Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రెక్కలు విప్పిన మౌనం.. - ..

rekkalu vippina mounam

సుధత్తకి బాగోలేదని ఫోన్ అందుకున్నప్పటినుంచీ మనసు మనసులో లేదు.
ఆఫీసునుంచి రాగానే రవిని పదిసార్లు అడిగాను. ఏమైంది మీకేమైనా చెప్పారా అని.
బ్యాగు లోపల పెట్టి కాళ్ళు కడుక్కుని కుర్చీలో కూర్చున్నా.ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా తోచలేదు. చివరికి అత్త కొడుకు నవీన్ కి ఫోన్ చేసాను. కొంచం సేపటికి ఎత్తాడు..
“ ఏరా ఏమయిందత్తకి..?”
అదీ ..అదీ.. అంటూ నసిగాడు.
“ఏమైందో చెప్పవేంటి ..?” గట్టిగా అన్నాను.
“ ఏం చెప్పాలో తెలీదండ లేదాంటీ..మీరు వస్తున్నారుగా..రండి చెప్తాను..” కంగారుగా మాట్లాడాడు.
ఇక లాభం లేదు . వెళ్లి కనుక్కోవలసిందే…
రవి, నేను కాఫీ తాగి బయలుదేరాం. నేను రవి సుధత్త దగ్గరికి చాలా సార్లు వెళ్ళాం. నాన్నతో ఎంత చనువో..అత్తతో అంతే చనువు.తన పిల్లలతో సమానంగా నన్నూ చూసుకుంది.
“ ఏమై ఉంటుంది “ రవిని అడిగాను ఉండబట్టలేక.
“ వయసు కూడా పై బడుతోంది కదా! ఏమో చెప్పలేం.. నువ్వు కంగారు పడకు”.. వారించాడు రవి.
హాస్పటల్ చేరుకోగానే నవీన్ కనిపించాడు.కోడలు మేఘన ఎదురొచ్చి నా చేయి పట్టుకుంది.
వాళ్లనలా చూడగానే నాకు కంగారు పెరిగింది.
“ ఏమైందత్తకి..”
“ మీరు రండాంటీ… “ లోపలికి తీసుకెళ్లింది .
గదిలో మంచం మీద పడుకుని ఉంది అత్త. చూపు ఎటువైపో..
“అత్తా…” అని దగ్గరికి వెళ్ళి చేయిపట్టుకుని పలకరించాను.
ఒక్క క్షణం నా వైపు చూసింది ..”వాళ్లు నడుస్తున్నారు..పరుగెడుతున్నారు..నడు..నడు..లేదు పరుగెట్టు..”…వేళ్లు నొక్కుకుంటూ ఏదో మాట్లాడుతోంది.
     నమ్మలేక పోయాను.. గలగలా మాట్లాడుతూ ఉండే అత్తేంటి ..ఇలా అర్థం లేని మాటలు మాట్లాడుతోంది..
ఎందుకిలా.. నా మదిలో ప్రశ్నలు ముసురుకుంటున్నాయి.
     “విమలొదినా..” అత్తకూతురు రజని నన్ను పట్టుకుని బావురుమంది..
    ఛ ..ఊరుకో.. ఓదార్చసాగాను..
“ఉదయం లేచినప్పటి నుంచీ మనిషి ఇలాగే తేడాగా కనిపించింది.ఎవ్వరినీ గుర్తు పట్ట లేదు..ఏదో లోకంలో ఉన్నట్లే ఉన్నారు అత్తమ్మ “ చెప్పుకొచ్చింది మేఘన.
     “ డాక్టర్లు ఏమంటున్నారు..?”
     “అదే పరీక్షలన్నీ చేస్తున్నారు..ఏదైనా షాక్ కి గురై ఉండ వచ్చు ..లేదా మెదడు నరాలు దెబ్బతిని ఉండొచ్చు..ఒక్కసారి పరీక్షలన్నీ చేద్దాం “ .. అన్నారు.
     మనసంతా భారంగా అయిపోంది.
రెండు రోజులు గడిచింది. పరిస్థితులలో ఏమీ మార్పు లేదు.పరీక్షలు జరుగుతూనే ఉన్నాయ్. సుధత్త తనలో తను మాట్లాడుకోవడం ఆపలేదు. మనిషి నీరసించి పోయింది. ఎమ్ ఆర్ ఐ స్కాన్ తీసారు..మెదడులో నరాలు దెబ్బతిన్నాయి.అక్కడక్కడా బ్లాక్స్ ఉన్నాయన్నారు. వాటి వల్ల కనెక్టివిటీ సరిగా లేక గుర్తుపట్టలేక పోవడం ..మరచిపోవడం జరుగుతుందని..చెప్పి తనకు షాక్ కలిగిన కారణాలు తెలుసుకోవాలన్నారు.సోడియం లెవల్స్ తగ్గడంతో ఎక్కించారు..క్రమంగా కోలుకుంటుంగా ఇంటికి పంపించారు.
