Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope june 28th to july 4th

ఈ సంచికలో >> శీర్షికలు >>

తృప్తి. - పొత్తూరి విజయలక్ష్మి

trupti

 అది ఒక ఫంక్షన్ హాల్  .అక్కడ చిన్నవి పెద్దవి కలిపి నాలుగైదు హాళ్లు ఉన్నాయి.ఒక హాల్లో శ్రీహిత ఒణీల ఫంక్షన్ జరుగుతోంది.
 తండ్రి  శ్యాంసుందర్ ఎన్ఆర్ఐ. పాతికేళ్ల కిందట అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డాడు.అతని భార్య కూడా మంచి ఉద్యోగం చేస్తోంది.
  బాగా సంపాదించారు.

ఒక్కతే కూతురు.  ఇండియా లో అందరినీ పిలిచి ఘనంగా ఏదైనా వేడుక చెయ్యాలని అతని మనసులో ఎప్పటి నుండో కోరిక. అందుకే ఎండాకాలం కాకుండా మంచి సీజన్లో ఇండియాలో ఈ వేడుక తలపెట్టాడు.

మూడు నెలల ముందు నుంచి బంధువులందరికీ మెసేజ్లు పెట్టి  ఫోన్ లు చేసి  మరీ మరీ రావాలని చెప్పాడు.అక్కడి నుంచే ఆన్లైన్లో అన్ని ఏర్పాట్లు చేసేసాడు.ఫంక్షన్ కి 15 రోజుల ముందర వచ్చారు. ఇక్కడ షాపింగ్. పిల్లకు  వజ్రాల నగలు  కొన్నారు .

ఇక్కడికి వచ్చాక ముఖ్యమైన వాళ్ళను స్వయంగా వెళ్లి పిలిచి వచ్చారు. మిగిలిన వాళ్లకు మళ్లీ ఫోన్లు చేశారు. మొత్తానికి బంధువులందరూ అతని ప్రేమకు ఆనందపడిపోయారు. దూరాన ఉన్నా ఇక్కడ  వాళ్ళను మర్చిపోలేదు అని  సంతోషించారు. ఎలాగైనా సరే శ్యామ్ ఇంట్లో  వేడుకకు వెళ్ళి తీరాలి అనుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది . ఓణీ ల వేడుకే అయినా పెళ్లి  స్థాయి లో వుంది. బయట లాన్లో భోజనాలు.  బఫే. మధ్యలో బల్లలు వాటి చుట్టూ కుర్చీలు వేశారు.

ఓ యాభై రకాల పదార్ధాలతో విందు. ప్లేటు అయిదు వందల యాభై చొప్పున చెల్లించాలి. ప్లేట్లు లెక్క పెట్టుకునే దగ్గర శ్యామ్ బావగారు నిలబడ్డారు. మూడు వందల మంది కి ఆర్డర్ ఇచ్చారు.ఫన్షన్ సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం.ఆ వేడుకకు కార్యక్రమం ఏమీ వుండదు కాబట్టి పాటల ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు ఓ గంటసేపు అద్భుతం గా పాడారు.మామూలుగా అయితే ఏ వేడుకకు వెళ్ళినా ఆదరా బాదరా అక్షింతలు వేసేసి భోజనం చేసేసి హడావిడిగా వెళ్లిపోయే హైదరాబాద్ జనం కూడా సావకాశం గా కూచుని పాటలు విన్నారు.
ఆ తరువాత పిల్లను సింహాసనం మీద కూర్చోబెట్టి హారతి ఇచ్చారు. అందరూ వరసగా వెళ్ళి అక్షింతలు వేసి  ఇవ్వదల్చుకున్నది ఇచ్చి ఫోటోలు తీయించుకుని భోజనానికి వచ్చారు. బఫే దగ్గర చాలా హడావిడిగా ఉంది. కొన్ని చోట్ల  క్యూ కడుతున్నారు.  ఎవరికి తోచింది వారు తింటున్నారు. శ్యామ్ వైపు వాళ్ళు ఇద్దరు అతిథుల మీద ఓ కన్ను వేసి వుంచారు. బయటి వాళ్ళు వచ్చి తిని పోకుండా చూసుకుంటున్నారు. ఒక బల్ల దగ్గర ఆరుగురు యువకులు కూచుని వున్నారు.  వాళ్ళలో వాళ్ళే కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరో గుర్తు రాలేదు వీళ్ళకి.శ్యామ్ భార్యని పిల్చి చూపించారు. ఏమో ఎవరో. నాకూ తెలియదు అంది ఆవిడ.అనుమానం బలపడింది. మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శ్యామ్ మేనల్లుడు.వాళ్ళు తినటం ఆపేశారు."హాల్లో. ఫుడ్ ఎలా వుంది?  బావుందా ? అని అడిగాడు.
 వాళ్ళ మొహాల్లో  కాస్త భయం.ఆ. చాలా బావుంది. అన్నాడు అందులో ఒక అతను." థాంక్స్. క్షమించాలి. మిమ్మల్ని గుర్తు పట్టలేదు.
 మీరు ఎవరు?" మర్యాద గా  అడిగాడు.

