Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు
జూన్ 28
శ్రీ పాములపర్తి వెంకట నరసింహరావు :  వీరు జూన్ 28, 1921 న లక్నేపల్లి లో జన్మించారు.  భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. రాజకీయాల్లో తీరిక లేకున్నా, తన సాహిత్యకృషిని వదిలిపెట్టలేదు.

 శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ :  వీరు జూన్ 28, 1931 న ధవళేశ్వరంలో జన్మించారు. తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.
బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నారు..

3.శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు :  వీరు జూన్ 28,1935 న కొండపల్లి లో జన్మించారు.  పద్యనాటక పరిమళాలను తెలుగువారికి తన గళంద్వారా, నటనాకౌశలం ద్వారా అందించిన మహానటుడు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

జూలై 1
1.శ్రీ కదిరి వెంకట రెడ్డి :   K. V. రెడ్డి గా ప్రసిధ్ధులు. వీరు జూలై 1 , 1912  న తాడిపత్రి లో జన్మించారు. తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో పలు విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. వీరు  దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశారు. వీరు దర్శకత్వం వహించిన  “ మాయాబజార్ “  ఒక సర్వేలో, భారతదేశంలో నిర్మించిన చిత్రాలలో అత్యుత్తమ చిత్రంగా గుర్తింపబడింది.

2.శ్రీ కె. సభా : వీరు జూలై 1, 1923 న కొట్రకోన లో జన్మించారు.  కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు..

జూలై 3
శ్రీ సామర్ల వెంకట రంగారావు :  S.V.  రంగారావు గా ప్రసిధ్ధి చెందిన వీరు, జూలై 3, 1918 న నూజివీడు లో జన్మించారు. ప్రముఖ సినీనటుడు. మూడు దశాబ్దాలపాటు, తెలుగు, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలదాకా నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్న మహానటుడు.

వర్ధంతులు
జూన్ 29
శ్రీ కమలాకర కామేశ్వరరావు :   పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి.
వీరు జూన్ 29, 1998 న స్వర్గస్థులయారు.

జూన్ 30
శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం :   స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది.
వీరు జూన్ 30, 1953 న స్వర్గస్థులయారు.

జూలై 1
శ్రీ దేవరకొండ బాల గంగాధర తిలక్ :  ఒక ప్రముఖ ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం వీరి రచనల్లో ముఖ్యలక్షణాలు. మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నారు..
వీరు జూలై 1,  1966 న స్వర్గస్థులయారు.

జూలై 2
శ్రీ  బద్దం భాస్కర రెడ్డి :  “ చెరబండ రాజు “ గా ప్రసిధ్ధిచెందిన  విప్లవ కవి. “ఏరోజైనా
ప్రజాపోరాటాల విజయాల్ని రచించకపోతే
ఆరోజు జీవించినట్టుండదు “  అని చెప్పుకునేవారు.
వీరు జూలై 2 , 1982 న స్వర్గస్థులయారు.

 

మరిన్ని శీర్షికలు
weekly-horoscope june 28th to july 4th