Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
trupti

ఈ సంచికలో >> శీర్షికలు >>

మామిడి పూత - ఆర్.సి. కృష్ణస్వామి రాజు

mamidipoota

ఆహ్లాదకర అరణ్యంలో పచ్చటి ప్రకృతి నడుమ శేషాచలం కొండలలోని పాపవినాశన తీర్థం వద్ద  యోగా శిక్షణా శాల వుండేది. స్వామి సూర్యపాద అక్కడ మూడేళ్ళ పాటు శిక్షణ పొంది రఘునాధపురం  గ్రామంలో సేవా దృక్పధంతో యోగా  శిక్షణా శిబిరం  ప్రారంభించాడు. అయితే స్వామి సూర్యపాద ఆశించినట్లుగా జనాలు స్పందించలేదు. సుఖంగా వున్న శరీరానికి లేని పోని కష్టాలు పెట్టడం దేనికని స్వామిని తప్పించుకొని తిరిగేవారు. కొందరు ఆసక్తిగా వచ్చినా కొద్ది రోజుల తర్వాత చేతికి దొరికే వారు కాదు. యోగా అనేది ఒక యోగంగా జనాలు ఎందుకు భావించడం లేదో స్వామికి అర్థం అయ్యేది కాదు. ఏమి చేయాలో పాలుపోక  ఒక పౌర్ణిమ రోజు తన గురువు గౌతమీ పుత్రను కలిసి సలహా తీసుకొందామని  వెళ్ళాడు.

విషయం అంతా విన్న గురువు  రాత్రంతా శిష్యుడిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పినాడు.  ఇద్దరూ ఉదయం లేచి  ఓంకారంలు పలికి యోగ ప్రాణాయామం బంధ ముద్రలు చేసి చిన్న చిన్న వ్యాయామములు చేసి శేషాచలం కొండల్లో నడక ప్రారంభించారు.  దారిలో వారికి ఎంతో భద్రంగా మామిడి అంటు మొక్కలను రైతులు నాటుతుండడం కనిపించింది. కాసేపు అక్కడే నిలబడుకొని గురుశిష్యులిద్దరూ గమనించారు.
మరి కొద్ది దూరం నడిచారు. సుందర జలధార ఆకాశ గంగ తీర్థం వచ్చింది.  మూడేళ్ళ క్రితం అంటు నాటిన బంగినపల్లి మామిడి చెట్లకు  వచ్చి వున్న మొదటి కాపు పూతను రైతులు  పెరికేస్తూ వున్నారు. ఎందుకు పూతను పెరికి వేస్తున్నారని గురువు గౌతమీ పుత్ర అడిగాడు. ప్రకృతి నియమాలను మనం గౌరవించాలి . వాటిని పెరికి వేయకపోతే, చెట్టు పుష్టిగా ఎదగదు. అలా పుష్టిగా ఎదగాలంటే ఇలా పూతను పెరికేయాలని రైతులు వివరించారు.

మరి కొద్ది దూరం నడిచారు. గోవు పొదుగు ఆకృతిలో వుండే  గోగర్భ తీర్థం  వచ్చింది. అక్కడ నాలుగేళ్ళ క్రితం నాటిన అంటు మామిడి చెట్ల కాపును రైతులు పిందె దశలోనే తుంచి వేస్తూ వున్నారు. పిందెలను ఎందుకు తుంచి   వేస్తున్నారని గురువు గౌతమీ పుత్ర ప్రశ్నించాడు. పిందెలను పెరికివేస్తేనే భవిష్యత్తులో ఫలితాలు మంచిగా వస్తాయన్నారు.  అలా తుంచి వేయక పోతే చెట్లు ఎగబడి రావని బదులిచ్చారు. అన్నీ ముందుగానే అనుభవించేయాలని అనుకోవడం అవివేక మన్నారు.