"మేము శ్యామ్ గారి వైపు." అన్నాడు ఒక అబ్బాయి.లోపలికి వచ్చే ముందు శ్యామ్ గారి అమ్మాయి ఓణీ ల వేడుక అని బోర్డ్ చూసే వచ్చారు. వాళ్ళు చెప్పినా, వాళ్ళ వాలకం చూస్తే  స్పష్టంగా తెలిసిపోతోంది. నిజానికి అంతమందిలో నలుగురు తింటే పోయేది ఏముంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నారు ఈమధ్య.కానీ అటువంటి వాళ్ళు కాస్త సందడి తగ్గాక  పనివాళ్ళు తింటున్న సమయం లో వస్తారు.
వీళ్ళు అట్లా కాకుండా  ముందు వరుసలోనే వచ్చి కూచున్నారు .వాళ్లకు బుద్ధి చెప్పాలని అనిపించింది అతనికి.వెళ్ళి శ్యామ్ ని పిలుచుకు రమ్మని ఎవరికో చెప్పి పంపించాడు వాళ్ళ మొహాల్లో భయం. అప్పటిదాకా అవురావురు మని తింటున్న వాళ్లు  తలవంచుకుని ప్లేట్ లో గీతలు గీయటం మొదలు పెట్టారు. అక్కడికి వచ్చాడు శ్యామ్  "మావయ్యా! వీళ్ళు మీ ఫ్రెండ్స్ ట.  హలో చెప్తావని పిలిపించాను." అన్నాడు మేనల్లుడు. శ్యామ్ వాళ్ళ వంక చూశాడు.వాళ్లకి వణుకు పుట్టుకు వచ్చింది.

ఒక క్షణం తర్వాత చిన్నగా నవ్వాడు శ్యామ్.  "హాల్లో ఎంత సేపు అయ్యింది వచ్చి ?" అంటూ పలకరించాడు ఆ కుర్రాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళ గుండెలు కుదుట పడ్డాయి. తమని  చూసి  ఇంకెవరో అనుకున్నారు. బతికాం అని ఊపిరి పీల్చుకున్నారు. శ్యామ్ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు.చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి "ఇప్పుడు చెప్పండి . ఎవరు మీరు?" అన్నాడు ఆదరం గా. వాళ్ళు మాట పలుకు లేకుండా బిగుసుకు పోయారు.

"పర్వాలేదు చెప్పండి." అన్నాడు శ్యామ్. వాళ్ళలో ఒకడు కాస్త తేరుకున్నాడు. చెప్పటం మొదలు పెట్టాడు.వాళ్లంతా చదువు పూర్తి చేసేసి ఉద్యోగాల కోసం పట్టణానికి వచ్చారు. ఒక చిన్న గది తీసుకుని ఉంటున్నారు. ఎవరికి నిలకడైన ఉద్యోగం దొరకలేదు. అందరివి   పేదకుటుంబాలే. 5 రూపాయల భోజనం దగ్గర తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇవ్వాళ ఇటుగా వచ్చారు.బయట లాన్లో విందు ఎవరు అడ్డుకోక పోయేసరికి మెల్లిగా జొరపడిపోయారు."మంచి భోజనం కంట పడే సరికి కంట్రోల్ చేసుకో లేక పోయాం. క్షమించండి "
 చెప్తుంటే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  శ్యాంకి కూడా కళ్ళు చెమర్చాయి." మీరు నిదానంగా భోజనం చేయండి ." అని వాళ్లకి చెప్పి వీళ్ళు తిన్నాక నా దగ్గరికి తీసుకురా  అని మేనల్లుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగిలిన అతిథులను పలకరించడంలో మునిగిపోయాడు.

