Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pancharatnalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కేరళ తీర్థయాత్రలు విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

(  కొచ్చిన్ )

కొచ్చిన్ లో డాల్ఫిన్స్ ని చూడ్డానికి తప్పకుండా వెళ్లాలి . పగలు తొమ్మిది లోపున వెళ్లి వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకుంటే మంచిది . ఇలాంటి వాటికి మొత్తం పడవకి యింత అనివుంటుంది కాబట్టి రెండుమూడు కుటుంబాలు కలసి వెళితే మంచిది .        చక్కగా అలంకరించిన బోటులో మెత్తటి పరుపులపై హాయిగా సేదతీరుతూ కూర్చొని సముద్రంలో ప్రయాణించడం బాగుంటుంది . డాల్ఫిన్స్ సాధారణంగా నది సముద్రం కలిసే చోట యెక్కువగా తిరుగుతూ వుంటాయి . మోటారు శబ్దాలకి దూరంగా వుండడానికి యిష్టపడతాయి , అందుకే బోటువారు మోటారు ఆపి వేసి నిశ్శబ్దంగా వేచివుంటారు , సూర్యరశ్మి కాస్త వెచ్చపడతూవుండే సమయానికి అంటే 7 నుంచి 8 మధ్య యివి గుంపులుగా ఒకదానినొకటి తరుముతూ వస్తున్నట్లు గా వస్తాయి , సగం నీటిపైన సగం నీటిలోన వుండే విధంగా చాలా వేగంగా నీటిలో కదులుతూ కనిపిస్తాయి . అభయారణ్యాలలో అడవి జంతువులను చూడడం , సముద్రంలో సముద్ర జీవులను చూడడం ఒకగొప్ప అనుభూతినిస్తాయి .

కొచ్చిన్ కి 53 కిలోమీటర్ల దూరంలో వున్న పట్టణం ‘ అలెప్పి ‘ , అలపూజ అనికూడా అంటారు . ఈ పట్టణం విద్యావ్యాపార కేంద్రంగా బాగా పేరుపొందింది .కేరళా లో అలెప్పి చూడకపోతే కేరళాలో యేమీ చూడనట్లే , బీచ్ లు , బేక్ వాటర్స్ , బోట్ హౌసులు , అడవులు కొండలు అన్నీ వున్న ప్రదేశం . ఎక్కువగా వాన పడే ప్రాంతం కావడంతో చాలా పచ్చగా వుంటుంది . దీనిని ‘ వెన్నిస్ ఆఫ్ యీస్ట్ ‘ అని కూడా అంటారు .

కేరళా లో జరిగే జవహర్ లాల్ నెహ్రూ బోట్ రేస్లు అలెప్పీ లోనే జరుగుతాయి , ప్రతీ ఆగస్ట్ రెండోశనివారం యీ రేసులు నిర్వహిస్తారు , ఒకసారి అనుకోకుండా ఆగస్టు రెండో శనివారం అక్కడ వుండడం జరిగింది . ఈ రేసు  ‘ పున్నమడి ‘ సరస్సు లో జరుగుతాయి , సముద్రమేనేమో అనిపించింది , సరస్సు అని చెప్తేకాని తెలీదు .బోటు రేసు మొదలయేది సాయంత్రం అయినా ప్రొద్దున్న నుంచే హడావిడి మొదలయింది అలెప్పీ లో , చాలామంది విదేశీయులు యీ రేసులు చూడ్డానికి వచ్చేరు . బోటు వాళ్ల హడావిడీ మొదలయింది . ముందు వరుసలో వున్న బోటులకి గిరాకీ యెక్కువయింది , ప్రొద్దుటనుంచి టీ భోజనాలతో సాయంత్రం వరకు వుండేందుకు బేరం చేసుకొని ముందు వరుస బోటులో కూర్చున్నాం , బోటు మూడంతస్థులు , పైన డెక్క్ వున్నాయి , మధ్యాహ్నం సీ ఫుడ్ తో ఉప్పుడు బియ్యం అన్నం తో విందు భోజనం , అందులో పెరుగు లేదు ,కేరళ హోటల్స్ లో పెరుగు యివ్వరు , మామూలు బియ్యం అన్నం కావాలంటే పెద్ద రెస్టారెంట్స్ లో ముందుగా చెప్పుకుంటే కొందరు వండుతారు లేదంటే ఉప్పుడు బియ్యంతోనే సరిపెట్టుకోవాలి , శరవన భవన్ వుంటే అక్కడ మామూలు భోజనం దొరుకుతుంది .