    ఇంటికి రావడం ఆలస్యం బంధువుల రాకపోకలు , పలకరింపులూ నడుస్తున్నాయి. మామయ్య కింద మీద అవడం గమనిస్తూనే ఉన్నాను.
    సుధత్త కోసం రెండురోజులు సెలవుపెట్టి అక్కడే ఉండిపోయాను . నేనుండగానే సుధత్తని పలకరించడానికి తన స్నేహితురాలు సుజాత ఆంటీ వచ్చారు.
“ ఆంటీ.. చూసారా..రండి” లోపలికి తీసుకెళ్ళాను. సుధత్తని చూసి సుజాత ఆంటీ కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నారు.
“ఇదేంటి సుధ ..ఇలా?..”అడిగింది కంగారుగా.
“ అదే మాకూ అర్థం కావడం లేదు. “
డాక్టర్లు, పరీక్షలు ..అన్నీ వివరించాను.
“ ఇవాళ నాకు వేరే పని ఉంది .. నువ్వు రేపు ఉదయం ఉంటావా ..వస్తాను“ అంది.
“ ఉంటాను మీరు వెళ్లిరండని “ పంపించాను.
     మర్నాడు అన్నట్లుగానే సుజాత ఆంటీ వచ్చారు.. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమైంది.
“సుధ ఇలా తయారవడానికి కారణం ఏమయుండచ్చునంటావ్ విమలా.. ?..”నన్ను అడిగారు.
    “ డాక్టర్లు చెప్పినట్లుగా పెద్గ షాక్ కి గురైనట్లు అనిపిస్తుంది. అది కూడా వెంటనే కాకపోయి ఉండవచ్చు. బహుశా చాలా కాలంగా మనసుని తొలిచిన బాధ ఏదో తీవ్రస్థాయికి చేరి షాక్ గా మారిందేమో”
అన్నాను సాలోచనగా.
     “ఎగ్జాట్లీ నాకూ అలాగే అనిపిస్తుంది..సరిగ్గా వారం క్రితం నాతో ఫోన్ లో అరగంట మాట్లాడింది.”
    “ అవునా ఏం మాట్లాడారు..?”
    “ఇప్పుడు నాకనిపిస్తుంది..ఆ మాటల వెనుక ఏదో బాధ. సుజీ.. ఏంటో ఏదోలా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. నాకేదో తక్కువైనట్లు ఇంకేదో కావాలన్నట్టు ..అని.. “
    “ అవునా ఆంటీ అయితే ఏదో బాధపడుతోందన్నమాట! ..” ఏదో క్లూ దొరికిన సంబరం నాలో .
    “ అవును విమలా ! మీ అత్తది చాలా సున్నితమైన మనసు. చిన్నతనం నుంచీ కలిసి పెరిగాం. నేను తనూ డిగ్రీ వరకు చదివాం. డిగ్రీ అయ్యాక చదువు మానేసి పెళ్ళి చేసుకుని సంసారంలో మునిగిపోయింది. నేను పిజి చేసి కాలేజిలో లెక్చరర్ గా మారాను. అయినా తరచూ కలుసుకుంటాం. నేను పెళ్ళయ్యాక మా పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండటంతో అప్పుడప్పుడూ అమెరికా వెళ్లి రావడం వచ్చాక తనను కలవడం జరిగేది. నాతో అంటుండేది.. “చూసావా నేను పాతచింతకాయ పచ్చడిలా ఇక్కడే పడున్నాను. నువ్వేమో బాగా చదివి అన్ని చోట్లకీ వెళ్ళగలుగుతున్నావ్..” అని..
     నేను నవ్వి ఊరుకునే దాన్ని ..కాని సుధ మనసులో పెట్టేసుకుందని అనుకోలేదు.”
    “అంతకుముందు ఫోన్ చేసినపుడు నీకు పరుగెట్టడం వచ్చా ?” అని అడిగింది.
     “ అవునా ఎందుకు “ అడిగాను ఆశ్చర్యంగా..
 నేనూ అడిగాను ..” ఎందుకు సుధా? “ అని.
