు.. ఎలాగోలాగ ఇద్దరూ ఓ కాంప్రమైజుకి  రావడం, అధవా బేధాలు వచ్చినా, ఏ పెద్దలో విరి మనస్పర్ధలు పోయేటట్టు సలహా ఇవ్వడమో జరిగేది…  వివాహవ్యవస్థ అంత గట్టిగా ఉండడానికి ముఖ్యకారణం , ముహూర్తబలం అనికూడా చాలామంది నమ్మకం. ఇదేకాకుండా వివాహసమయంలో ఉఛ్ఛరించే మంత్రాల ప్రభావమనికూడా ఓ నమ్మకం. కారణాలు ఏవైతేనేం, హాయిగా కాపరాలు చేసికుని, పిల్లా పాపలను కని, పెంచి పెద్దచేసేవారు.

మరో కారణం కూడా ఉండేది—ఆరోజుల్లో సమాజంలో కొన్ని కట్టుబాట్లు కూడా ఉండేవి..వాటినికూడా పాటించేవారు.. భార్యాభర్తలు విడాకులిచ్చుకుని, విడిపోవడం అరుదుగా ఉండేది… కాలక్రమేణా రోజులూ మారాయి, మనుషుల మనస్థత్వాలూ మారాయి. ఉదాహరణకి, కొన్నిపెళ్ళిళ్ళు , ముహూర్తంతో పట్టింపు లేకుండా, అందరికీ సదుపాయంగా ఉండడానికి , ఏ శలవురోజో, కాకపోతే ఏ వారాంతం లోనో జరిగేటట్టు చూసుకుంటున్నారు… అలాగని ముహూర్తం గురించి పట్టించుకోరా అంటే అదీ కాదూ..మంచిముహూర్తాలే కానీ, మరీ గట్టి ముహూర్తం కాదేమో అనుకునేవారూ ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్హ్యమైనది, ఈరోజుల్లో సహనశక్తి పూర్తిగా లోపించడం. ఒకనొకప్పుడు, భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా సద్దుకుపోయే అలవాటుండేది, కారణాలు ఏవైనా. బహుశా అందుకేనేమో, పూర్వకాలపువారు, 50 ఏళ్ళూ, ఒక్కోప్పుడు అంతకంటే ఎక్కువ సంవత్సరాలూ, కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో  ఇప్పటికీ కాపరాలు చేసుకుంటున్నవారిని చూస్తూంటాము… వారికి ఒకరంటే ఒకరికి ప్రేమ, అభిమానమూ ఎక్కువపాళ్ళలోనే ఉండేవి.  అలాగని ఈ రోజుల్లో లేదనీ కాదూ.. ఆ ప్రేమాభిమానాలు లేకపోతే, అసలు ఈరోజుల్లో ప్రేమ వివాహాలు జరిగేవేకాదేమో.. కానీ ఎక్కడో  something is missing.  వీటికి కారణాలు ఎక్కడో వెదకక్కర్లేదు. మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కోరికలు ఎక్కువైపోయాయి. ఒకానొకప్పుడు, సంపాదన అంత ఎక్కువగా ఉండేది కాదు.  ఉన్నదాంట్లోనే గుట్టుగా కాపరాలు చేసుకునేవారు. ఉంటే తినడం, లేకపోతే పస్తులుండడం. ఇప్పుడలాగ కాదుగా, కోరికలెక్కువవడంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి… ఐటి ఉద్యోగాలైతే, వారివారి  career  పెంచుకోవడానికే   priority.  దానితో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. ఆ డబ్బుసంపాదనలో, మనసుకీ, శరీరానికీ విశ్రాంతి దొరకడం లేదు. ఏచిన్న పొరపాటు జరిగినా, ఒకరిపైఒకరు తప్పులు వేలెట్టిచూపడం ఎక్కువయింది. వీటికి సాయం  ego  ఒకటీ… తప్పుఒప్పుకోడానికి ఇరుపక్షాలూ సిధ్ధంగా లేరు… అందుకేనేమో, 10-15 సంవత్సరాలు కాపరం చేసి, పిల్లల్ని కన్నవారుకూడా, విడిపోవడానికే సిధ్ధపడుతున్నారు.  Compatibility  లేనప్పుడు, విడిపోవడమే మంచిదిగా, అని ఓ సమర్ధింపు ఒకటీ.. బహుశా అదీ రైటేనేమో. కానీ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు.

ఒక్కోప్పుడు విడిపోవడానికి చూపించే కారణాలు చిత్రంగా ఉంటాయి… భర్త తల్లితండ్రులు వీళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు కొందరికి. కొంతమందికి పిల్లల్ని కనడం ఇష్టం ఉండదుట. వీటికి సాయం ఈమధ్యన social media  లోకూడా వీటిమీదే చర్చలు… పిల్లల్ని కనకుండా, ఏ అనాధలనో దత్తత తీసుకోవచ్చు కూడా.. కానీ ఆవిషయం ఇద్దరూ చర్చించుకుని, ఇరువైపుల పెద్దవారినీ ఒప్పించే ప్రయత్నం చేసి అందరూ సంతోషంగా ఉండొచ్చుగా.మరి ఈమాత్రందానికి  తల్లితండ్రులని ఏదోవిధంగా ఒప్పించి, అంతంత ఖర్చు పెట్టించి, పెళ్ళెందుకు చేసుకుంటారో అర్ధం అవదు.  కొంతమంది చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతూంటారు. ఉన్నాడో ఊడేడో తెలియదు… ఇలాటివాటికి, ఈరోజుల్లో జనాలు హీరోలుగా పూజించే  సినిమా వాళ్ళు కూడా ఓ కారణం. తమ అభిమాన హీరో ఇద్దరుముగ్గురు పెళ్ళాల్ని మార్చుకోగాలేనిది, మనం మాత్రం ఎందుకు చేయకూడదూ?

ఈ మధ్యన అదేదో  Live in  అనికూడా ఒకటొచ్చింది. పెళ్ళీపెటాకులూ అవసరంలేదు..  ఒకరికొకరు నచ్చారా లేదా అని చూసుకుంటారుట, నచ్చకపోతే  బైబై చెప్పేసుకోవడం. అన్నిటిలోకీ విచిత్రం ఏమిటంటే, లింగబేధం లేకపోయినా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చుట, పైగా దీనికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం కూడా ఇచ్చింది… ఒకనొకప్పుడు గుట్టుగా చేసుకునేవారు ఇప్పుడు, బహిరంగంగానే కాపరాలు చేసుకుంటున్నారు..

సమాజ వాతావరణం మారిపోవడానికి, మన టీవీలు కూడా, సీరియల్స్ ద్వారా ఎంతో కొంత బాధ్యులే. ఏ భాషతీసుకున్నా, ఆ సీరియల్స్ లో ఇతివృత్తం వీటిగురించే.. పైగా రోజూ చూస్తేనేకానీ ముద్దదిగదు కొందరికి.. కొత్తకొత్త ఐడియాలు రేకెత్తించడంలో ఈ సీరియల్స్ వే ముఖ్యపాత్ర…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
hyumarasam