కొన్ని సినిమాలకు, ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలకూ, మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలకు అనూహ్యంగా వివాదాలు తలెత్తుతున్నాయి. కులం పేరుతోనో, విలన్ పేరుతోనో, పాట పేరుతోనో, కథ పేరుతోనో.. ఇలా ఒక్కటి కాదు, ఏ చిన్న కారణం దొరికినా పెద్ద వివాదం రేపేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. అలా గతంలో 'నాయక్' సినిమాకి విలన్ పేరు మీద వివాదం రేగిన సంగతి తెలిసిందే. 'మగధీర'కు పాట రూపంలోనూ, రీమేక్ మూవీ అయినా, చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ'కి కథ రూపంలోనూ వివాదాలు వెంటాడిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి సంబంధించి ఓ వివాదం తెర పైకి వచ్చింది. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఈ సినిమాని అడ్డుకునేందుకు దాదాపు 8 కోట్లు డిమాండ్ చేయడం అస్సలేమీ బాగోలేదన్నది ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వాదన. అయితే, సినిమా నిర్మాణ బడ్జెట్‌తో పోల్చితే ఇదేమంత పెద్ద అమౌంట్ కాదనేది కొందరి అభిప్రాయం. కానీ, 100 ఏళ్లు దాటిన ఓ చరిత్రకారుడి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి ఎవ్వరి అనుమతీ తీసుకోవల్సిన అవసరం లేదు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధకు అదే వర్తిస్తుంది. కానీ, ఇలాంటి వివాదాలు ఎందుకు పుడతాయో అర్ధం కాదు. కేవలం పబ్లిసిటీ కోసమేనా.? లేదంటే, వెనక వేరే శక్తులుండి ఇలాంటి అర్ధం పర్ధం లేని వివాదాల్ని సృష్టిస్తాయో తెలీదు. ఏది ఏమైనా ఇలాంటి వివాదాలు కేవలం సినిమాల్ని అడ్డుకోవడానికి రేగిన అడ్డగోలు వాదనలే అనడం అతిశయోక్తి కాదు. 'సైరా' సంగతిలా ఉంటే, మరో మెగా హీరో మూవీ 'వాల్మీకి' కూడా వివాదాల్లోకెక్కడం కొసమెరుపు. బోయ తెగకు చెందిన వర్గం వారు 'వాల్మీకి' చేతిలో ఆయుధం (గన్) ఉండడాన్ని తప్పు పడుతూ సినిమా షూటింగ్‌ని నిలిపివేసేందుకు కారణమవడం మరో ఫ్రెష్ అప్‌డేట్.
|