ఆ కుర్రాళ్లు భోజనాలు ముగించి మొహమాటపడుతూనే శ్యామ్  దగ్గరికి వెళ్ళారు. వాళ్ళను పక్కకు తీసుకు వెళ్ళి ఇదుగో చిన్న రిటర్న్ గిఫ్ట్ అంటూ తలా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాడు శ్యామ్.వాళ్ళు చాలా మొహమాట పడి పోయారు"వద్దు సార్ వద్దు సార్!" అన్నారు
"పరవాలేదు తీసుకోండి అందరికీ రిటర్న్ గిఫ్ట్  ఇస్తున్నాను మీకు ఇది. ఆల్ ద బెస్ట్." అని చెప్పాడు.వాళ్ల కు నోట మాట రాలేదు.
 తమ మనసులోని భావం అంతా చూపుల ద్వారానే తెలియజేస్తూ అతనికి వినయంగా నమస్కరించి వెళ్లిపోయారు. ఆ చూపులకి తట్టుకోలేకపోయాడు శ్యాం.  ఒక్కసారి తన గతం గుర్తుకొచ్చింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండగా హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. అతని సంపాదన ఆగిపోయింది. తల్లి ఏదో చిన్న ఉద్యోగంలో లో చేరినా ఆ డబ్బు ఏ మూలకీ వచ్చేది కాదు.ఏ విధంగా జీవనం సాగిస్తూ చదువు పూర్తి చేశాడో ఆ భగవంతుడి ఎరుక. డబ్బుకి కటకటలాడినా తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉండటం వల్ల మంచి మార్కులతో పాసయ్యాడు.  పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు కాలేజీ నుండి ఆర్థిక సహాయం  దొరికింది కానీ మిగిలిన వాటికి అప్పు చేయాల్సి వచ్చింది. అమెరికా వెళ్ళాక కూడా ఎన్ని కష్టాలు పడ్డాడో.అతని పరిస్తితి చూసి చాలా మంది సాయం చేశారు. క్లాస్ మేట్ డిక్ పిజ్జా ముక్క,  డో నట్ కొని పెట్టే వాడు .తెలుగు వారు ఇంటికి పిల్చి ఓ పూట భోజనం పెట్టే వాళ్ళు.ఆ తరువాత ఒక డిపార్ట్ మెంట్ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం దొరికింది. కాస్త నిలదొక్కుకున్నాడు. కష్టపడి చదువు పూర్తి చేశాడు.ఉద్యోగం దొరికింది. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాగా పైకి వచ్చాడు  వృద్ధిలోకి వచ్చినా కళ్లు నెత్తికి ఎక్కలేదు. తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తూనే ఉంటాడు. అలా సాయం చేసే సమయంలో అతనికి ఎనలేని తృప్తి కలుగుతుంది. ఎవరి ఋణమో తీర్చుకున్న భావన కలుగుతుంది.
 ఆవేళ  అదే జరిగింది. ఆ కుర్రా ళ్లను చూస్తుంటే తన గతం గుర్తుకు వచ్చింది. తను ఆదరించగానే వాళ్ళు చూసిన చూపుతో మనసు నిండిపోయింది. చాలు. ఇంత వేడుక చేసుకున్నందుకు  వాళ్ళ ఆశీసులు నా కూతురికి అందుతాయి. నా జన్మధన్యం. అనుకున్నాడు తృప్తిగా.

మరిన్ని శీర్షికలు
mamidipoota