Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rekkalu vippina mounam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎవరు గొప్ప? - ..

evaru goppa

అనగనగా కౌసింబీ రాజ్యాన్ని ధర్మానందుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య భాగమతీ దేవి. ఆ రాజ దంపతులకి ఇరువురు సంతానం.  సురేంద్ర , సురభి.  వీరు కవల పిల్లలు.  కుమార్తె అనే బేధభావం చూపక సురభిని  కుమారుడితో సమానంగా పెంచాడు ధర్మానందుడు.  

పిల్లలు ఇరువురూ అందంగా ఉండేవారు కానీ సురభికి పుట్టుకతోనె  చిన్న అంగవైకల్యం బయటపడింది. అది రాజ దంపతులను కొంత మనస్థాపానికి గురిచేసింది.

పిల్లలు ఇరువురూ సకల శాస్త్రాలూ క్షుణ్ణంగా నేర్చి, అన్ని విద్యలలోనూ ప్రావీణ్యతను పొంది ప్రజలందరిచేతా మన్ననలు అందుకున్నారు.
ఎన్నో సంవత్సరాలు కౌసింబీ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించిన రాజు ధర్మానందుడు  వృద్ధాప్యం పైబడడంతో  ఇక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆనవాయితీ ప్రకారం రాజ్యభారం మగ పిల్లవాడికే చెందాలన్నది నియమం. కానీ కుమార్తెను తక్కువగా చూసి అన్యాయం చేయడానికి మనసు ఒప్పలేదు ధర్మానందుడికి. ఇరువురూ అన్నిటిలో ఉన్నతులే కనుక  రాజ్యభారం ఎవరికి అప్పగించాలా అనే సందిగ్ధంలో పడ్డాడు.  
అందుచేత ఒకనాడు  తనకు ఆంతరంగికులైన కొంతమంది  మంత్రులను సముఖానికి పిలిపించాడు ధర్మానందుడు.  

‘మంత్రులారా నాకు వయసు మించిపోయింది. ఇక రాజ్య భారాన్ని మోయలేకున్నాను. కనుక పిల్లలకు ఈ బాధ్యత అప్పగించుదామని అనుకుంటున్నాను. కాని ఎవరికి ఈ అధికారం అప్పగించాలో తెలియడం లేదు’

‘అందులో సందేహమేమున్నది ప్రభూ? రాజ్యానికి కాబోయే రాజు సురేంద్ర కుమారుడే కదా?’  అన్నాడు మంత్రులందరిలోకీ పెద్ద మహా మంత్రి  విజయుడు

‘సురేంద్ర సురభి అన్నిటా సమానులే. ఆడపిల్ల కదా అని తక్కువ చూసి కుమార్తెకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు.’
‘కానీ ప్రభూ......’

‘ఈ విషయంలో నా నిర్ణయానికి  తిరుగులేదు. కానీ రాజ్యాధికారాలు చేపట్టడానికి ఎవరు అర్హులో ఇరువురిలో ఎవరు గొప్పవారో  అని నిర్ణయంచడంలో మీరు ఏమైనా సలహా ఇవ్వగలరేమో అని ఈ సమావేశం ఏర్పాటుచేసాను’

‘ప్రభూ నాకొక మార్గం తోచింది’ అన్నాడు విజయుడు

‘చెప్పండి మహా మంత్రీ’

‘తమ  రాజ్యానికి కాబోయే రాజుని ఎన్నుకునే ప్రక్రియలో ఈసారి ప్రజలను కూడా భాగస్వాములను చేద్దాము’

‘ప్రజలనా?’

‘అవును ప్రభూ!’

‘అదెలా?’