మేం ఆరోజు బిస్కెట్స్ తో సరిపెట్టుకున్నాం , యేవో స్నేక్స్ చేసేరు కాని అవీ సీ ఫుడ్ వి అవడంతో మేం ఒక్క టీ తో సరిపెట్టుకున్నాం . మధ్యాహ్నం తోనే ఒక్కొక్కరూ డెక్క్ మీదకి చేరుకోసాగేరు , నేను కూడా డెక్క్ మీదకి చేరుకున్నాను , కొన్ని ట్రయల్స్ తరువాత సెమీ ఫయనల్స్ , ఫయనల్స్ జరిగేయి , మొదటిమారు ఒక నేషనల్ లెవల్ యీవెంట్ ని చూడడం , అదీ వాటర్ స్పోర్ట్ చాలా ఉత్సాహంగా చూసేను , ఆ సారి మొదటసారి మహిళా సైలర్స్ పాల్గొని ఫైనల్స్ కి చేరడం అది నేను చూడ్డం చాలా నచ్చింది , ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తరువాత విదేశీయులని చూసి యెంత టేన్ గా అయిపోయేరో అనుకున్నాను గాని నేనెలా అయేనో అనుకోలేదు , మర్నాడు అద్దంలో చూసుకుంటే తెలిసింది నేనెంత టేన్ గా అయేనో . శరీరం రంగు మారుతుందని కేరళ లో తిరగడం మనీలేంకదా ? .

అలెప్పీ లో ముల్లకల్ దేవి కోవెల కూడా చూడదగ్గదే , మొత్తం కేరళా స్టైల్ లో కట్టబడిన మందిరం చుట్టూరా పెద్ద వరండాలా వుండి అంటే మన పాత యిళ్లలా చుట్టూరా మండువా మధ్య వాకిలి , వాకిలి మధ్యలో గర్భగుడి , కోవెల చుట్టూరా ప్రహారీగోడ లోపల పెద్ద మల్లెవనం , మల్లెవనంలో ఉన్న అమ్మవారు కాబట్టి ముల్లకల్ దేవీగా పిలువబడుతోందీ అమ్మవారు , కేరళలో చాలామటుకు పెద్ద మందిరాలలో ఏనుగలతో సేవ చేయించడం , అమ్మవారి అభిషేకానికి నీరు తీసుకురావడం మొదలయిన పనులకు వినియోగిస్తారు . ఈ అమ్మవారి సేవలో రెండు ఏనుగలు వున్నాయి . వినాయకుడు , కుమారస్వామి , నాగరాజులకు ఉపమందిరాలు వున్నాయి , కోవెలలో వున్న రావిచెట్టు క్రిందన శివలింగం వుంటుంది

ఈ మందిరం అంతా కొత్తగా వుంటుంది , కోవెల 500 సంవత్సరాల పూర్వంది , విగ్రహం కూడా కొత్తగా వుంటుంది విషయం కనుక్కొంటే యిప్పుడున్న విగ్రహం 1960 లో ప్రతిష్టించేరట , అంతకు ముందు వున్న విగ్రహం బీటలువారిపోతే కొత్తవిగ్రహ ప్రతిష్ట చేసేరట .

500 సంవత్సరాలకి పూర్వం ముస్లిం పరిపాలకులకాలంలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు వారి కులదేవి తో సహా మలబారు తీరం నుంచి వచ్చి మల్లివనం అమ్మవారి కోవెలకు అనువుగా వుంటుందని భావించుకొని యిక్కడ అమ్మవారిని ప్రతిష్టించేరట , ఆ విగ్రహాన్ని 1960 లో మార్చేరు .

అలెప్పి లో  అంబలప్పుఝ క్రిష్ణ మందిరం , సెయింట్ ఆండ్రూస్ బెసిలిక , అరత్తుంకల్ , మన్నారు శాల మందిరం , చెట్టికులంగారదేవీ మందిరం  , హరిపాద శ్రీ సుభ్రమణ్య స్వామి కోవెల , కృష్ణాపుర భవనం , తకఝి ధర్మసంస్థ మందిరం , పదనిలం పరంబ్రహ్మ కోవెల , ఈదత్తువ చర్చ చూడదగ్గవి , అయితే మేం  అన్నీ చూడలేదు , చూసినవాటిగురించి వివరిస్తాను .