“మరేం లేదు . నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయనతో కలిసి నడవాలి. ఆయనేమో పరుగులు పెడ్తూ నడుస్తారు. నాకేమో ఆయన్ని అందుకుని నడవగలనో లేదో అనే కంగారు. ఈ గొడవంతా ఎందుకని నేనెక్కడకీ రానంటాను” అంది బాధగా.
     “నువ్వొక్కదానివీ ఎక్కడికీ వెళ్ళవా! ” ఆశ్చర్యంగా అడిగాను నేను.
     “ అబ్బే..నాకేం తెలుసు ? నేనెక్కడికీ వెళ్ళను.ఆయనో పిల్లలో తీసుకెళ్తేనే ..” ఖచ్చితంగా అనేసింది సుధ.
    “ తనకు తాను ఓ గిరి గీసుకుంది. నేనిలా ఉంటాను. నేనింతే అని…ఆ తర్వాత కొంచమైనా మారే ప్రయత్నం చేయలేదు. మారాలని తెలిసినా మారితే నేనూ మారిపోయినట్లే నేను ఇలాగే ఉండాలి కదా అని తనకు తానే నిర్ణయించేసుకున్నట్లు నాకనిపించింది.అప్పటికి చాలా సార్లు చెప్పాను. మారిన మనుషులతో నువ్వూ మారు. కలివిడిగా తిరుగు ..నీకేం రాదు అనుకోకు” అని సర్ది చెప్పాను.
    “ నా వల్ల కాదు బాబు “ అనేసేది…నిట్టూరుస్తూ చెప్పారు సుజాత ఆంటీ.
    మూడోరోజు ఎక్కించిన సోడియం పనిచేసి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అందరినీ గుర్తు పట్టగలిగింది..కానీ నీరసంగా కళ్లు మూసుకుని పడుకుంది.
    మేఘన రాగానే నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. మళ్ళీ శని ఆదివారాలలో రాగలనని వచ్చేసాను.
    శనివారం ఎప్పుడొస్తుందా సుధత్తని ఎప్పుడు చూస్తానా అని మనసు కొట్టుకుంటుంది. సుజాత ఆంటీని కూడా రమ్మని తిరిగి మేమంతా శనివారం చూడడానికి వెళ్ళాం.
    ఆశ్చర్యం … గదిలోకి వెళ్ళగానే సుధత్త మమ్మల్ని ఇద్దరినీ గుర్తుపట్టింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుండగా ఇంకో షాక్ ..
     “ ఏంటి ఇలా వచ్చారు..” ఎదురు మమ్మల్ని ప్రశ్నించింది. వెంటనే ఇద్దరం అత్త చేయి పట్టుకున్నాం.
    “ హమ్మయ్య మా అత్త మా లోకంలోకి వచ్చేసింది”..అంటూ.
    మేఘన తర్వాత చెప్పింది. కొద్దిగా మార్పు వచ్చింది కానీ అది ఎక్కువ సేపు ఉండడం లేదని..
     ఏదైతేనేం చాలా బెటరనిపించింది..
      “ సుధా.. పడుకున్నావేం ..లే.. పరుగెడదాం”  అంది నవ్వుతూ..
     సుధత్త ఆంటీ కళ్లలోకి తదేకంగా చూసి..
“ అమ్మో ..నాకు భయం “ ముడుచుకు పోయింది.
      సరైన మందులు ట్రీట్ మెంట్ తో సుధత్త త్వరత్వరగా తేరుకుంది. సుజాత ఆంటీ సుధత్తలా నాకు చేరువైంది. దాదాపు నెల తర్వాత ముగ్గురం కలుసుకున్నాం. అప్పుడు చెప్పింది సుధత్త.
                    *     *    *     *     *
     “ సుధా.. ఎక్కడున్నావ్..టిఫిన్ పెట్టడానికి ఎంత సేపు? ..” అరిచాడు రమణారావు.
     “వస్తున్నానండి..” భయం భయంగా ప్లేటు, స్పూన్ వెతుకుతూ గడగడలాడుతూ పెట్టింది టిఫిన్.
    “ అమ్మా నా గ్రీన్ కలర్ షర్ట్ ఎక్కడ?” లోపలినుంచి అరుస్తున్నాడు నవీన్.
    “ ఒరేయ్ ఉండరా వస్తున్నా..”కంగారుగా లోపలికెళ్ళింది సుధ.
    “ అల్మారా లో చూడు అదిగో..ఆ పైనే..ఇక్కడే ఉండాలే...” కంగారుగా వెదకసాగింది.
     “ నువ్వంతే నమ్మా నీకేమీ రాదు..ఎక్కడ పెడతావో గుర్తుంచుకోవు..” విసుక్కున్నాడు నవీన్.