నడుచుకొంటూ వెళుతుంటే జాబాలి మహర్షి ఘోరమైన తపస్సు చేసిన జాబాలి తీర్థం వచ్చింది. అయిదేళ్ల క్రితం నాటిన చందూరం మామిడి తోట మంచి పక్వానికి వచ్చి వుంది. మామిడి కాయలు మిల మిలా మెరుస్తూ కనిపించాయి. పండించిన రైతు కళ్ళల్లో మెరుపు కనిపించింది.
గురుశిష్యులిద్దరూ  జాబాలి తీర్థంలో స్నానం చేసి అక్కడ వెలసి వున్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు.తీర్థం గట్టున కూర్చొని గురువు ఇలా చెప్పాడు “శిష్యా! మామిడి తోటల పెంపకం చూశావు కదా,ఎంతో ఓపికగా వ్యవహరిస్తేనే మామిడి చెట్టు మంచిగా ఎదుగుతుంది. అలా ఎదగడానికి నీళ్లు పోసి కంచె కట్టి ఎరువులు వేసి రెండు మూడేళ్ళ పూతను, పిందెలను వదిలేసి కాపాడుకొంటే రైతుకు మామిడి చెట్లు మిగులుతాయి. కనీసం అయిదేళ్ళు అయినా జాగ్రత్తలు తీసుకొంటే కానీ చెట్లు పక్వానికి రావు.  అశ్రద్ధ చూపిస్తే  చెట్టు దెబ్బ తింటుంది.  అలాగే యోగా శిక్షకులైన మనం ప్రజల పట్ల ఎంతో ఓపికగా వ్యవహరించాలి. ప్రజలు వారి వారి దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమై  ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ చూపరు. అలా శ్రద్ధ చూపే ఎరుకను మనం వారికి తెలియచేయాలి.

యోగా చేయడానికి సమయం లేదని  కొందరు తప్పించుకొనే ప్రయత్నం చేస్తారు. అలా చెప్పేవారికి  పొయ్యి  వెలిగించడానికి సమయం లేదంటే పొయ్యి మీది బియ్యం ఎలా ఉడుకుతాయని ప్రశ్నించాలి. రోజులో కాసేపైనా వారికోసం వారు కొంత కాలం వెచ్చిస్తే  వైద్యశాలలకు వెళ్లే శ్రమ తప్పుతుందని నచ్చ చెప్పాలి. యోగాను వారు కష్టపడి కాక ఇష్టపడి నేర్చుకొనేట్లుగా మనం వారిలో ఆసక్తి కలిగించాలి.

మనం కూడా వారు వచ్చిందే అన్నీ వారికి నేర్పించేయాలని ప్రయత్నించకూడదు.  దానివల్ల మొదట్లోనే  వ్యవహారం బెడిసి కొడుతుంది. అలా చేస్తే అన్న ప్రాస నాడే బిడ్డకి ఆవకాయ పెట్టి నట్లుంటుంది. చిన్న చిన్నగా మనిషిని బట్టి వారి శారీరక మానసిక సామర్ధ్యాలను బట్టి బోధనలు చేయాలి. యోగా ద్వారా లభించే అలౌకిక ఆనందాన్ని వారు ఆస్వాదించడం ప్రారంభిస్తే వారు మనల్ని అనుసరిస్తారు.జన హితం కోరే మనం యోగా పట్ల ప్రజలకు అవగాహన కల్పించడాన్ని ఒక యజ్ఞంగా భావించాలి. అప్పుడే మనం విజయవంతమవుతాము” అని హిత బోధ చేశాడు.

శిష్యుడు స్వామి గురుపాదకు విషయం అర్థమయ్యింది. గురువుకు పాద నమస్కారం చేసి  సెలవు తీసుకొని రఘునాధపురం వెళ్లి చిన్న చిన్నగా యోగా గురించి ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించి ఊరి జనాలనంతా ఆరోగ్యవంతులను చేశాడు.

మరిన్ని శీర్షికలు
Bendakaya Pulusu - Easy Method