అంబలప్పుఝ క్రిష్ణ మందిరం——

అలెప్పినుంచి సుమారు 16 కిలోమీటర్లదూరంలో వున్న అలప్పుఝ అనే గ్రామంలో వుందీ మందిరం . ఇక్కడ కృష్ణుడు పార్థసారథిగా భక్తులకు దర్శనమిస్తాడు . ఒకచేత ఛర్నాకోల , మరో చేతిలో శంఖం ధరించి వుంటాడు .  ఈ కోవెల కూడా కేరళ స్టైల్ లో వుంటుంది , బంగాళా పెంకు కప్పిన పైకప్పు , పెద్ద ప్రాకారంలో ఒకవైపు పుష్కరిణితో వుంటుందీ కోవెల . ఈ కోవెలలో ప్రతీరోజూ స్వామికి బియ్యంతో చేసిన పరమాణ్ణం నైవేద్యంగా సమర్పిస్తారు . ఇక్కడ మొక్కుతీర్చుకోడం కూడా పరవాణ్ణం రూపం లోనే చేస్తూ వుంటారు . దేవుని దర్శనం క్యూకన్నా ప్రసాదం క్యూ పెద్దదిగా వుంటుంది . కోవెల స్థలపురాణం తమాషాగా వుంటుంది , ఆ కథ మనం చాలా మార్లు విన్నాం గాని ఆకథ యీ కోవెలకు సంబంధించినదని తెలీదు .ముందుగా యీ కోవెలలో జరిగే నిత్య పూజ గురించి వివరిస్తాను , అన్ని మందిరాలలాగానే ప్రాతఃకాలంలో అభిషేకాదులు నిర్వర్తిస్తారు , నైవేద్యం మాత్రం కృష్ణనితోపాటు అయ్యప్పకి కూడా పెడతారు . దానికి పూజారులు తెప్పిన చిన్న కధ మీకు కూడా తెలియజేస్తాను . టిప్పుసుల్తాను కాలంలో వారి సైనికులు అనేక హిందూ మందిరాలను నేలకూల్చగా శబరిమలైలో వున్న అయ్యప్ప విగ్రహాన్ని యీ కోవెలలో 12 సంవత్సరాలు దాచి పూజనైవేద్యాలు చేసేరట , అందుకని అయ్యప్ప యిక్కడ నైవేద్యం స్వీకరించడానికి ప్రతిరోజూ వస్తాడని పూజారుల నమ్మకం అందుకే నైవేద్యం అయ్యప్పకి కూడా చేస్తారు .

ఇక స్థలపురాణానికి వస్తే సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం యీ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి చదరంగం ఆట యెంతో యిస్టమట , ఆ ఆటలో అతనిని ఓడించేవారు ఆప్రాంతాలలోనే ఉండేవారుకాదట , వివిధ దేశాలనుంచి వచ్చిన ఆటగాళ్లు రాజు చేతిలో ఓడిపోయేవారట , ఒకసారి సాక్షాత్తు నారాయణుడు బ్రాహ్మణుని వేషం లో రాజు వద్దకు వచ్చి అతనితో చదరంగం ఆడాలని అడుగుతాడు , దానికి రాజు యెలాగూ తానే గెలుస్తాననే గర్వంతో పందెం యేమిటని అడుగుతాడు , దానికి బ్రాహ్మణుడు ‘ రాజా నేను పేద బ్రాహ్మణుడను , నాకు భుక్తికి కొన్ని ధాన్యం గింజలు చదరంగం గడులలో మొదటిగడిలో ఒకటి రెండవ గడిలో రెండు మూడవ గడిలో నాలుగు ఆతరువాత గడిలో యెనిమిది అలా ముందు గడిలోని వాటివర్గం పక్కగడిలో అలా 64 గళ్లలోనూ ధాన్యం గింజలు యివ్వమని అడుగుతాడు .

పాపం వెర్రిబ్రాహ్మణుడు అతనికి రాజుగారిని కానుకలు అడిగే విధానం కూడా రాదని తలచిన రాజు అతనితో చదరంగం ఆడతాడు , ఏ ఆటలోనైనా మరమాత్మునితో ఆడి గెలిచిన వారున్నారా ? , రాజుకూడా ఓడిపోయేడు . బ్రాహ్మణుని కోరిక ప్రకారం ఒక్కో గడిలో అతను అడిగిన ప్రకారం గింజలు నింపమని భటులకు పురమాయించేడు రాజు సగంగడులుకూడా పూర్తికాకముందే ధాన్యాగారం నిండుకుందనే వార్త రాజుకి చేరింది అప్పుడు రాజుకి వచ్చినది సామాన్య బ్రాహ్మణుడు కాదని బోధపడింది , వెంటనేరాజు బ్రాహ్మణుని కాళ్లపై బడి మహాత్మా మీరెవరు అని అడుగగా నారాయణుడు పార్థశారథి రూపంలో దర్శనమిచ్చి తనుకోరిన కోర్కె యిప్పుడే తీర్చక్కరలేదని , ప్రతీరోజూ బియ్యం, పాలతో పరవాణ్ణం వండి తనభక్తులకు అప్పుతీరేదాక పంచమని చెప్పి అంతర్ధానమయేడు , అప్పటినుండి మందిరంలో వచ్చిన భక్తులకు పరవాణ్ణం పంచుతున్నారు , భక్తులు డబ్బాలు , జగ్గులు , బోటిల్స్ లో ప్రసాదం తీసుకువెళుతూ వుంటారు , అక్కడ తాగడానికి కప్పులలో పరవాణ్నం యిస్తారు . ప్రసాదం యెంతరుచిగా వుంటుందో చెప్పలేను .

వచ్చేవారం ‘ మన్నారు శాల నాగరాజు ‘ కోవెల గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
pratapabhavalu