‘ఇందుకుగాను రెండంచెల కార్యక్రమం రూపొందిద్దాము. ముందుగా సకల విద్యలలోనూ ఇరువురి ప్రావీణ్యత నిరూపణకై కొన్ని పరీక్షలు నిర్వహించుదాము. ఆ పరీక్షలలో వారి నైపుణ్యానికి తగినట్లు గణాంకాలను కేటాయిద్దాము.
‘ఆ తరువాత?’
‘రాజ్యంలో వాడ వాడకూ ప్రతినిధులను ఏర్పాటు చేసి,  రాకుమారి , రాకుమారుడు ఇరువురిలో తాము ఎవరిని  రాజుగా కోరుకుంటున్నారో, ఎందుకు కోరుకుంటున్నారో  నిష్పక్షపాతంగా , ముఖతః  ఆయా ప్రతినిధులకు తెలుపవలసినదిగా ఒక ప్రకటన చేయిద్దాము. అలా ప్రతినిధులు సేకరించిన ఆ సమాచారానికి కూడా కొన్ని గణాంకాలను కేటాయిద్దాము’  
‘అందువల్ల?’
‘కౌసింబీ  రాజ్యాధికారాన్ని చేపట్టడానికి  అర్హత కలిగిన  వ్యక్తి ఎవరో అనే విషయంలో ప్రజాభీష్టం కూడా తెలుస్తుంది’  
’ఆ తదుపరి?’
‘రెండు పరీక్షలలో ఎవరు అధిక గణాంకాలు సాధిస్తారో  వారికే రాజ్యాధికారాన్ని ఒప్పగిద్దాము’   
‘భేష్! మహా మంత్రీ! భేష్ ! అతి చక్కటి సలహా. తప్పక అమలు చేద్దాము. ఈ విషయం రాకుమారుడికి, రాకుమారికి నేను తెలియజేస్తాను. రాజ్యంలో ప్రకటన వేయించి ప్రజలకు ఈ వార్త అందేలా చూసే బాధ్యత మీదే మహా మంత్రీ’ అని సభ ముగించి వెళ్ళబోతూ ‘మహా మంత్రీ ‘ అని పిలిచాడు ఆనందవర్మ .
‘ప్రభూ!’
‘ఈ ప్రక్రియలో అవకతవకలు జరుగకుండా చూడవలసిన బాధ్యత మీ మంత్రులందరికీ అప్పగిస్తున్నాను. ’
‘చిత్తం ప్రభూ ఆజ్ఞ’  
ఆ తదుపరి జరగాల్సిన పనులన్నీ మహా మంత్రి ఆధ్వర్యంలో  చక చకా  జరిగిపోయాయి. రాజ్యంలో నూతన రాజుని ఎన్నుకునే ప్రక్రియ గురించి ప్రకటన వెలువరించబడింది.
ఆచార ప్రకారంగా ప్రస్తుతం పరిపాలిస్తున్న మహారాజు తదనంతరం రాకుమారుడే కాబోయే రాజు అని అనుకుంటున్న ప్రజలకి ,  అందుకు భిన్నంగా ఈసారి తమ రాజుని తామే ఎన్నుకోబోతున్నామన్న వార్త  వారిలో క్రొత్త ఉత్సాహాన్ని నింపింది.
ధర్మానందుడు  తన సంతానానికి విషయమంతా విశదీకరించాడు .
తండ్రి నిర్ణయం విన్న రాకుమారుడు సురేంద్ర నిర్ఘాంతపోయాడు. కానీ తండ్రికి ఎదురుచెప్పే సాహసం చేయలేకపోయాడు.
అయినా సురేంద్రకి తన సోదరి సురభికి అంగవైకల్యం ఉన్నది కనుక ఆమె  కంటే అన్నిటా మిన్న తానే అని ,  తానే రాజునవుతాననే ధీమా కలిగింది.   
సురభికి  తండ్రి నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. తనను సోదరునితో సమానంగా చూడగలిగిన తండ్రి ఔన్నత్యానికి ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.
నిర్ణయించిన  ప్రకారం ముందుగా సకల శాస్త్రాలలో పోటీలు ఆ తదుపరి  ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రెండు పరీక్షలలో గణాంకాలను  క్రోడికరించిన మీదట కౌసింబీ  రాజ్యాధికారాన్ని రాకుమారి సురభికి  అప్పగిస్తున్నట్లు ప్రకటించాడు మహారాజు ధర్మానందుడు.
అప్పటివరకూ అన్నిటాతానే గొప్పవాడిననీ, తానే తప్పక  రాజు అవుతానని కలలు కంటున్న సురేంద్ర ఈ వార్త  విని ఖంగుతిన్నాడు.
ఆవేశంగా తండ్రి వద్దకు వెళ్ళి ‘తండ్రీ ఇందులో ఏదో కుట్ర జరిగింది. విద్యలన్నిటిలోనూ  ఇద్దరమూ సమానంగా నిలిచినప్పటికీ సోదరి సురభికి అంగవైకల్యం ఉన్నది కనుక ఆమె రాజ్యాధికారాన్ని చేపట్టడానికి అనర్హురాలు. అందుకని ఆమెకంటే నేనే గొప్ప. అలాంటప్పుడు ఆమెకు  రాజ్యమెలా కట్టబెట్టగలరు?’   అని ప్రశ్నించాడు
ఆవేశపూరితుడైన సురేంద్రను దగ్గర కూర్చోబెట్టుకుని సురభిని కూడా సముఖానికి పిలిపించాడు మహా రాజు
 ‘మీరిరువురూ అన్నిటా సమానులే అని నాకు తెలుసు కనుకనే ఎవరిని రాజు చేయాలో తెలియక ఈ విధంగా చేయవలసి వచ్చింది.  ఇది ప్రజా నిర్ణయం. ఇక ఇరువురూ వినండి మీగురించి ప్రజలేమన్నారో ..........
‘రాకుమారుడు, రాకుమారి అన్ని విద్యలలోనూ సమానులే అయినప్పటికీ రాకుమారునికి   అహంకారం, తోటివారిపట్ల  చులకన భావం ఉన్నాయి. రాకుమారి సురభి అంగవైకల్యం ఉన్నప్పటికీ బహు వినయశీలి, దయార్ద్ర హృదయురాలు. కనుక మా దృష్టిలో రాకుమారే  గొప్ప. మా రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన అన్ని లక్షణాలూ రాకుమారి సురభికి ఉన్నాయి’
...అని ప్రజాభిప్రాయం  తెలియజేశాడు .
అది విన్న సురేంద్ర  ‘తండ్రీ నన్నుక్షమించండి. నేను గొప్పవాడిననే అహంతో  సోదరిని   ఇన్నాళ్లూ  చిన్నచూపు చూసాను . నిజానికి నాకంటే సోదరే అన్నిటా గొప్ప.  నా పొరపాటు తెలియవచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాను’
‘సోదరీ సురభీ! నన్ను మన్నించు. స్త్రీ వి అయినప్పటికీ, అంగవైకల్యం ఉన్నప్పటికీ  ఈ రాజ్యాన్ని ఏలవలసిన వ్యక్తికి  ఉండవలసిన గొప్ప లక్షణాలు అన్నీ మెండుగా  ఉన్నాయి నీకు’ అని సోదరిని  మనసారా అభినందించాడు సురేంద్ర.  
ఒక శుభముహూర్తాన మహారాజు ధర్మానందుడు  కుమార్తెకు రాజ్యాభిషేకం చేసి  రాజ్యభారం అప్పగించాడు. సోదరుడు సురేంద్ర సహాయ సహకారాలు, సలహాలతో కౌసింబీ రాజ్యాన్ని   ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించింది రాకుమారి సురభి.   
                *****సమాప్తం*****

 

మరిన్ని శీర్షికలు
Bendakaya Pulusu - Easy Method