     “ ఇదిగో ఇక్కడ పెట్టి అక్కడంటావ్..”
     “మీ మమ్మీకి ఏది సరిగ్గా చేతకాదు అదంతే ..నువ్వొదిలేయ్..” విసుక్కున్నాడు రమణారావు.
    “ సరే సాయంత్రం పార్టీకి రడీయా ..త్వరగా వచ్చేయాలి..” నవీన్ హడావిడిగా బయలుదేరాడు.
     “ చూడు అసలే వాడి ఫ్రెండ్ వాళ్ళ పార్టీ ఊరిదానికి మల్లే తయారవక..మేఘననో రజనీనో అడిగి ఏం చీర కట్టుకుంటావో చూస్కో..అర్థమయిందా..” వార్నింగ్ ఇచ్చాడు రమణారావు.
                   *   *  *   *   *
ఇది నా జీవితంలో మచ్చుకి ఓ ఉదయం..నాకు ఏమీ రాదు, తెలియదు అని తేల్చేసుకుని వారికి వారే తీర్మానించుకున్నారు.  అప్పటినుంచీ ఇదే వరస..దాదాపు పెళ్ళయిన తర్వాత నుంచీ భయం భయంగానే గడిచింది నా జీవితం.
ఏ నిర్ణయం నేను తీసుకోలేను. ..కాదు కాదు..తీసుకోకూడదు. ఏమీ తెలియదని నాకో పేరు పెట్టేసారు.
      అప్పటి నుంచీ నాకు ఏం చేయాలన్నాభయమే. ఏం తప్పు చేస్తానో..ఎవరేమంటారో..భయం.  నా చేత ఏది చేయించరు.. నేర్పించరు..రాదని మాత్రం తేల్చేస్తారు..
    మొన్నటికి మొన్న అల్లుడు సుధీర్ వాళ్లింటికి వెళ్ళాం..అక్కడ “ మా అమ్మకేం రాదాంటీ.. అసలేం తెలీదు.. తనంతే..” అదేదో గొప్పవిషయంగా నాకూతురు నా గురించి చెప్తుంది.
    ఎక్కడో కలుక్కుమంది.. నాకేది రాదని తీర్మానించిన వీరంతా నాకేం వచ్చో గుర్తించారా? నా చేత చేయించే ప్రయత్నాలు చేసారా? నాకు బొమ్మలు వేయడం, చేయడం వచ్చు..పాటలు వచ్చు.. ఇంటిపనులన్నీ వచ్చు..కానీ ఏదీ రాదనే ముద్రవేసి ఎవరికి తోచింది వాళ్ళు చేసేసుకుంటున్నారు..ఈ మధ్యలో నాలాంటి వాళ్ళు ఎంత నలిగిపోతారో తెలుసా..?” ఆవేశంతో మాట్లాడుతున్న అత్త కళ్లనిండా నీళ్ళు..
    వెంటనే అత్త భుజం మీద చేయి వేసాను.
    “ అత్తా ప్లీజ్ “ అంటూ..
    “ ఆ రోజే సుజీ నీకు ఫోన్ చేసాను.. నాకెందుకో చాలా ఒంటరితనంగా అనిపించింది. తలంతా గిర్రున తిరిగినట్లయింది…ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. “ తల వంచుకుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుంది.
     కాసేపటికి మామూలుగా అయి వంటింట్లోకి వెళ్ళింది.
    మరి కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చానే కాని సుధత్త మాటలు చెవుల్లో హోరుమంటూ వినిపిస్తున్నాయ్.
    ఒక వయసు వచ్చాక పిల్లలు పెద్దయి పెళ్ళిళ్ళయాక అమ్మంటే అడిగింది అమర్చిపెట్టే బొమ్మనుకునే పిల్లలు, భార్యంటే చేతికి అన్నీ అందించేదని భావించే భర్తలు, మనం ఏ పనులు వారి చేత చేయించుకోవచ్చో అంచనాలు వేసుకుని అమలు పరిచే యంత్రాలుగానే మార్చేసిన లోకం మనది. అందులో సుధత్త ఒకరేనా ? సుధత్తలాంటి స్త్రీలు ఎందరు ? నా మనసుని ప్రశ్నలు తొలిచేస్తున్నాయి.
     మధ్య రాత్రి నిద్రలో వచ్చిందో సందేహం.. ఇన్నేళ్ళకి సుధత్త నోరు విప్పింది.. మరి నోరు విప్పని సుధలెందరో …!
 

 

మరిన్ని శీర్షికలు
evaru goppa